ఎమ్బీయస్‍: రేటు తగ్గిస్తే అవమానమా?

ఏ పాత్రనైనా అవలీలగా వేయగల చక్కటి నటుడు నాని. నాకు యిష్టమైన అభినేత. స్టేటుమెంట్లు యిచ్చినపుడు కూడా పద్ధతిగా యిస్తాడు. టక్ జగదీశ్ ఒటిటి రిలీజు విషయంలో మంచి వివరణ యిచ్చాడు. మరి అలాటిది…

ఏ పాత్రనైనా అవలీలగా వేయగల చక్కటి నటుడు నాని. నాకు యిష్టమైన అభినేత. స్టేటుమెంట్లు యిచ్చినపుడు కూడా పద్ధతిగా యిస్తాడు. టక్ జగదీశ్ ఒటిటి రిలీజు విషయంలో మంచి వివరణ యిచ్చాడు. మరి అలాటిది ‘సినిమా టిక్కెట్టు రేటు తగ్గిస్తే ప్రేక్షకులను అవమానించినట్లే’ అని ఎలా అన్నారో నాకు అర్థం కాలేదు. టిక్కెట్టు రేటు ఎంత వుండాలి అనే సాంకేతిక విషయంపై చర్చకు నేను వెళ్లటం లేదు. కానీ దేనికైనా ధర తగ్గిస్తే వినియోగదారుణ్ని అవమానపరిచినట్లే అనే వాదన అతను తెరపై వేసే మిడిల్ క్లాసు అబ్బాయి పాత్రల వాదనలా లేదు. అతను నిజజీవితంలో ధనికుడై వుంటాడనుకున్నా, మరి డబ్బున్నవాళ్లూ బేరాలాడడం చూశాను. ఆయన నిర్మాతగా తీసిన సినిమాలకు పనిచేసిన తారాగణానికి, సాంకేతిక నిపుణులకు వారడిగిన దానికంటె ఎక్కువ యిచ్చారేమో మరి!

ఏ వస్తువుకైనా సరే ధర తగ్గిస్తే బేరాలు పెరుగుతాయన్నది యూనివర్శల్ ట్రూత్. ఏదైనా ఉత్పాదనను కొత్తగా మార్కెట్లోకి ప్రవేశపెట్టినపుడు ధర తగ్గిస్తారు, లేదా ఒకటి కొంటే మరోటి ఫ్రీ అంటారు. మార్కెట్‌లో ఎస్టాబ్లిష్ అయ్యాక కూడా కొత్తదేదైనా వచ్చి పోటీపడితే అప్పుడూ పాత ధరకే ఎక్కువ క్వాంటిటీ వంటి ఆఫర్లు యిచ్చి మార్కెట్ నిలబెట్టుకుంటారు. మరి కొంతమంది కూపాన్లు అని, క్యాష్‌బ్యాక్ అని రకరకాలుగా వినియోగదారులను ఆకట్టుకుంటారు. కొనేవాళ్లు సంతోషంగా ఆ ఆఫర్లను వినియోగించుకుంటారు తప్ప తమను అవమానించినట్లు ఫీలవ్వరు. ఇప్పుడు సూపర్ మార్కెట్లు వచ్చాక అలవాటు పోయింది కానీ గతంలో అయితే ఏదైనా కొన్న తర్వాత కొసరు యిమ్మనమని దుకాణదారును అడిగి పుచ్చుకునేవారు. ఇప్పుడు దాన్ని వేరేలా యిస్తున్నారు. ఫేస్‌క్రీమ్ కొంటే షాంపూ ప్యాకెట్టు పిన్ చేసి యిస్తున్నారు. ఈ ప్యాకెట్టు తీసుకోవడం నామర్దా అని ఏ కస్టమరూ వెనక్కి యిచ్చేయడు.

అంతెందుకు లక్షలు పెట్టి పెద్ద కారు కొన్నవాడు కూడా పెట్రోలు ధరలు తగ్గాలంటూ విజ్ఞప్తి చేస్తాడు తప్ప ‘ఇంత ఖరీదైనా కారు కొన్నవాణ్ని లీటరు 200 పెట్టి పెట్రోలు కొనలేనా?’ అని బడాయికి పోడు. ఈ వాదనలన్నీ వస్తువులకే వర్తిస్తాయని అనుకోకూడదు. సినిమాలకు కూడా వర్తిస్తాయి. గతంలో ఒక టిక్కెట్టుపై రెండు సినిమాలు చూపించేవారు. ఆ తర్వాత క్లాసు కన్సెషన్లు వచ్చాయి. అంటే ఐదణాల టిక్కెట్టు కొంటే, తొమ్మిది అణాల క్లాసులో కూర్చోబెట్టేవారు. తొమ్మిది అణాలది కొంటే 12 అణాల దానిలో.. యిలా! ఛ, నేను ఏది కొంటే దానిలోనే కూర్చుంటా తప్ప నీ దయాదాక్షిణ్యం అక్కలేదు అని ఏ ప్రేక్షకుడు నిరసన తెలపలేదు.

