నా కుమారుడిపై నీచ వ్యాఖ్యలు చేయడం సంస్కారమా?

తెలంగాణ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుపై బీజేపీ నేత తీన్మార్ మ‌ల్ల‌న్న ట్విట‌ర్ వేదిక‌గా అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం వివాదానికి దారి తీసింది. తీన్మార్ మ‌ల్ల‌న్న ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు.…

తెలంగాణ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుపై బీజేపీ నేత తీన్మార్ మ‌ల్ల‌న్న ట్విట‌ర్ వేదిక‌గా అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం వివాదానికి దారి తీసింది. తీన్మార్ మ‌ల్ల‌న్న ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఇదేనా బీజేపీ నేత‌ల‌కు నేర్పుతున్న సంస్కారం అంటూ ఆయ‌న ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డాను ట్విట‌ర్ వేదిక‌గా ప్ర‌శ్నించారు. హిమాన్షుపై అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై భౌతిక దాడి జ‌రిగింది.  

“అభివృద్ది ఎక్కడ జరిగింది? భద్రాచలం గుడిలోనా.. హిమాన్షు శరీరంలోనా” అంటూ తీన్మార్ మ‌ల్ల‌న్న ట్విటర్‌లో పోస్టు పెట్టార‌ని టీఆర్ఎస్ శ్రేణులు ఆగ్ర‌హానికి గుర‌య్యాయి. ఈ పోస్టును మంత్రి కేటీఆర్ దృష్టికి టీఆర్ఎస్ నేత‌లు తీసుకెళ్లారు. కేటీఆర్ మ‌న‌స్తాపానికి లోన‌య్యారు. చ‌దువుకుంటున్న త‌న కుమారుడిని రాజ‌కీయాల్లోకి లాగ‌డంపై ఆవేద‌న చెందారు. ఈ నేప‌థ్యంలో కేటీఆర్ ట్విట‌ర్ వేదిక‌గా త‌న ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు బీజేపీ  జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ట్వీట్‌ చేశారు.

“కుటుంబ సభ్యులపై నీచంగా రాజకీయ వ్యాఖ్యలు చేయడం సంస్కారమా? తెలంగాణ బీజేపీ నేతలకు ఇదే నేర్పిస్తున్నారా?. నా కుమారుడు, అతని శరీరాన్ని ఉద్దేశించి నీచంగా రాజకీయ వ్యాఖ్యలు చేయడం సంస్కారమా. బీజేపీ నేతల నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం సిగ్గుచేటు. ప్రధానమంత్రి మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌ షా కుటుంబ సభ్యులనుద్దేశించి మేమూ ఇదే తరహాలో స్పందిస్తామని ఎందుకు అనుకోరు. దిగజారుడు వ్యాఖ్యలు చేయకుండా అలాంటి నేతలను నిలువరించాలి. 

బీజేపీ నేతల తరహాలోనే వ్యాఖ్యలు చేయించాల్సిన పరిస్థితి మాకుకు కల్పించొద్దు. ఆ పరిస్థితి వస్తే మ‌మ్మ‌ల్ని తప్పుపట్టవద్దు. దురదృష్టం కొద్దీ భావ ప్రకటనా స్వేచ్ఛ విమర్శించేందుకు, బురదజల్లేందుకు హక్కుగా మారింది. సామాజిక మాధ్యమాలను జర్నలిజం ముసుగులో విషప్రచారం చేసేందుకు ఓ అవకాశంగా ఉపయోగించుకుంటున్నారు. అసాంఘిక ప్రవర్తనకు సామాజిక మాధ్యమాలు స్వర్గధామం అయ్యాయి. జర్నలిజం ముసుగులో యూట్యూబ్ చాన‌ళ్ల‌ ద్వారా నిత్యం అర్థంలేని విషయాలను ప్రసారం చేస్తున్నారు. చిన్న పిల్లలను కూడా ఇందులోకి లాగుతున్నారు” అని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ ట్వీట్‌పై బీజేపీ అగ్ర నాయ‌క‌త్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.