తమిళనాడులో ఓ హక్కుల సంస్థ దెబ్బకు సీనియర్ నటి, బీజేపీ మహిళా నాయకురాలు ఖుష్బూ దిగొచ్చారు. ఆవేశంలో మాట్లాడిన మాటలు ఓ వర్గం ప్రజల్ని మనస్తాపానికి గురి చేయడంతో ఆమె తన తప్పు తెలుసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కాంగ్రెస్‌ని మానసిక ఎదుగుదల లేని పార్టీ అంటూ చేసిన వ్యాఖ్యలు కొందరి మనసుల్ని గాయపరిచాయని, అందుకు క్షమాపణలు కోరుతున్నట్టు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.
రెండురోజుల క్రితం ఖుష్బూ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆమెపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పిం చారు. వాటిని జీర్ణించుకోలేని ఖుష్బూ బీజేపీలో చేరిన మరుసటి రోజు నుంచే కాంగ్రెస్‌పై ఎదురు దాడికి దిగారు. కాంగ్రెస్‌పై విమర్శల్లో భాగంగా ‘మానసిక ఎదుగుదల లేని పార్టీ కాంగ్రెస్. ఆ పార్టీ నాయకులకు బుర్ర కూడా తక్కవే’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలు తమిళనాడులో తీవ్ర దుమారం రేపాయి. మానసిక వికలాంగులను కించపరిచేలా ఖుష్బూ మాటలున్నాయని పలు స్వచ్ఛంద సంస్థలు, హక్కుల సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆమె మీద ఓ హక్కుల సంస్థ 30 పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేసింది. దీంతో ఖుష్బూ కూడా తన తప్పును సరిదిద్దుకునే క్రమంలో తన విమర్శల్లో రెండు బంధాలను తప్పుగా వాడినందుకు క్షమించాలని కోరారు.
తన వ్యాఖ్యలపై ఖుష్బూ తాజాగా వివరణ ఇస్తూ … ‘ఆ సమయంలో నేను తీవ్ర ఆవేదనలో ఉన్నాను. ఆ తొందరపాటులో రెండు పదబంధాలను తప్పుగా ఉపయోగించినందుకు నేను బాధపడుతున్నారు. నాకు నేనుగా ఎదిగిన వ్యక్తిని. అలాంటిది నేను వేరే వాళ్ల డైరెక్షన్లో.. వారి ఆలోచనల మేరకు మాట్లాడుతున్నాను అనడం అభ్యంతరకరమైంది.
నా కుటుంబ సభ్యుల్లో కొందరు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నాకు సమర్థులైన, తెలివైన, డైనమిక్, బైపోలార్ డిజార్డర్, డిప్రెషన్‌తో బాధపడుతున్న ఇలా వేర్వేరు రకాల స్నేహితులు ఉన్నారు. వారి స్నేహం, జ్ఞానం నన్ను ధనవంతురాలిని చేసింది’ అని వివరణ ఇచ్చారు. అందుకే మాట నోరు దాటక ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ మాత్రం నోరు జారినా వాటి పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఖుష్బూకు తెలిసొచ్చింది.