విశాఖ మాస్క్ తగిలించాల్సిందేనా…?

విశాఖ మహానగరానికి జబ్బు చేసింది.జలుబు దగ్గు జ్వరాలతో ఇబ్బందిపడుతోంది. గత కొంతకాలంగా నగరంలో వైరల్ ఫీవర్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన పడుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు అయితే విశాఖ…

విశాఖ మహానగరానికి జబ్బు చేసింది.జలుబు దగ్గు జ్వరాలతో ఇబ్బందిపడుతోంది. గత కొంతకాలంగా నగరంలో వైరల్ ఫీవర్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన పడుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు అయితే విశాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

ఫీవర్ సర్వేను విశాఖలో నిర్వహిస్తే కొంత అనుమానంగా పరిస్థితి ఉందని అంటున్నారు. ఈ రోజున దేశంలో కలవరపాటుని రేకెత్తించే హెచ్ టూ ఎన్ త్రీ వైరస్ ఏమైనా వ్యాప్తి చెందుతోందా అన్న సందేహాలు కలుగుతున్నాయట. వరసబెట్టి జలుబు దగ్గుతో పాటు శ్వాసకోశ సమస్యలతో  కూడా జనాలు అంతా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. మామూలుగా వచ్చే జలుబు దగ్గు రెండు మూడు రోజుల పాటే ఉంటుంది. ఆ మీదట తగ్గిపోతుంది.

కానీ రెండు మూడు వారాలు గడచినా ఈ జలుబు పీడ వదలడంలేదు. అలాగే దగ్గు కూడా అట్టేపెట్టుకుని ఉంది. ఇక శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందులు సైతం తలెత్తుతున్నాయి. దీంతో వైరస్ భయాలు అయితే జనాలను పట్టి పీడిస్తున్నాయి. అయితే వైద్య అధికార వర్గాలు మాత్రం జనాలు అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని, గోరు వెచ్చటి నీరు తాగుతూ వేడి ఆహార పధార్ధాలను తీసుకుంటే సరిపోతుందని అంటున్నారు. జన సమూహంలోకి వచ్చినపుడు మాస్క్ ని కట్టుకుంటే ఏ వైరస్ కూడా వ్యాప్తి చెందదని అంటున్నారు.

ప్రభుత్వం కూడా ఆరోగ్య కేంద్రాల వద్ద అవసరమైన మందులను ఏర్పాటు చేసింది. దీని మీద మంత్రి విడదల రజనీ అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టి అలెర్ట్ చేశారు. ప్రజలు తమకు ఏమైనా ఆరోగ్యకరమైన ఇబ్బందులు వస్తే వెంటనే ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.

విశాఖ చూస్తే మాత్రం ఇపుడు జ్వరాలతో వేడెక్కిపోతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద వందల సంఖ్యలో జ్వర పీడితులు కనిపిస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల వద్ద పెద్ద క్యూ కనిపిస్తోంది. జ్వరాల నగరంగా విశాఖ మారుతోందని అంటున్నారు. అయితే మాస్క్ ఒక్కటే ఈ సమయంలోనూ రక్షణ కవచం అని వైద్య నిపుణులు చెబుతున్నారు.