టికెట్ రేట్లు పెంచితే ప్రజల్ని గౌరవించినట్టా..!

నాని చేసిన కామెంట్స్ పై ఆంధ్రప్రదేశ్ మంత్రులు వరుసగా ప్రతివిమర్శలు చేస్తున్నారు. ఓ మంత్రి బొత్స దీనిపై ఇప్పటికే స్పందించగా.. తాజాగా మరో మంత్రి కన్నబాబు కూడా రియాక్ట్ అయ్యారు. టికెట్ రేట్లు తగ్గిస్తే…

నాని చేసిన కామెంట్స్ పై ఆంధ్రప్రదేశ్ మంత్రులు వరుసగా ప్రతివిమర్శలు చేస్తున్నారు. ఓ మంత్రి బొత్స దీనిపై ఇప్పటికే స్పందించగా.. తాజాగా మరో మంత్రి కన్నబాబు కూడా రియాక్ట్ అయ్యారు. టికెట్ రేట్లు తగ్గిస్తే ప్రజల్ని అవమానించడం ఎలా అవుతుందో చెప్పాలని నానిని ప్రశ్నించారు కన్నబాబు.

“నాని ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థంకాలేదు. టికెట్ రేట్లు తగ్గిస్తే ప్రజల్ని అవమానపరచడం అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. అంటే టికెట్ రేట్లు పెంచితే ప్రజల్ని గౌరవించినట్టా? టికెట్ ధరలు నియంత్రించడం ప్రభుత్వ బాధ్యత. ఇంతకాలం దీనిపై ఎవ్వరూ మాట్లాడలేదు. ఇప్పుడు మా ప్రభుత్వం మాట్లాడుతుంటే, అది మీకు కక్షసాధింపు చర్యగా కనిపిస్తోంది.”

నాని లాంటి చాలామంది సినీ జనాలు.. వాళ్లకు వాళ్లే కామెంట్స్ చేస్తున్నారని, వాళ్లే వివాదాలు సృష్టిస్తున్నారని అన్నారు మంత్రి. థియేటర్లలో కలెక్షన్లను కిరాణ షాపుతో పోల్చడాన్ని నాని అవివేకంగా అభివర్ణించారు కన్నబాబు.

“సినిమా కలెక్షన్ కంటే కిరాణ షాపులు బెటర్ అని మాట్లాడారు. అంటే ఆయన ఉద్దేశంతో కిరాణ షాపులు తక్కువనా. కిరాణ వ్యాపారంలో ఎంత మార్జిన్ ఉంటుందో, ఎంత లాభం వస్తుందో అందరికీ తెలుసు. వాళ్లే కంగారు పడతారు, వాళ్లే ఏదో మాట్లాడతారు, వాళ్లే వివాదాలు సృష్టించుకుంటారు. అంతకుమించి ఇందులో ఏం లేదు.”

ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని థియేటర్లు తనిఖీ చేస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు కన్నబాబు. దీనిపై కూడా సినీ జనాలు విమర్శలు చేయడం తగదన్నారు. థియేటర్లలో బాత్రూమ్స్ శుభ్రంగా ఉన్నాయా లేవా, అగ్నిప్రమాద నివారణ చర్యలు తీసుకున్నారా లేదా, ఎప్పటికప్పుడు టాక్సులు కడుతున్నారా లేదా అనే అంశాల్ని పరిశీలిస్తే విమర్శలు, ఆందోళనలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు మంత్రి.