కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆనందయ్య ఆయుర్వేద మందు గురించి జరిగిన హడావిడి అంతా ఇంతా కాదు. ఆనందయ్య మందు తయారు చేసి పంపిణీ చేయడం మొదలు పెట్టగానే పెద్ద ఎత్తున జనాలు గుమికూడి నానా హంగామా సృష్టించారు. దీంతో ప్రభుత్వం మందు పంపిణీపై తాత్కాలికంగా ఆంక్షలు విధించడంతో ఆ తర్వాత కోర్టు అనుమతితో పంపిణీ సజావుగా సాగింది.
అత్యవసర సమయంలో వినియోగించే చుక్కల మందుపై ఇంకా రగడ జరుగుతూనే ఉంది. ఇక తాజాగా ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో ఆనందయ్య మళ్లీ తెరపైకి వచ్చారు. ఈసారి కూడా కరోనాని పడగొట్టే మందు ఉందని ప్రచారం చేపట్టారు.
ఒమిక్రాన్ కి 48 గంటల గడువు..
ఒమిక్రాన్ వేరియంట్ అయినా, మరే ఇతర ప్రమాదకర వేరియంట్ అయినా తన మందు ముందు తలొంచాల్సిందేనంటారు ఆనందయ్య. ఒమిక్రాన్ మందుతో 48 గంటల్లో దాన్ని పూర్తిగా తగ్గించేస్తానని చెప్పారు. దీంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఒమిక్రాన్ గురించి ఇంకా వైద్యులకే పూర్తిగా తెలియదు, వారి దగ్గరే సరైన సమాధానం లేదు. అయితే ఆనందయ్య మాత్రం ఒమిక్రాన్ కి మందు కనిపెట్టానంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయుష్ విభాగం రంగంలోకి దిగింది.
గతంలో కూడా ఆనందయ్య మందుని ఆయుష్ విభాగం పరిశీలించి, అందులో హానికర పదార్థాలేవీ లేవని తేల్చి చెప్పింది. ఇప్పుడు మాత్రం తమని ఎవరూ సంప్రదించలేదని చెబుతున్నారు ఆయుష్ విభాగం కమిషనర్ రాములు. కొంతమంది ఒమిక్రాన్ కు మందు కనిపెట్టామని ప్రచారం చేసుకుంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు రాములు. అయితే ఒమిక్రాన్ మందు ఉచితంగా పంపిణీ చేస్తామని, విక్రయిస్తామని తమని ఎవరూ సంప్రదించలేదని చెప్పారు. ఇప్పటి వరకూ ప్రభుత్వం ఎవరికీ అనుమతివ్వలేదని అన్నారాయన.
దీంతో ఆనందయ్య, ఆయుష్ గొడవ మరోసారి మొదలైనట్టు తెలుస్తోంది. ఇటు ఆనందయ్య మందు రెడీ అయింది అంటూ 48 గంటల ఛాలెంజ్ విసురుతున్నారు. అటు ఆయుష్ మాత్రం అనుమతివ్వలేదని చెబుతోంది. మరి ఈసారి ఈ వ్యవహారం ఏ కొలిక్కి వస్తుందో చూడాలి.