మళ్లీ పాత రోజులు.. నైట్ కర్ఫ్యూతో మొదలు..?

సెకండ్ వేవ్ ఆంక్షల్లో చిట్టచివరిగా నైట్ కర్ఫ్యూని తొలగించాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఏపీలో అయితే చాన్నాళ్లపాటు నైట్ కర్ఫ్యూ కొనసాగింది. ఇప్పుడు మళ్లీ పాత రోజుల్లోకి వెళ్లబోతున్నామా అన్న అనుమానం బలపడుతోంది. ఇందులో భాగంగా…

సెకండ్ వేవ్ ఆంక్షల్లో చిట్టచివరిగా నైట్ కర్ఫ్యూని తొలగించాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఏపీలో అయితే చాన్నాళ్లపాటు నైట్ కర్ఫ్యూ కొనసాగింది. ఇప్పుడు మళ్లీ పాత రోజుల్లోకి వెళ్లబోతున్నామా అన్న అనుమానం బలపడుతోంది. ఇందులో భాగంగా ముందుగా నైట్ కర్ఫ్యూ లు మొదలయ్యాయి. ఎక్కడైతే ఆపేశామో తిరిగి అక్కడ్నుంచే మొదలుపెట్టబోతున్నాం. 

గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రాత్రి 11నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులోకి వచ్చేసింది. మధ్యప్రదేశ్ లో పూర్తిగా రాష్ట్రమంతా నైట్ కర్ఫ్యూ పెట్టారు. గుజరాత్ లో 8 ప్రధాన నగరాల్లో గత రాత్రి నుంచి కర్ఫ్యూ పాటిస్తున్నారు. మొత్తమ్మీద థర్డ్ వేవ్ ని అధికారికంగా భారత్ అంగీకరించినట్టే లెక్క.

కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్.. వరుసగా రెండ్రోజులపాటు అధికారులతో సమీక్షలు నిర్వహించి రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా కొవిడ్ పై అత్యవసర సమీక్ష జరిపారు. రాష్ట్రాలు కఠిన చర్యలు చేపట్టాలని చెప్పారు. ఆక్సిజన్ సిలిండర్లు, ఐసీయూ బెడ్లు సిద్ధం చేసుకోవాలన్నారు. కొవిడ్ తో యుద్ధం పూర్తి కాలేదని కొనసాగుతోందని చెప్పారు. వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ దశలో ముందస్తుగా కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూని అమలులోకి తెచ్చాయి.

కర్నాటకతో మొదలు..

క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై ఆంక్షలు విధిస్తూ కర్నాటక ప్రభుత్వం తొలి అడుగు వేయగా.. ఆ తర్వాత మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు కూడా అందులో భాగమయ్యాయి. తెలంగాణ హైకోర్టు కూడా పండగల వేళ ఆంక్షలు పెట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఏపీ కూడా దీనిపై ప్రకటన చేయాల్సి ఉంది. ఒమిక్రాన్ కేసులు బయటపడిన రాష్ట్రాలు, ఒమిక్రాన్ భయం ఉన్న రాష్ట్రాలు కూడా ఇప్పుడు అప్రమత్తం అయ్యాయి. 

కేంద్రం నేరుగా లాక్ డౌన్ అని చెప్పకుండానే రాష్ట్రాలకు సంకేతాలు పంపించింది. ఇక ఇప్పుడు ఎక్కడికక్కడ రాష్ట్రాలదే నిర్ణయాధికారం. నైట్ కర్ఫ్యూతో పడిన తొలి అడుగు.. కేసులు పెరిగితే.. మరింత ముందుకెళ్లడం ఖాయం. అదే జరిగితే.. భారత్ లో మరో దఫా లాక్ డౌన్ ఎంతో దూరంలో లేదు.