బ్లాక్ బస్టర్ కే దిక్కు లేదు, డిజాస్టర్ రీ రిలీజ్

ఎన్టీఆర్ సినిమా రీ రిలీజ్ కి రెడీ అవుతోంది. మామూలుగా ఇలాంటి వార్త బయటకు రాగానే ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు. ట్విట్టర్లో ట్రెండింగ్ మొదల పెడతారు. తమ అభిమాన హీరో సినిమా రీ రిలీజ్…

ఎన్టీఆర్ సినిమా రీ రిలీజ్ కి రెడీ అవుతోంది. మామూలుగా ఇలాంటి వార్త బయటకు రాగానే ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు. ట్విట్టర్లో ట్రెండింగ్ మొదల పెడతారు. తమ అభిమాన హీరో సినిమా రీ రిలీజ్ లో కూడా రికార్డులు బద్దలు కొడుతుందంటూ సవాళ్లు విసురుతారు. రీ రిలీజ్ కి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడ్డానికి రెడీ అవుతున్నామని చెబుతారు, కటౌట్లు కట్టడానికి రెడీ అవుతారు, హంగామా చేస్తారు. 

కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ రగిలిపోతున్నారు, ఇప్పుడెందుకు పాతగాయాన్ని రేపుతున్నారంటూ సోషల్ మీడియాలో బాధపడుతున్నారు. ఈ బాధంతటికీ కారణం ఆంధ్రావాలా రీ రిలీజ్.

2004లో భారీ హైప్ తో వచ్చి బోల్తా పడిన సినిమా ఆంధ్రావాలా. పూరీ జగన్నాథ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందనుకున్నారో, అంత పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఎన్టీఆర్ కెరీర్ లో అభిమానులు మరచిపోవాలనుకునే అతికొద్ది సినిమాల్లో ఆంధ్రవాలా కూడా ఒకటి. అలా మరచిపోయిన గాయాన్ని ఇప్పుడు పనిగట్టుకుని గెలికితే ఎలా ఉంటుంది. అందుకే అభిమానులకు మండింది. ఆంధ్రావాలా రీ రిలీజ్ ని ఆపండ్రోయ్ అంటూ సోషల్ మీడియాలో మెసేజ్ లు పెడుతున్నారు.

ఆమధ్య ఒక్కడు సినిమా రీ రిలీజ్ అయిన సందర్భంగా మహేష్ బాబు అభిమానులు పండగ చేశారు. థియేటర్లలో రచ్చ రచ్చ చేశారు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అప్ గ్రేడ్ చేసి ఒక్కడుని థియేటర్లలో వదిలారు, అనుకున్నదానికంటే ఎక్కువే రెస్పాన్స్ వచ్చింది. 

ఇక ఖుషీ కూడా అంతే. పవన్ కల్యాణ్ అభిమానులు ఓ రేంజ్ లో సందడి చేశారు. థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యాయి. వాచింగ్ ఖుషీ అంటూ అభిమానుల స్టేటస్ లతో వాట్సప్ హోరెత్తింది. మరిప్పుడు ఎన్టీఆర్ ఆంధ్రావాలాకు కూడా పరిస్థితి ఇలాగే ఉంటుందా. ఆంధ్రావాలాకు వెళ్తున్నామంటూ ఎవరైనా స్టేటస్ పెడితే యాంటీ ఫ్యాన్స్ గోల గోల చేస్తారు. అందుకే ఆ సినిమా విషయంలో తారక్ ఫ్యాన్స్ కాస్త సైలెంట్ అయ్యారు.

ఈ ట్రెండ్.. అవసరమా..?

రీ రిలీజ్ ల ట్రెండ్ కేవలం ఫ్యాన్స్ కోసమే. కామన్ ఆడియన్స్.. కనీసం డబ్బింగ్ సినిమాల గురించి మాట్లాడుకునే స్థాయిలో కూడా ఈ రీ-రిలీజ్ ల గురించి మాట్లాడుకోవడం లేదు. ఒకటీ రెండు సినిమాల విషయంలో సందడి కనిపించింది కానీ.. కొన్ని సార్లు ఆయా హీరోల అభిమానులే ఆ సినిమాలను పట్టించుకోవడం మానేశారు. రీ రిలీజ్ తో డబ్బులొస్తాయా అంటే చెప్పలేం, పోనీ క్వాలిటీ ఔట్ పుట్ గురించి చర్చ జరుగుతుందా అంటే అదీ లేదు. 

సాధారణ ప్రేక్షకులకు ఇలాంటి రీ-రిలీజెస్ తో పని లేదు. ఓటీటీలోనో లేదా యూట్యూబ్ లోనో ఆ సినిమా చూసుకుంటాడు. పనిగట్టుకొని, టికెట్ కొని థియేటర్ కు వెళ్లి చూడాలనుకోడు. ఈ విషయాన్ని ఇటు అభిమానులు, అటు నిర్మాతలు గ్రహిస్తే మంచిది.