ఇది కాకుండా మంచి సినిమాలైతే మంచి సినిమాలకు వినోదపు పన్ను మినహాయింపు వుండేది. 2017లో ‘‘గౌతీమీ పుత్ర శాతకర్ణి’’ సినిమాకు కూడా యిచ్చారు. ఆ బెనిఫిట్ ప్రేక్షకులకు పాస్ ఆన్ చేసి, టిక్కెట్టు తగ్గించారో లేదో నాకు తెలియదు కానీ, గతంలో అయితే టిక్కెట్టు ధర తగ్గించేవారు. పన్ను మినహాయింపు యిచ్చినపుడు ఆత్మాభిమానం మెండుగా గల బాలకృష్ణ హుంకరించలేదు. సంతోషించి ముఖ్యమంత్రులను కలిశారు. ఇదొక్కటే కాదు, మా రాష్ట్రంలో షూటింగు జరుపుకుంటే సబ్సిడీలిస్తామంటే నిర్మాతలు ఫీలవరు, యించక్కా తీసుకుంటారు. అలాగే ఇళ్ల స్థలాలు ఉచితంగానో, తక్కువ రేటుకో యిస్తామంటే సినీ కళాకారులు, టెక్నీషియన్లు అవమానంగా ఫీలవటం లేదు. నిక్షేపంలా పుచ్చుకుంటున్నారు. నాని కూడా పారితోషికం దగ్గర మొహమాట పడతాడని, ఎక్కువ యిస్తే అగౌరవంగా ఫీలవుతాడని అనుకోవటం లేదు.

వ(ర)ల్డ్‌స్పేస్ శాటిలైట్ రేడియో నేను 2005, 06 లలో రేడియో జాకీగా వుంటూ వారానికి ఓ సారి ‘‘పడక్కుర్చీ కబుర్లు’’ చెప్పే రోజుల్లో కొన్ని నెలలపాటు నాని నాకు కొలీగ్. నా పడక్కుర్చీ కబుర్లు 3ని నా వ(ర)ల్డ్‌స్పేస్ సహచరులకు యిచ్చిన అంకితంలో అతని పేరూ (నవీన్‌బాబు) కనబడుతుంది. రికార్డింగు టైములు వేరే వుండేవి కాబట్టి, రెండు, మూడు సార్ల కంటె ఎక్కువగా కలిసిన గుర్తు లేదు. అప్పట్లోనే రేడియోలో నాని పేరుతోనే కార్యక్రమాలు చేసేవాడు. ‘లేటుగా వచ్చినా, లేటెస్టుగా వచ్చా’ అనే ట్యాగ్‌లైన్ కూడా వుండేది. చాలా హుషారుగా మాట్లాడేవాడు. నాకు ప్రసంగానికి వెయ్యి రూపాయలు యిచ్చేవారు. క్రమేపీ దాన్ని రెండు వేలకు పెంచారు. నానికి కూడా అ పద్ధతిలోనే యిచ్చి వుండవచ్చు. అప్పుడతను ‘ఎందుకండీ, అసిస్టెంటు డైరక్టరుగా పనిచేస్తూ సంపాదించుకుంటున్నాను. ఇదిచ్చి నన్నెందుకు అవమానిస్తున్నారు?’ అని అన్నాడని నేను వినలేదు. వచ్చే చోట ఎక్కువ రాబట్టడం, యివ్వవలసిన చోట సాధ్యమైనంత తక్కువ యివ్వడం లోకంలో అందరూ చేసే పని. అమెజాన్ సేల్స్ పెట్టినపుడు అన్ని వర్గాల వారూ బుక్ చేయడం గమనించాను. మరి నాని మాత్రం ‘ఇన్సల్ట్’ అని చేయరేమో!

