ఫినిషింగ్ టచ్ బాగుంది: డిసెంబర్ టాలీవుడ్ రివ్యూ

ఈ ఇయర్ ఓపెనింగ్ అస్సలు బాగాలేదు. జనవరిలో ఎన్టీఆర్ కథనాయకుడు, వినయ విధేయరామ సినిమాలు జనాలకు షాకిస్తే, ఎఫ్2 మాత్రమే హిట్ గా నిలిచింది. ఆశ్చర్యంగా ఈ ఇయర్ ముగింపు కూడా దాదాపు ఇదే…

ఈ ఇయర్ ఓపెనింగ్ అస్సలు బాగాలేదు. జనవరిలో ఎన్టీఆర్ కథనాయకుడు, వినయ విధేయరామ సినిమాలు జనాలకు షాకిస్తే, ఎఫ్2 మాత్రమే హిట్ గా నిలిచింది. ఆశ్చర్యంగా ఈ ఇయర్ ముగింపు కూడా దాదాపు ఇదే విధంగా ఉంది. డిసెంబర్ లో బాలయ్య చేసిన రూలర్ సినిమా మరోసారి జనాలకు షాకిస్తే.. ప్రతిరోజూ పండగే సినిమా హిట్ అవ్వగా, మత్తువదలరా సినిమా ఊహించని విధంగా క్లిక్ అయి స్వీట్ షాక్ ఇచ్చింది.

90ఎంఎల్ తో డిసెంబర్ బాక్సాఫీస్ గ్రాండ్ గా స్టార్ట్ అవుతుందని భావించారంతా. కానీ కార్తికేయ మరోసారి నిరాశపరిచాడు. స్టోరీ సెలక్షన్ లో వీక్ అని తనకుతానుగా మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాతో పాటు వచ్చిన భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు అనే సినిమా కూడా ఇలానే అంచనాల మధ్య వచ్చి ఫ్లాప్ అయింది. కమెడియన్లంతా కలిసి చేసిన సినిమా కావడంతో, థియేటర్లన్నీ నవ్వులతో నిండిపోతాయని అనుకున్నారంతా. కానీ సూటిగా చెప్పాలంటే ఇదొక సోది సినిమా. ఈ మూవీస్ తో పాటు వచ్చిన మిస్ మ్యాచ్, అశ్వమేథం, కలియుగ సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి.

డిసెంబర్ రెండో వారం నుంచే బాక్సాఫీస్ కు కాస్త ఊపొచ్చింది. దీనికి కారణం వెంకీమామ. నాగచైతన్య, వెంకటేష్ హీరోలుగా నటించిన ఈ సినిమా భారీ అంచనాలతో థియేటర్లలోకొచ్చింది. ఆ అంచనాలకు తగ్గట్టే థియేటర్లు కూడా కళకళలాడాయి. కానీ కాంబినేషన్ పైన పెట్టినంత దృష్టి కథపై పెట్టకపోవడంతో సినిమా తేలిపోయింది. 80లనాటి స్టోరీలైన్ ను, దాదాపు అదే కాలంనాటి టేకింగ్ తో తీసి యూనిట్ విమర్శలపాలైంది. సొంత థియేటర్లలో రిలీజ్ చేయడం, షేర్లు పడిపోకుండా నిర్మాత సురేష్ బాబు తన చాతుర్యం చూపించడంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు దగ్గరైంది. లేదంటే, ఈపాటికి ఎప్పుడో దుకాణం సర్దేయాల్సిన మూవీ ఇది.

