ఆయన భజన చౌదరి…!

అదేంటి సుజనా చౌదరి పేరు మారిపోయిందా. అంటే అవును మార్చేశారు వైసీపీ అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్. సుజనా చౌదరి  పేరుకు బీజేపీలో ఉన్నారు కానీ ఆయన టీడీపీ మనిషేనని అమర్నాధ్…

అదేంటి సుజనా చౌదరి పేరు మారిపోయిందా. అంటే అవును మార్చేశారు వైసీపీ అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్. సుజనా చౌదరి  పేరుకు బీజేపీలో ఉన్నారు కానీ ఆయన టీడీపీ మనిషేనని అమర్నాధ్ అంటున్నారు.

ఆయన చంద్రబాబు తరఫున బీజేపీలో ఉన్న కోవర్ట్ అని కూడా అనేశారు. చంద్రబాబు భజన చేయడమే సుజనా చౌదరి పని అంటూ ఘాటు గానే మాట్లాడారు. ఆయన అమరావతి రాజధాని కోసం గొంతు చించుకుంటున్న తీరు బాబును కాపాడేందుకేనని గుడివాడ సెటైర్లు వేశారు.

సుజనా చౌదరికి అమరావతిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ గురించి అసలు  పట్టదు, అక్కడ కిలోమీటర్ నిర్మాణానికి ముప్పయి కోట్లు ఖర్చు చేస్తే ఆయన ప్రశ్నించలేదు. రాజధానిలో  బినామీల కధ గురించి మంత్రి వర్గం ఉప సంఘం నివేదిక ఇచ్చినా గొంతు మెదపరు. కానీ అమరావతిలో రైతులను మాత్రం రెచ్చగొడుతున్నారు. అచ్చం బాబు గొంతుతో మాట్లాడుతున్నారంటూ గుడివాడ ఫైర్ అవుతున్నారు.

ఏపీలో నిజమైన బీజేపీ నేతలు ఉన్నారు. వారెవరికీ కలగని సందేహాలు,  డౌట్లు నిన్న కాక మొన్న చేరిన సుజనా చౌదరికే కలుగుతున్నాయి. పైగా అయన  డౌట్లు, టీడీపీ సందేహాలు ఒక్కటిగానే ఉంటున్నాయి అంటే ఆయన ఎవరికి భజన చేస్తున్నారో తెలుస్తూనే ఉందని గుడివాడ మండిపడుతున్నారు.

బీజేపీలో చేరినపుడే తన రక్తంలో  టీడీపీ ఉందని చెప్పుకున్న సుజనా చౌదరి ఆ రక్తానికి ఇపుడు తగిన న్యాయం చేస్తున్నారని గుడివాడ కౌంటర్లెశారు.  అమరావతి రాజధానికి కేంద్రం ఇచ్చిన నిధులను గత సర్కార్ దుర్వినియోగం చేస్తే సుజనా ఎందుకు మాట్లాడరని, అక్కడ ఎస్సీ ఎస్టీలకు తీరని అన్యాయం జరిగినా సుజనా కంటికి కనిపించలేదా అంటూ గుడివాడ బాగానే తగులుకున్నారు. మొత్తానికి సుజనా చౌదరికి భజన చౌదరిని చేసేశారు.