మనుష్యులందరూ బజెట్‌కు లోబడే బతుకుతారు. ఆర్టిస్టు చంద్ర రాసిన కథ ఒకటుంది. దాని పేరు ‘బజెట్ బతుకులు’ అనుకుంటా. ఒక చిరుద్యోగి. పెళ్లి చేసుకునే స్తోమత లేదు. ఒకామెను అప్పుడప్పుడు రూముకి రప్పించుకుంటూ వుంటాడు. ఓసారి వచ్చినపుడు ఆమె ‘బయట ధరలన్నీ పెరిగిపోయాయి కదా, నాకు పది రూపాయలు ఎక్కువివ్వు.’ అంటుంది. అతను కాస్సేపు ఆలోచించి సరేనంటాడు. ఆమె వెళ్లిపోయేటప్పుడు ‘ఇక నుంచి నెలకు మూడు సార్లు కాదు, రెండు సార్లే’ అని చెప్తాడు. ఇలా ధర అనేది మన జీవితంలో ప్రతి పార్శ్వాన్ని నిర్దేశిస్తుంది. దేని కోసం ఎంత ఖర్చు పెట్టాలి అనేదానిలో ప్రతి కుటుంబానికి ఒక లెక్క వుంటుంది. తిండీ, బట్ట, యింటద్దె వంటి ముఖ్యావసరాలకు వెచ్చించగా వినోదానికి కూడా కొంత కేటాయింపు వుంటుంది. అన్నిటి కంటె అతి చవకైన వినోదం అందించేది సినిమాయే! అందుకని అందరూ థియేటర్లకు వెళ్లి సినిమా చూసేవారు. సినిమా బాగుంటే రెండు, మూడు సార్లు కూడా చూసేవారు, పెద్దగా ఖర్చుండేది కాదు కాబట్టి.

పోనుపోను ఎసి థియేటర్లు వచ్చాయి. బయట అద్దాల వంటి హంగులు పెరిగాయి. టిక్కెట్లు పెంచారు. గతంలో యింటర్వెల్‌లో ప్రేక్షకులను బయటకు వదిలేవారు. బయట వేరుశెనక్కాయలు కొనుక్కుని ఆకలి తీర్చుకునేవారు. తర్వాత ఆ పద్ధతి పోయి, గేట్లు మూసేసి, థియేటర్లో అమ్మే ఖరీదైన తినుబండారాలే తినాలని, వాళ్లు చెప్పిన ధరకే కూల్‌డ్రింకులు తాగాలని షరతులు పెట్టారు. పార్కింగు ఫీజులూ పెరిగాయి. దాంతో సినిమా ఖర్చులు తడిసిమోపెడయ్యాయి. పిల్లలతో సినిమాకు వెళ్లడమంటే బాబోయ్ అనే పరిస్థితి వచ్చింది. ‘వీడియో తెచ్చుకుని చూద్దాం’ అనుకోసాగారు. తర్వాత టీవీలో చూద్దామనుకున్నారు, యిప్పుడు ఒటిటిలో చూద్దాంలే అనేస్తున్నారు. ఇలా సామాన్యులకు దూరం కావడం చేతనే థియేటర్లకు బిజినెస్ కావడం మానేసింది. వాళ్లు టాయిలెట్స్ మేన్‌టేన్ చేయడం మానేశారు. దాంతో యింకొందరు రావడం మానేశారు.

మేం కాలేజీలో చదువుకునే రోజుల్లో మా పట్టణంలో బాల్కనీ టిక్కెట్టు రూ.1.50 వుండేది. నా స్నేహితులిద్దరు ఎమ్మెస్సీ కోసం ఆగ్రా వెళ్లారు. ‘అబ్బ, హిందీ సినిమాలు రిలీజైన వారంలోనే చూడచ్చు ఎంచక్కా’ అని మెచ్చుకుంటే ‘ఏం వెళతాం? ఇక్కడ థియేటర్లలో టిక్కెట్టు ధర ఎక్కువ. బాల్కనీ 4 రూ.లు. సినిమాలు తగ్గించేశాం.’ అన్నారు. ఇప్పటికి కూడా ఉత్తర భారతంలో థియేటర్ల క్వాలిటీ తక్కువ, రేట్లు ఎక్కువ. దాని కారణంగా జనం ఎక్కువగా వెళ్లరు. జనాభా-థియేటరు నిష్పత్తి చూస్తే నార్త్ కంటె సౌత్‌లో ఎక్కువ. అందుకే దక్షిణాదిన ప్రతి భాషలో వందలాది సినిమాలు తయారవుతాయి. హిందీ భాషీయులున్న నిష్పత్తికి సరిపడా హిందీ సినిమాలు తయారు కావు. ఎందుకంటే సినిమా టిక్కెట్లు ధర ఎక్కువగా పెట్టారు కాబట్టి! ఇప్పుడు సినిమా టిక్కెట్టు ధరతో పాటు క్యాంటీను నిబంధనలు కూడా సవరిస్తే, ఆంధ్ర జనాలు సినిమా థియేటర్లకు రావడం పెరగవచ్చు.

