థియేటర్ల వ్యవహారంలో సినీవీరాభిమానుల బాధను చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. టికెట్ల రేట్లను ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తుందంటే బాధ. టికెట్లను ఇష్టానుసారం అమ్ముకోవడానికి వీల్లేదంటే బాధ. థియేటర్లు ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలంటే బాధ. ఏం చేసినా డైరెక్టుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నిందించడానికి, ఇదంతా పవన్ కల్యాణ్ మీద కక్ష సాధింపు అన్నట్టుగా దీన్నో రాజకీయ అంశంశంగా మార్చడానికి కొందరు తెగ తాపత్రయపడుతూ ఉండటం గమనార్హం!
థియేటర్లు అంటే.. వాటి కాంపౌండ్ లోకి అడుగుపెట్టడం అంటేనే, పూర్తిగా వారి ఆధీనంలోకి వెళ్లిపోవడమే అనే పరిస్థితి ఉంది తెలుగునాట. దశాబ్దాలుగా ఇదే. వారు చెప్పిందే రేటు, వారు బైక్ పెట్టమన్న చోట పెట్టాలి, నిలబడమన్న చోట నిలబడాలి. పార్కింగ్ ఏరియాలో పనిచేసే వాడు కూడా… తన డబ్బు ఖర్చు పెట్టి సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకుడిని పురుగులాగే చూస్తాడు! అదేంటో మరి!
ఇక పాప్ కార్న్, కూల్ డ్రింక్ అమ్మకాలు.. మాఫియా రేంజ్ కు చేరి చాలా కాలం అయ్యింది. చిన్న చిన్న పట్టణాల్లోని థియేటర్లతో మొదలుపెడితే, మల్టీ ఫ్లెక్స్ ల వరకూ ఒక్కోరి దోపిడీది ఒక్కో రేంజ్. మరి ఇంత చేస్తే.. లోపల ఉన్న సదుపాయాల సంగతి సరేసరి! బాత్రూమ్ లతో మొదలుపెడితే.. సేఫ్టీ వరకూ.. దేనికీ థియేటర్ల యాజమాన్యాల బాధ్యత కనిపించదు. మీరు సినిమా చూడ్డానికి వచ్చారు.. చూసి వెళ్లండి.. మిగతావి మీకు అనవసరం అన్నట్టుగా దందా సాగింది.
ఇప్పుడు ప్రభుత్వం స్పందించే సరికి… థియేటర్ల బందులు! అసలే జనాలు కరోనాకు భయపడి థియేటర్లకు ఇంకా పూర్తి స్థాయిలో రావడం లేదు. ఈ సమయంలో కొన్ని రకాల సినిమాలను ఆడించడం కన్నా మానుకోవడం మంచిది అనే లెక్కలతో థియేటర్ల యాజమాన్యాలున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం థియేటర్లలో ప్రమాణాల గురించి పట్టించుకునే సరికి మూసేసి నిరసనలు తెలుపుతున్నాయి.
ఇక ప్రమాణాల గురించి ప్రభుత్వం అడిగితే… హీరోల వీరాభిమానులు గుడ్డలు చించుకుంటున్నారు! మరి ఇప్పుడే అడగాలా? అంటూ కొందరు దీర్ఘాలు తీస్తున్నారు. అయితే ఎప్పుడో ఒకప్పుడు అడగాలి. కొత్త రూల్స్ లను పెట్టి జగన్ ప్రభుత్వం థియేటర్ల మీద పడటం లేదు. పాత నియమాలే ఏ మేరకు పాటిస్తున్నారు? అని అడిగితే… ఇన్ని డ్రామాలు సాగుతూ ఉండటం గమనార్హం!
జగన్ ప్రభుత్వం ఏం చేసినా విమర్శించడమే పనిగా పెట్టుకున్న వాళ్లకు.. ఈ అంశం కూడా చాలా బాధపెడుతూ ఉంది. థియేటర్లలో సేఫ్టీ మెజర్ మెంట్స్ కూడా అవసరం లేదని, జగన్ ప్రభుత్వం చేస్తోంది తప్పే అన్నట్టుగా వాదించే వారూ రెడీ అయ్యారు. చూసీ చూడనట్టుగా ఉండాలి. ఏ ప్రమాదాలో జరిగితే.. అప్పుడు మళ్లీ ప్రభుత్వం ఏం చేస్తోంది? అధికారులు ఏం చేస్తున్నారు? చూసీ చూడనట్టుగా ఎలా వ్యవహరిస్తున్నారు? అంటూ .. ప్రశ్నించే వాళ్లు రెడీ అవుతారు!