కూతురి కోసం కేసీఆర్ కోరి కష్టాలు కొనితెచ్చుకుంటారా?

దొడ్డిదారిన కొడుకుని ఎమ్మెల్సీగా గెలిపించుకుని మంత్రి పదవి ఇప్పించుకున్నారనే ఇమేజీ చంద్రబాబుపై ఉంది. ఇలా తప్ప నేరుగా మంత్రి అయ్యే అవకాశం, సమర్థత లోకేష్ కు ఈ జన్మకు లేదనే విషయం పదో తరగతి…

దొడ్డిదారిన కొడుకుని ఎమ్మెల్సీగా గెలిపించుకుని మంత్రి పదవి ఇప్పించుకున్నారనే ఇమేజీ చంద్రబాబుపై ఉంది. ఇలా తప్ప నేరుగా మంత్రి అయ్యే అవకాశం, సమర్థత లోకేష్ కు ఈ జన్మకు లేదనే విషయం పదో తరగతి పిల్లాడ్ని అడిగినా చెబుతాడు. ఇప్పుడు కేసీఆర్ కూడా కోరి ఆ అపవాదుని కొని తెచ్చుకునేలా ఉన్నారు.

కూతురు కవితను ఎమ్మెల్సీగా గెలిపించుకోవడంతో పాటు, మంత్రి పదవి కట్టబెట్టే ఆలోచనలో ఉన్నారు కేసీఆర్. దీంతో టీఆర్ఎస్ కప్పులో మినీ తుఫాన్ చెలరేగుతుందనే అనుమానాలు బలపడుతున్నాయి.

ఇప్పటికే కేసీఆర్ పాలనపై నివురుగప్పిన నిప్పులా అసంతృప్తి ఉంది. తెలంగాణలో కుటుంబపాలన జరుగుతోందనే విమర్శలూ ఉన్నాయి. గ్రామస్థాయి పనుల నుంచి భారీ ప్రాజెక్టు కాంట్రాక్ట్ వరకు అన్నీ కేసీఆర్ కుటుంబీకులు, బంధువులకే దక్కుతున్నాయనే విమర్శలున్నాయి. బంగారు తెలంగాణ అంటూ ఊదరగొట్టిన కేసీఆర్, తన కుటుంబాన్ని బంగారుమయం చేసుకున్నారని ప్రతిపక్షాలు ఎప్పటికప్పుడు ఆరోపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి టైమ్ లో కూతురు కవితను కేబినెట్ లోకి తీసుకుంటే కేసీఆర్ కు అదనపు తలనొప్పులు తప్ప, కలిసొచ్చేదేం లేదు.

కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుని ఆదరించిన తెలంగాణ ప్రజలు గత ఎన్నికల్లో కవితను మాత్రం తిరస్కరించారు. ముఖ్యమంత్రి కూతురి హోదాలో, అతి విశ్వాసంతో ఎన్నికల్లో దిగిన కవిత ఓటమి పాలవడం టీఆర్ఎస్ కు తలవంపుగా మారింది. అప్పట్నుంచి ఇప్పటివరకు కూతుర్ని ఎలాగైనా లైమ్ లైట్ లోకి తీసుకురావాలని కేసీఆర్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. “ప్రత్యేక దృష్టి” పెట్టి మరీ కవితను ఎమ్మెల్సీగా గెలిపించుకున్నారు.

స్థానిక సంస్థల కోటాలో గెలుపుకి అవసరమైన బలం ఉన్నా కూడా.. ఇతర పార్టీల నేతల్ని ప్రలోభపెట్టి తమవైపు తిప్పుకున్నారనే అపవాదు మూటగట్టుకున్నారు కేసీఆర్. అంటే.. కూతురు గెలుపు కోసం ఏ ఒక్క అవకాశాన్ని ఆయన విడిచిపెట్టలేదు. అదే స్పీడ్ లో ఆమెను కేబినెట్ లోకి కూడా తీసుకుంటారని అంటున్నారు. ఏకంగా హోం మంత్రినే చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే కేసీఆర్ పై మరింత వ్యతిరేకత పెరగడం మాత్రం ఖాయం.

మరీ ముఖ్యంగా మైనార్టీ వర్గానికి చెందిన మహమూద్ అలీని తొలిగింది, ఆ పదవి కవితకు ఇస్తే కేసీఆర్ కు అది మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

అయితే ఆయన లెక్కలు ఆయనకుంటాయి. ఆర్టీసీ ఉద్యమం ద్వారా వచ్చిన వ్యతిరేకత, నిరుద్యోగుల నుంచి వచ్చిన వ్యతిరేకత.. లాంటి పెద్ద పెద్ద సమస్యల్నే కేసీఆర్ అధిగమించారు. అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా.. ఎన్నికల టైమ్ కి స్థానికతను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోగల సమర్థుడు ఆయన.

కాబట్టి కవిత ద్వారా వచ్చే తలనొప్పులు ఆయన్ను పెద్దగా ఇబ్బందిపెట్టకపోవచ్చు. కాకపోతే దొడ్డిదారిన కూతుర్ని మినిస్టర్ చేశారనే అపవాదును మాత్రం ఆయన జీవితాంతం ఎదుర్కోవాల్సి  వస్తుంది.

ఇంకెన్ని రహస్య జీవోలు, వ్యవహారాలున్నాయో