వెంకన్న భక్తులకు అద్భుతమైన వరం!

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు తిరు వేంకటగిరినాధుని దర్శించుకునే భక్తకోటికి.. .2020 నూతనసంవత్సర కానుకగా.. తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యం అద్భుతమైన వరాన్ని ప్రకటించింది. Advertisement అసలు సిసలు భక్తులు.. సకల పాప హరణంగా, సర్వ ముక్తి…

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు తిరు వేంకటగిరినాధుని దర్శించుకునే భక్తకోటికి.. .2020 నూతనసంవత్సర కానుకగా.. తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యం అద్భుతమైన వరాన్ని ప్రకటించింది.

అసలు సిసలు భక్తులు.. సకల పాప హరణంగా, సర్వ ముక్తి ప్రదాయకంగా భావించే తిరుమలేశుని మహాప్రసాదం లడ్డూను.. ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. తిరుమలలో స్వామివారిని దర్శించుకునే ప్రతి భక్తుడికీ.. ఒక లడ్డూను ఉచితంగా అందజేస్తారు.

ఎంతెంతో దూరాల నుంచి.. శ్రీవారిని దర్శించి తరించేందుకు అపార భక్తితో తరలివచ్చే అశేష భక్తజనులకు మహాప్రసాదం ఉచితంగా లభించడం అనేది.. అద్భుతమైన కానుకగా భావించాలి.

ఇప్పటివరకు తిరుమలేశుని చెంతకు కాలినడకన వచ్చే భక్తులకు మాత్రమే ఇప్పటిదాకా ఉచితలడ్డూ ఇస్తున్నారు. అలాంటిది.. భగవంతుడి ఎదుట పేద-గొప్ప తేడాలు ఎంచకుండా, కాలినడకన వచ్చారా? కారులో వచ్చారా? అనే వ్యత్యాసాలు చూడకుండా.. అందరూ సమానమే అనే భావనను పాదుగొల్పుతూ.. దర్శించుకునే ప్రతి ఒక్క భక్తుడికీ ఒక లడ్డూ ఇవ్వడం అనేది గొప్ప నిర్ణయంగా అభివర్ణించాలి.

ఇప్పటిదాకా లడ్డూలు వివిధ ధరలకు అమ్ముతున్నారు. సర్వదర్శనం, దివ్యదర్శనం, టైంస్లాట్ లలో దర్శించుకునే వారికి రూ.10 వంతున రెండేసిలడ్డూలు, అదనంగా కావాలనుకుంటే రూ.25 వంతున మరో రెండు లడ్డూలు ఇస్తున్నారు. అంటే 70రూపాయలకు 4 లడ్డూలు వస్తాయి. అంతకంటె ఎక్కువ కావాలనుకుంటే.. రూ.50 వంతున ఎన్ని కావాలంటే అన్ని లడ్డూలు ఇస్తారు. అదే సమయంలో టీటీడీ ఉద్యోగులకు, రిటైరైన వారికి కూడా రూ.5 వంతున విక్రయిస్తున్నారు. ఇలా చాలా రాయితీలపై వెళుతున్నాయి. ఇలాంటి వాటన్నింటినీ ఇకపై ఎత్తివేస్తున్నారు.

ఇకమీదట స్వామిని దర్శించుకునే ప్రతిభక్తుడికీ ఒక లడ్డూ ఉచితంగా ఇస్తారు. ఆపైన ఎన్ని కావాలంటే అన్ని రూ.50 వంతున మాత్రమే ఇస్తారు. నిజంగా భక్తితో స్వామిని దర్శించుకుని లడ్డూను స్వామివారి ప్రసాదంగా భావించే వారికి ఇది అద్భుతం అనిపిస్తుంది. దీంతో.. లడ్డూ ప్రసాదాలను ఇతరులకు కానుకలుగా, పనులు చక్కబెట్టుకోవడానికి ముఖప్రీతికి ఇచ్చే లంచాలుగా భావించి ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేసేవారు.. ఆ దామాషాలో అధికధరకు కొనాల్సిందే.

సామాన్యభక్తులకు అత్యంత శ్రేయోదాకమైన రీతిలో టీటీడీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నందుకు అభినందించాలి.