సరిగ్గా ఆరేళ్ల తర్వాత జస్టిస్ ఎన్వీ రమణ, వైఎస్ జగన్ ఎదురెదురుగా కలవనున్నారు. ఆరేళ్ల క్రితం జస్టిస్ ఎన్వీ రమణ, వైఎస్ జగన్ ఓ పెళ్లి వేడుకలో కలుసుకున్నారు. ముచ్చట్లు చెప్పుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు మరోసారి వేర్వేరు హోదాల్లో కలవనుండడం సర్వత్రా ఆసక్తి నెలకుంది.
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కుమారుడు అభినయ్‌రెడ్డి, మోనిషా వివాహం హైదరాబాద్‌లోని జేఆర్‌సీ పంక్షన్ హాల్లో అక్టోబర్ 29, 2015న జరిగింది. ఈ వివాహానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదాలో జస్టిస్ ఎన్వీ రమణ, ప్రతిపక్ష నాయకుడి హోదాలో వైఎస్ జగన్ కూడా హాజరయ్యారు. అప్పట్లో జస్టిస్ ఎన్వీ రమణ, వైఎస్ జగన్ పక్కపక్కనే కూచుని నవ్వుతూ మాట్లాడుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. బహిరంగ ప్రదేశాల్లో ఎన్వీ రమణ, జగన్ కలవడం మాత్రం ఇదే చివరిది.
వీళ్లిద్దరి పక్కనే ప్రస్తుత అధికార భాషా సంఘం చైర్మన్, కేంద్రసాహిత్య అకాడమీ గ్రహీత యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ కూడా ఉన్నారు. జస్టిస్ ఎన్వీ రమణ, వైఎస్ జగన్ మధ్య కొంత గ్యాప్ వచ్చిన నేపథ్యంలో ఇవాళ సాయంత్రం వాళ్లిద్దరు కలవనుండడం విశేషం.
దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ ఎన్వీ రమణకు ముఖ్యమంత్రి హోదాలో జగన్ తేనీటి విందు ఇవ్వనుండడం కాలం తీసుకొచ్చిన విశేషంగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. వ్యక్తులు కంటే వ్యవస్థలు బలమైనవని చెప్పేందుకు వీళ్లిద్దరి కలయికే నిదర్శనం.