బీజేపీతో విభేదించిన తర్వాత ఇప్పటివరకూ చంద్రబాబుని ఆ పార్టీ నమ్మి దగ్గరకు తీసుకోకపోవడం, సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినా వివిధ కారణాల వల్ల ప్రభుత్వ పెద్దలకు దూరంగా ఉండటం.. ఇలాంటి టైమ్ లో పవన్ హస్తిన వెళ్లి ప్రధాని సహా వివిధ మంత్రులను కలసి, రాష్ట్ర సమస్యలు చర్చించినట్టు బిల్డప్ ఇచ్చి, ఓ మెమొరాండం ఇచ్చి, ఫొటోలు దిగి మీడియాకు చూపెడితే ఎలా ఉంటుంది?
నిజంగానే ఏపీలో పవన్ హీరో అయిపోరూ? అందుకే ఆయన ఆ ప్లాన్ వేసుకున్నారు. ఎలాగైనా ఢిల్లీ వెళ్లి మోదీని కలవాలని ఫిక్స్ అయ్యారు. అందులోనూ ప్రధాని మోదీకి తానేదో ప్రత్యేక సలహాదారు అయినట్టు, ఎప్పుడు కలవాలనుకుంటే అప్పుడు ఆయన్ను కలిసే చొరవ తనకున్నట్టు ఇక్కడ జనసేనాని తెగ బిల్డప్ ఇచ్చుకుంటుంటారు. ఆ బిల్డప్ నిజమని
నిరూపించుకోడానికి, రాష్ట్రంలో రచ్చ జరుగుతున్న ఈ టైమ్ లో ప్రధానమంత్రిని కలిసి ఏపీలో మొనగాడు అనిపించుకోడానికి పవన్ ఉబలాటపడుతున్నారు. దీనికి బీజేపీ నాయకత్వం కూడా సపోర్ట్ చేస్తున్నట్టు, ఢిల్లీలో లైన్ క్లియర్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు, ఏపీలో ఏకు మేకవుతున్న జగన్ కి చెక్ పెట్టాలంటే ఇలాంటి వాళ్లని ఎవరినైనా ఒకర్ని కేంద్రం హైలెట్ చెయ్యాలి. చంద్రబాబుతో అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు, అందుకే పవన్ ని నమ్ముకుని రంగంలో దిగాలని చూస్తోంది బీజేపీ. దీంతో మోదీ-పవన్ భేటీ ఫిక్స్ అయ్యేలా కనిపిస్తోంది.
అతి త్వరలో పవన్ ఢిల్లీ టూర్ ఫిక్స్ అవుతుందని సమాచారం. గతంలో ఓసారి ఢిల్లీ వెళ్లి అజ్ఞాతవాసిగా తిరిగొచ్చిన పవన్, ఈసారి ఢిల్లీకి వెళ్తే మాత్రం నాలుగు రోజుల హడావిడి లేనిదే తిరిగొచ్చేలా కనిపించడం లేదు. అయితే మోదీతో భేటీకి ఉవ్విళ్లూరుతున్న పవన్.. ఇప్పటికిప్పుడు తనకి, తన పార్టీకి అది ఏమాత్రం లాభమో బేరీజు వేసుకోవాలి. ఆ సంగతి పక్కనపెడితే కనీసం రాష్ట్రానికి ఆ భేటీ ఎంత వరకు ఉపయోగమో ఆలోచించుకోవాలి.