అస్సలు జంకు గొంకు లేకుండా, క్లారిటీగా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసారు తెలంగాణ యువనేత, మంత్రి కేటిఆర్.
పోటా పోటీగా సభలు, నిరసనలు అంటూ హైదరాబాద్ లో ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే సహించేది లేదు అని క్లారిటీ ఇచ్చారు. అందరూ తమకు మిత్రులే అని, కానీ వైకాపా, తేదేపా రెండూ తెలంగాణలో లేనపుడు, ఇక్కడ ఆందోళనలు ఎందుకని అన్నారు. కావాలంటే భూమి బద్దలయ్యేలా రాజమండ్రిలో చేసుకోండన్నారు. విజయవాడ, కర్నూలు ఇలా చాలా ఊళ్లు వుండగా ఇక్కడెందుకు అలజడి అని ప్రశ్నించారు.
ఇది కేవలం ఆంధ్రలో వున్న రెండు పార్టీల వ్యవహారామని, తమకు దాంతో ఏ పనీ లేదని, కేవలం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ చెడకుండా చూడడం మాత్రమే తమకు కావాల్సిందని అన్నారు. దీంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సామాజిక జనాలు మండి పడుతున్నారు. ఈసారి సెటిలర్ల ఓట్లు భారాస కు వేసేది లేదని అప్పుడే బీరాలు పలుకుతున్నారు.
తెలుగుదేశం సామాజిక మాధ్యమాలు అయితే అప్పుడే రకరకాలుగా కేటిఆర్ ను నిలదీయడం మొదలుపెట్టాయి. ఏం ఆందోళన చేయకుండా తెలంగాణ వచ్చిందా? అప్పుడు బ్రాండ్ ఇమేజ్ ఏమయింది? అంటూ కిందా మీదా అయిపోతున్నాయి.
మొత్తం మీద చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం పై హైదరాబాద్/తెలంగాణ స్పందన ఏమిటన్నది అధికారికంగా క్లారిటీ వచ్చేసింది. అందువల్ల ఇక హైదరాబాద్ లో ఏదైనా అలా ఇలా చేస్తాం అంటే ఇక కష్టమే కావచ్చు.