పైకి మాత్రం నేను చంద్రబాబునాయుడు కూడా విమర్శిస్తున్నాను కదా అని ముసుగులు తొడుగుతారు.. చంద్రబాబునాయుడుకు కించిత్ హాని జరగకుండా… తెలుగుదేశం పార్టీ మీద గత ప్రభుత్వం మీద విమర్శలు కురిపిస్తారు. మళ్లీ ఆచరణలో మాత్రం చంద్రబాబు నడిచే బాటనే గుడ్డిగా ఫాలో అయిపోతుంటారు. ఇది పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అనుసరిస్తున్న రాజకీయ విధానం.
అమరావతి రైతుల పేరు చెప్పి, నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన ఆ మాట ప్రకటించి కూడా నాలుగు రోజులైంది. కాగా తన స్టొరీ డిస్కషన్ ల మధ్య కాసింత ఖాళీ దొరికి విజయవాడ షెడ్యూల్ పెట్టుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ కు అక్కడికి వెళ్ళిన తర్వాత గాని అమరావతి రైతులు ఏడుస్తున్నారు అనే సంగతి గుర్తుకు రాలేదు. నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం లేదంటూ నిర్ణయం ప్రకటించారు.
నిజానికి ఒకరిని చూసి ఒకరు రాజకీయ ఈ రెండు పార్టీలకు కూడా వేడుకలు జరుపుకునేందుకు మొహం చెల్లే పరిస్థితి లేదు. ఈ ఏడాది జరిగిన ఎన్నికలలో దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకుని.. ఏ మొహం పెట్టుకొని ప్రజల ఎదుట వేడుకలు జరుపుకోవాలో వారికి అర్థం కావడం లేదు. అందుకే ప్రతి వేడుకలను ఎగ్గొట్టడానికి ఏదో ఒక సాకులు వెతుక్కుంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
ఇప్పుడంటే చంద్రబాబు నాయుడు అమరావతి రైతులు విలపిస్తున్నారంటూ ఒక కథ చెబుతున్నారు. నవంబరు 1వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవడానికి ఆయనకు ఏమైంది? ఈ ప్రశ్నకు బహుశా ఆయన మరొక డొంక తిరుగుడు సమాధానం చెప్పగలరు గాక! ఈ ఏడాది ఎన్నికల ఫలితాలు వెలువడే ముందు… ప్రతి ఏటా తమ పార్టీ తరఫున అట్టహాసంగా జరుపుకునే మహానాడును ఆయన ఎందుకు రద్దు చేసుకున్నారు. ఆ విషయం ఆలోచిస్తే మర్మం ఏమిటో అందరికీ బోధపడుతుంది.
ప్రజల ఎదుట మొహం చెల్లక చంద్రబాబునాయుడు వేడుకలకు దూరం జరుగుతుండగా… తనకంటూ సొంత ఆలోచన లేనటువంటి, చంద్రబాబును మక్కీకి మక్కీ కాపీ కొట్టేటువంటి పవన్ కూడా అదే బాటలో వేడుకలకు దూరం కావడం చిత్రమే. వీరి బంధం అంత బలమైనది మరి!!