మంత్రి గిరీ కోసం ఆ కార్డు …?

రాజకీయాల్లో పరమ పధ సోపానం చేరుకోవడమే ఎవరికైనా అంతిమ లక్ష్యం. దానికి బరులు, గిరులూ గీసుకుని కూర్చుంటే కుదిరే పనే కాదు. అందువల్ల ఎవరైనా ఏమైనా చేయాల్సిందే. ఇదిలా ఉంటే ముందు ఎమ్మెల్యే కావాలి.…

రాజకీయాల్లో పరమ పధ సోపానం చేరుకోవడమే ఎవరికైనా అంతిమ లక్ష్యం. దానికి బరులు, గిరులూ గీసుకుని కూర్చుంటే కుదిరే పనే కాదు. అందువల్ల ఎవరైనా ఏమైనా చేయాల్సిందే. ఇదిలా ఉంటే ముందు ఎమ్మెల్యే కావాలి. ఆ ముచ్చట తీరాక మంత్రి కుర్చీ పట్టేయాలి. వర్తమాన రాజకీయాల్లో ఇదే ఎవరి టార్గెట్ అయినా.

ఆ విధంగా చూసుకుంటే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా దానికి అతీతులు కారు. జగన్ మంత్రి వర్గ విస్తరణ ఉంటుంది అని ఎక్కడా చెప్పడంలేదు. కనీసం దానికి సంబంధించి సంకేతాలు కూడా పెద్దగా ఏవీ రావడంలేదు అయితే కొత్త ఏడాది కచ్చితంగా మంత్రి వర్గాన్ని విస్తరిస్తారని ఆశావహులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. అందులో ఎవరికి తోచిన తీరున వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కూడా రేసులో ఉన్నారు. 

ఒక సీనియర్ ఎమ్మెల్యే ఈ మధ్య జిల్లాలో జరిగిన కాపుల సభలో పాలుపంచుకున్నారు. వేరే పార్టీకి చెందిన తన సామాజికవర్గం ఎమ్మెల్యేతో ముచ్చట్లు పెట్టారు. పొరుగు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ కూడా హాజరయ్యారు. వీరంతా కలసి బాగానే మాట్లాడుకున్నారని టాక్. 

ఇంతకీ ఇదంతా ఎందుకు అంటే ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వారు చేస్తున్నారు. మంత్రి పదవి కోసం రేసులో ఉన్న సీనియర్ ఎమ్మెల్యే కాపు కార్డుని బలంగా ప్రయోగిస్తున్నారు అంటున్నారు. చిత్రమేంటి అంటే వైసీపీ తరఫున జిల్లాలో ఆ సామాజిక వర్గం వారు చాలా మంది గెలిచారు.

ప్రస్తుత విశాఖ జిల్లా మంత్రి కూడా ఆ వర్గానికి చెందిన వారే. మరి ఆయనకే మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలీ అంటే ఆలోచించాలేమో. ఏది ఏమైనా ఎవరి మటుకు వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఎవరెన్ని కార్డులు తీసినా జగన్ తీసే కార్డులో ఎవరి పేరు ఉంటే వారే కొత్త మంత్రి అవుతారు. ఇదే నిజం. ఇదే పక్కా క్లారిటీ. జరిగేది అదేన‌ని అంటున్నారు. వైసీపీ నేతలు.