ఇదే వారంలో వెంకీమామతో పాటు ఓ మోస్తరు అంచనాలతో వచ్చింది అమ్మరాజ్యంలో కడపబిడ్డలు సినిమా. వర్మ గత సినిమాల్లానే ఈ మూవీ కూడా ప్రచారంతో ఊపెక్కించినప్పటికీ, విషయం తక్కువైంది. టిక్ టాక్ వీడియోలు, సోషల్ మీడియా జోకుల్ని 70ఎంఎంలో  చూసిన ఫీలింగ్ కలిగింది తప్ప అంతకుమించి మరే అనుభూతి మిగల్చలేదు ఈ రాజ్యం. ఈ మూవీతో పాటు వచ్చిన హేజా, మామాంగం, అయ్యప్ప కటాక్షం సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. వీటిలో అయ్యప్ప కటాక్షం మూవీ సుమన్ కు హీరోగా వందో చిత్రం కావడం విశేషం.

మూడో వారంలో బాలయ్య వెర్సెస్ సాయితేజ్ అనుకున్నారంతా. రూలర్, ప్రతి రోజూ పండగే సినిమాలు థియేటర్లలో పోటీపడతాయని భావించారు. కానీ బాలయ్య ఏ కోశానా ఆకట్టుకోలేకపోయాడు. రూలర్ సినిమాకు మొదటి రోజే అట్టర్ ఫ్లాప్ వచ్చేసింది. దీనికి పూర్తి రివర్స్ లో ప్రతి రోజూ పండగే సినిమా సూపర్ హిట్ అనిపించుకుంది. మారుతి టేకింగ్, రావురమేష్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాను నిలబెట్టాయి. డిసెంబర్ లో సాలిడ్ హిట్ అంటే ఇదే. ఇదే వారంలో వచ్చిన దొంగ సినిమా చతికిలపడింది. ఖైదీతో తెచ్చుకున్న విజయాన్ని ఈ సినిమాతో పోగొట్టుకున్నాడు హీరో కార్తి.

ఇక ఈ ఏడాదికి ఫినిషింగ్ టచ్ గా, చివరి వారంలో వచ్చిన మత్తు వదలరా సినిమా నిజంగానే మూస ధోరణితో సాగుతున్న ఇండస్ట్రీ మత్తును వదిలించింది. అతి తక్కువ బడ్జెట్ లో, అత్యథిక క్వాలిటీని ఎలా అందించొచ్చనే పాఠాన్ని పరిశ్రమకు నేర్పించింది ఈ సినిమా. జానర్ తో సంబంధం లేకుండా వినోదాన్ని ఎలా పండిచ్చవచ్చో ఈ సినిమా చూసి నేర్చుకోవచ్చు. అతి తక్కువ బడ్జెట్ లో (దాదాపు కోటి రూపాయలకు అటుఇటుగా) తీసిన మూవీ కావడంతో రిటర్న్స్ పరంగా ఈ ఏడాది మోస్ట్ ప్రాఫిటబుల్ వెంచర్ గా ఇది నిలిచే అవకాశం ఉంది.

ఇక ఈ సినిమాతో పాటు వచ్చిన ఇద్దరిలోకం ఒకటే సినిమా విడుదలైన రోజే ఫ్లాప్ అయింది. నీరసంగా సాగే స్క్రీన్ ప్లే, రొటీన్ సన్నివేశాలతో ఈ సినిమాను భరించడం కష్టమని ప్రేక్షకలోకం తేల్చేసింది. ఇక ఈ ఏడాదికి ఆఖరి సినిమాగా వచ్చిన సాఫ్ట్ వేర్ సుధీర్ నిరాశపరిచింది. ఈ సినిమాతో సుడిగాలి సుధీర్ హీరోగా మారాడనే విషయం తప్ప, చెప్పుకోదగ్గ మేటర్ లేదు ఇందులో. ఇలా డిసెంబర్ నెలలో అంచనాల మధ్య వచ్చి హిట్ అయిన మూవీగా ప్రతి రోజూ పండగ నిలిస్తే.. ఏమాత్రం అంచనాల్లేకుండా వచ్చి హిట్ అయిన మూవీగా మత్తు వదలరా సినిమా నిలిచింది.

తెలుగు సినిమా బిగ్ స్టోరీ