పంచుమర్తి అనురాధ పరువు తీసేందుకు బాబు రెడీ!

అక్కడికి.. ఇప్పుడేదో తెలుగుదేశం పార్టీ చాలా పరువుగా బతుకుతున్న పార్టీ అని అర్థం కాదు. ఆ పార్టీ నాయకుల అందరి పరువును చంద్రబాబునాయుడు కాపాడుతున్నాడని కూడా అర్థం కాదు. కాకపోతే.. కొత్తగా ఒక పసలేని…

అక్కడికి.. ఇప్పుడేదో తెలుగుదేశం పార్టీ చాలా పరువుగా బతుకుతున్న పార్టీ అని అర్థం కాదు. ఆ పార్టీ నాయకుల అందరి పరువును చంద్రబాబునాయుడు కాపాడుతున్నాడని కూడా అర్థం కాదు. కాకపోతే.. కొత్తగా ఒక పసలేని పని చేయడం ద్వారా.. పార్టీ నాయకురాలు, అంతో ఇంతో వైఎస్సార్ కాంగ్రెస్ మీద విరుచుకుపడడానికి తరచూ మీడియా ముందుకు వస్తూ ఉండే పంచుమర్తి అనురాధ పరువుకు సరికొత్తగా భంగం కలిగించడానికి చంద్రబాబు రెడీ అయినట్లుగా కనిపిస్తోంది. 

ఎట్టి పరిస్థితిలోనూ పార్టీ గెలిచే అవకాశం లేని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎలక్షన్లలో పంచుమర్తి అనురాధను తెదేపా తరఫున అభ్యర్థిగా దించడానికి ఆయన కసరత్తు చేస్తున్నారు.

ఇప్పుడు ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో కూడా ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న బీభత్సమైన సంఖ్యాబలం దృష్ట్యా మొత్తం అన్ని స్థానాలు వారికే దక్కే అవకాశం ఉంది. ఈనెల 13 లోగా నామినేషన్లు వేయాల్సి ఉండగా.. పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థులకు జగన్ ఆల్రెడీ బిఫారాలు కూడా ఇచ్చేశారు. నిన్నటిదాకా ఈ పోటీలో తెలుగుదేశం పార్టీ ఉంటుందనే మాట కూడా రాజకీయ వర్గాల్లో ఎక్కడా వినిపించలేదు. 

అయితే హఠాత్తుగా చంద్రబాబునాయుడుకు ఆలోచన వచ్చినట్టుగా ఉంది. ఆయన తమ పార్టీ తరఫున కూడా అభ్యర్థిని రంగంలోకి దించే ప్రయత్నంలో పడ్డారు. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయం సాధించాలంటే.. 22-23 మంది ఎమ్మెల్యేల  ఓట్లు కావాలి. తెలుగుదేశానికి సరిగ్గా 23 మంది బలం ఉన్న మాట నిజమే.. కానీ ఆ మందిలో నలుగురు ఆల్రెడీ జారుకున్నారు. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ శిబిరంలో ఉన్నారు. వారిని ఏమీ చేయలేని పరిస్థితి. 

అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా పంచుమర్తి అనురాధను బరిలోకి దించి, పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీచేయాలనేది టీడీపీ ఆలోచనగా ఉంది. విప్ జారీచేసినా సరే.. ఆ పార్టీ నెగ్గడం అసాధ్యం. ఫిరాయించిన ఎమ్మెల్యేలు గైర్హాజరైతే చేయగలిగేది ఏమీ ఉండదు. 

విప్ ను ధిక్కరించారని మళ్లీ స్పీకరుకే ఫిర్యాదు ఇవ్వాలి. ఆయన వారిని పిలిపించి విచారించడం అనే రూపంలో కొన్ని నెలలు గడిచిపోతాయి. ఈలోగా సార్వత్రిక ఎన్నికలే వస్తాయి. వారికి వచ్చే నష్టమేమీ ఉండదు. కాకపోతే.. చంద్రబాబునాయుడు అర్థంలేని దురాశకు మధ్యలో పంచుమర్తి అనురాధ పరువు పోతుంది. 

పార్టీకి పుష్కలంగా బలం ఉన్నప్పుడు అయిన వారికి టికెట్లు ఇచ్చుకుంటూ, టికెట్లు అమ్ముకుంటూ చెలరేగిన చంద్రబాబునాయుడు.. ఖచ్చితంగా ఓడిపోయే సందర్భంలో మాత్రం.. మహిళకు టికెట్ ఇస్తున్నా.. అని బిల్డప్ కోసం ఇలా చేస్తున్నారనే  విమర్శలు  పార్టీలోనే వినిపిస్తున్నాయి.