తమిళనాట సినిమాలు, రాజకీయాలు పెనవేసుకుని వుండేవి. డిఎంకె మద్యనిషేధం పాటించడానికి మొగ్గు చూపడం దేనికంటె ఎమ్జీయార్ సినిమాలకు డిమాండు తగ్గకుండా వుండడానికి అనేవారు. పేదవాడి చేతిలో రూపాయి వుంటే వాడు సారా తాగడానికి వెళ్లిపోతాడు, మద్యనిషేధం పెడితే అటు వెళ్లకుండా ఆ రూపాయితో సినిమా చూసి వినోదం పొందుతాడు. ఆ సినిమా ద్వారానే మన పార్టీ సందేశాన్ని అతనికి అందించవచ్చు అనేది డిఎంకె లాజిక్‌ట. రాజకీయాలకు సినిమా అవసరం తగ్గిపోయాక, మద్యనిషేధం ఎత్తివేశారు. ఇప్పుడు ఆంధ్రలో సారాయి ధర పెంచి, సినిమా ధర తగ్గిస్తే జనం థియేటర్లకు మొగ్గు చూపవచ్చు. రేటు తగ్గించారు కదాని కోపగించుకుని వెళ్లడం మానేయరు.

పైరసీ జరుగుతున్నాక, థియేటర్లకు వచ్చేవాడెవడు? అనే మాట ఒట్టిది. నానియే చెప్పినట్లు థియేటరు ఎక్స్‌పీరియన్స్‌కు ఏదీ సాటి రాదు. థియేటరును సౌకర్యవంతంగా చేస్తే తప్పకుండా వస్తారు. మళ్లీమళ్లీ వస్తారు. ఆంధ్ర ప్రభుత్వానికి, థియేటరు యాజమాన్యాలకు లడాయి రావడం మంచికే వచ్చింది. ఆదాయం కోసం భిక్షాపాత్ర పట్టుకుని దేశమంతా తిరుగుతున్న ప్రభుత్వం తన దివాణంలోనే దశాబ్దాలుగా జరుగుతున్న యిన్‌కమ్ లీకేజిని యిన్నాళ్లూ చూసుకోలేదు. అనేక థియేటర్ల నుంచి లైసెన్సు రిన్యూవల్ ఫీజు వసూలు చేయలేదు. ఇప్పుడు సూది కోసం సోది కెళితే చాలా బయటపడ్డాయి.  ఫయర్ ఎస్కేప్ లేదని, పరిశుభ్రత లేదని, క్యాంటీన్‌ల నిర్వహణ బాగా లేదని యివన్నీ తెలిసివచ్చాయి. ఇవన్నీ క్షాళన చేస్తే తప్ప లైసెన్సు రెన్యూ చేయం అంటున్నారు, ప్రస్తుతానికి.

ఫయర్ ఎస్కేపుల గురించి నిబంధనలు వున్నా అవి పట్టించుకోకుండా ఆసుపత్రులు, హోటళ్లు నడిచేస్తూ వుంటాయి. ప్రమాదం జరిగాక మాత్రమే అవి వెలుగులోకి వస్తాయి. ఇప్పుడు ప్రమాదం జరగకుండానే సినిమాహాళ్లలో లోపాలు వెలికిరావడం ప్రేక్షకుల అదృష్టం. సాధారణంగా కాలేజీల్లో ల్యాబ్ లేదని, బోధనాసిబ్బంది లేరని వంటి లోటుపాట్లు బయటపడి కాలేజీ మూసేస్తామని ప్రభుత్వం అనగానే యాజమాన్యాలు ‘ఇప్పటికే చదువుకుంటున్న విద్యార్థుల భవిష్యత్తు దెబ్బ తింటుంది’ అనే కారణం చూపించి మూతపడకుండా చూసుకుంటాయి. అలాగే సెట్‌బ్యాక్‌లు లేకుండా బిల్డింగులు, అనుమతి లేకుండా ఫ్లోర్లకు ఫ్లోర్లు వేసేసిన బిల్డర్లు కోర్టు ఆదేశాల మేరకు కూల్చేస్తామని ప్రభుత్వం అంటే వీటిని కొనుక్కున్న మధ్యతరగతి వాళ్లు చితికిపోతారంటూ స్టేలు తెచ్చుకుంటారు. సినిమాహాళ్ల విషయంలో అలాటి పప్పులు ఉడకవు. మూసేస్తే ప్రేక్షకులు యిబ్బంది పడరు. ఇదేమీ నిత్యావసరం కాదు.

