తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పాటు పని చేసిన వ్యక్తి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. ఆ పార్టీ తరఫున అత్యంత క్రియాశీలకంగా పని చేసి, కీలక పదవులు చేపట్టిన వ్యక్తి ఆయన. కాల క్రమంలో ఆయన ఆ పార్టీని వీడారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దశలోనే ఆ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున ఉప నాయకుడిగా ఉన్నారు. ఈ క్రమంలో మూడేళ్ల కిందట ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సాక్షి టీవీ కోసం కొమ్మినేని శ్రీనివాసరావు చేసిన ఆ ఇంటర్వ్యూలో సుప్రీం కోర్టు జస్టిస్ ఎన్వీ రమణ పేరు కూడా ప్రస్తావనకు రావడం గమనార్హం. ఎన్వీ రమణ తమ వాడేనంటూ తెలుగుదేశం పార్టీ నేతల మధ్యన చంద్రబాబు నాయుడు చెప్పే వారని ఉమ్మారెడ్డి ఆ వీడియో ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖ నేపథ్యంలో.. ఆ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
కొమ్మినేని ప్రశ్న: న్యాయవ్యవస్థపై కూడా బాబుకు పట్టు, పలుకుబడి ఉన్నాయని అంటుంటారు?
ఉమ్మారెడ్డి సమాధానం: హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులు చలమేశ్వర్, రమణ ఉంటారు. వీళ్లు దీర్ఘ కాలం న్యాయవ్యవస్థలో ఉంటారు. మన వాళ్లంటూ ఉంటే ఎప్పటికైనా మనకు ఉప యోగం ఉంటుంది అని అప్పట్లో బాబు మాతో అన్నారు. దాంట్లో సందేహమేమీ లేదు.
న్యాయవ్యవస్థపై పట్టు సాధించాలి అనే దీర్ఘకాలిక ప్రణాళిక ఎప్పుడూ బాబు మనసులో ఉండేది. ఇవ్వాళ ఇతడిని పెట్టుకుంటే పదేళ్లు పోయిన తర్వాత ఇతను ఉపయోగ పడతాడు అనే విషయంలో బాబు సమయస్ఫూర్తితోనే పావులు కదుపుతారు.
ఇదీ ఆ ఇంటర్వ్యూలో ప్రస్తావించిన అంశం. ఎన్వీ రమణ తమ వాడేనంటే స్వయంగా చంద్రబాబు నాయుడు తన పార్టీ నేతల మధ్యన ప్రకటించుకునే వారని ఆ పార్టీలో పని చేసిన నేత చెప్పాడు. అప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు, ఎన్వీ రమణపై జగన్ ఎలాంటి లేఖా రాయలేదు అనేవి గమనించాల్సిన అంశాలు.
తన పార్టీ నేతల మధ్యనే చంద్రబాబు నాయుడు ఒక న్యాయమూర్తి విషయంలో చేసిన కామెంట్లు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. పార్టీ నేతల మధ్యన అలా మాట్లాడిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు మాత్రం శుద్దులు చెబుతున్నారు.