ఏ రాజకీయ పార్టీ అయినా నిరంతరం ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తుండాల్సిందే. కిందపడినా మళ్లీ లేచి నిలబడటానికి సర్వశక్తులు కూడగట్టుకోవల్సిందే. ఇదో నిరంతర ప్రక్రియ. 'నీ దారి నీదే సాగిపోరా' అన్నట్లుగా సాగిపోతూ వుండాల్సిందే. రాజకీయ పార్టీలు ఉనికిని చాటుకోవడానికి ఉన్న మార్గం ఎన్నికలు. పంచాయతీ ఎన్నికలు మొదలుకొని పార్లమెంటు ఎన్నికల వరకు అవి పోటీ చేస్తూనేవుంటాయి. గెలుపోటముల సంగతి తరువాత. గెలుపు లక్ష్యంగానే పోటీకి దిగుతాయి. ఫలితాలు ఎలా ఉంటాయో ఎవరూ చెప్పలేరు. తెలంగాణలో త్వరలోనే అంటే కొత్త ఏడాది జనవరిలోనే మున్సిపాలిటీలకు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు.
మొన్నీమధ్య హైదరాబాదుకు వచ్చిన బాబు పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. 'గెలుపే లక్ష్యంగా మున్సిపల్ ఎన్నికల్లో పోరాడాలి' అని నేతలకు దిశానిర్దేశం చేశారు. నిజమే…గెలుపే లక్ష్యంగా ఉండాలి. కాని టీడీపీకి అది అసాధ్యమని చాలామంది అభిప్రాయం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లు సాధించిన టీడీపీకి ఇప్పుడు మనుగడలో ఉన్నది ఒక్క స్థానం మాత్రమే. గత ఎన్నికల్లో సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు గెలవగా, ప్రస్తుతం మిగిలింది నాగేశ్వరరావు మాత్రమే. లోక్‌సభ ఎన్నికల్లో అసలు పోటీయే చేయలేదు. ఆ తరువాత హుజూర్నగర్ ఉప ఎన్నికలో పోటీ చేసి సోదిలోకి లేకుండాపోయింది. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించారు.
అర్హత కలిగినవారిని అభ్యర్థులుగా ఎంపిక చేయాలని, క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెసుతో, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకున్న (కూటమి) బాబు మున్సిపల్ ఎన్నికల్లో అలాంటిది ఉంటుందని చెప్పలేదు. కాని కాంగ్రెసుతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కాంగ్రెసుతో ప్రాథమిక చర్చలు ప్రారంభించినట్లు వార్త వచ్చింది. టీడీపీకి మిగిలిన ఏకైక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు (అశ్వారావుపేట) కాంగ్రెసు నాయకుడు రేవంత్ రెడ్డితో ప్రాథమికంగా చర్చలు జరిపారు. ఈ విషయాన్ని మెచ్చా నాగేశ్వరరావు ధ్రువీకరించారు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెసు కలిసి పోటీ చేయాల్సిన అవసరముందని మెచ్చా అన్నారు.
అవసరమైతే సీపీఎం, సీపీఐలను కలుపుకువెళ్లాలని రేవంత్ రెడ్డికి మెచ్చా చెప్పారు. అంటే మళ్లీ ఒక కూటమిగా ఏర్పడి టీఆర్ఎస్ను ఢీకొట్టాలనే ఆలోచన చేస్తున్నట్లు అర్థమవుతోంది. మరి కూటమిగా ఏర్పడటానికి కాంగ్రెసు, కమ్యూనిస్టు పార్టీల నాయకత్వాలు సుముఖంగా ఉండాలి కదా. కూటమిగా ఏర్పడే అవకాశం లేకపోతే టీడీపీ ఒంటరిగా పోటీ చేయక తప్పదు. ఎలా పోటీ చేసినా గెలుపు దక్కుతుందనే నమ్మకం లేదు. తెలంగాణ ఏర్పడినప్పటినుంచి ఇప్పటివరకు జరిగిన వివిధ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయాలు సాధించింది. కొంతకాలం క్రితం జరిగిన హుజూర్నగర్ ఉప ఎన్నికలోనూ టీఆర్ఎస్ సూపర్‌డూపర్ మెజారిటీతో గెలిచింది. ఉధృతంగా సాగిన ఆర్టీసీ సమ్మె ప్రభావం ఉప ఎన్నికపై పడలేదు.
ఒక్క లోక్‌సభ ఎన్నికల్లోనే కేసీఆర్ అంచనాలు తప్పిపోయాయి. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఎన్నికల పూర్తి బాధ్యతను కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్‌కు అప్పగించారు. కేసీఆర్ ప్రచారం చేయబోవడంలేదు. ఇంక ఏపీలో రాజధాని రచ్చ తీవ్రంగా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు దాని మీదనే దృష్టి పెడతారు. ఆయన మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేయకపోవచ్చని అనుకుంటున్నారు. తెలంగాణలో టీడీపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తానని, దానికి పూర్వవైభవం తెస్తానని చంద్రబాబు గతంలో అనేకసార్లు చెప్పారు. కాని ఇప్పటివరకు అలాంటి ప్రయత్నాలేమీ జరగలేదు. తెలంగాణలో పర్యటిస్తానని కూడా అన్నారు. కాని అదీ జరగలేదు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని చేయడమే తప్ప ఏదో సాధించేస్తామని పార్టీ నాయకులు ఎవరూ ఆశలు పెట్టుకోలేదు.