ఈ రోజు వందల సంఖ్యలో థియేటర్లు మూతపడుతున్నాయంటే, వాళ్లంతట వాళ్లే మూసేసు కుంటున్నారంటే ఎన్ని లోపాలతో నడుపుతున్నారో స్వయంగా ఒప్పుకున్నట్టయింది. అబ్బే, యీ ధరలు కిట్టుబాటు కాదని మూసుకుంటున్నారు అంటే, ఆ ధరలతో వారమో, రెండు వారాలో నడిపి, ఆదాయవ్యయాల పట్టిక చూపించి, ఇలా అయితే వ్యాపారం సాగదని ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసేవారు. ఆ మార్గం ఎంచుకోకపోవడం పొరబాటు. ఇక్కడ గమనించ వలసినదొకటుంది – ప్రభుత్వాసుపత్రుల్లో జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తే ప్రభుత్వం కంగారు పడుతుంది. సినిమా హాళ్లు మూసుకుంటే చెరువు మీద అలిగినట్లే వుంటుంది. తెలుగు సినిమా పరిశ్రమకు ఆంధ్ర నుంచి తెలంగాణ కంటె రెట్టింపు ఆదాయం వెళుతుందని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాశారు. కానీ పన్నుల రూపేణా వచ్చేది బహు తక్కువ. ఎందుకంటే సినిమా కంపెనీల ఆఫీసులన్నీ తెలంగాణలోనే వున్నాయి.

ఇక రావలసినది ఏదైనా వుందా అంటే థియేటర్ల నుంచి వినోదపు పన్ను రూపంలో రావాలి. దాన్ని కూడా రికార్డులను మసిపూసి మారేడుకాయ చేసే థియేటర్లు ఎగ్గొడుతున్నాయి. కలక్షన్లు యింత వచ్చాయని ప్రకటనలు యిచ్చే నిర్మాతలు, పన్ను దగ్గరకు వచ్చేసరికి అబ్బే ఏమీ రాలేదని ప్రభుత్వానికి చెప్తున్నారు. ఇప్పుడు థియేటర్ల పట్ల కఠినంగా వ్యవహరించడం వలన ఇన్నాళ్లూ థియేటర్లతో కుమ్మక్కయిన అధికారుల ఆదాయానికి గండి పడింది తప్ప ప్రభుత్వానికి వచ్చే నష్టం పెద్దగా లేదు. థియేటర్లు బాగుపడాలనే కోరిక వున్నవాళ్లు అవి నిబంధనలకు అనుగుణంగా వుండాలని, టిక్కెట్టు రేట్లు తక్కువలో వుండాలని కోరుకుంటారు.

అలా కోరుకోనివాళ్లెవరంటే పెద్ద సినిమా రిలీజైన రెండు వారాల్లో హంగు చేసి, ప్రేక్షకులను ఊదరగొట్టి, అబద్ధపు ప్రచారాలు చేసి, సాధ్యమైనంత నొల్లేసి, తర్వాత థియేటర్లు ఖాళీగా వున్నా ఫర్వాలేదనుకునేవారు! రెండు వారాల్లో డబ్బు రాబట్టవలసిన అవసరం ఉన్నవాళ్లెవరు? 70-80 కోట్లతో సినిమా తీసి, దానిలో సగానికి పైగా హీరోకి యిచ్చి, నీటిలో గేదెను పెట్టి బేరమాడినట్లు, ఆ హీరో యిమేజితో సినిమాను రిలీజుకి ముందే అమ్మేసుకునే నిర్మాతలు మాత్రమే! 10 కోట్లకు లోపు బజెట్‌తో నిర్మాణం జరిగి, అలాటి ప్రి-రిలీజు అమ్మకాల సావకాశం లేని అనేకానేక సినిమాలకు థియేటర్లలో అందుబాటు టిక్కెట్లలో సినిమా నాలుగు వారాలు ఆడితేనే మేలు. పెద్ద హీరోలు మాత్రమే బాగుపడాలా, సినిమా పరిశ్రమలో చిన్నాచితకా కూడా బాగుపడాలా అనేది ఏ సిఫార్సూ లేకుండా, స్వయంకృషితో పైకి వచ్చిన నాని వంటి హీరో తేల్చుకుని లాజికల్‌గా మాట్లాడితే బాగుంటుంది.

ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2021)