ఆంధ్రలో థియేటర్ల పరిస్థితి దారుణంగా వుంది. థియేటర్ల మూత అన్నది లేని జిల్లా లేదు. తూర్పుగోదావరి జిల్లాలో ఏకంగా యాభై థియేటర్లు మూతపెట్టారు. కృష్ణ, చిత్తూరు, విజయనగరం ఇలా ప్రతి జిల్లాలోనూ ఒకటో, రెండో థియేటర్లు మూత పడ్డ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇందులో అధికారుల తప్పు ఏమీ లేదు. ఎటొచ్చీ ఇప్పుడు నిద్ర లేచారు. ఓ చెక్ లిస్ట్ పట్టుకుని, థియేటర్ల అక్రమాల దుమ్ము దులుపుతున్నారు. లైసెన్స్ లు రెన్యువల్, సేఫ్టీ లైసెన్స్ రెన్యువల్ దగ్గర నుంచి, ఇతర సదుపాయాలు వగైరా లెక్కలు బయటకు తీస్తున్నారు. అవన్నీ తీస్తుంటే ఏళ్ల తరబడి వున్న కన్నాలు బయటకు వస్తున్నాయి.
ఆ కన్నాలు చూపించి, తగ్గింపు రేట్లు అమలు చేయమని చెబుతున్నారు. ఆ రేట్లు అమలు చేయలేక, ఆ కన్నాలు పూడ్చి కొత్త రేట్లు తెచ్చుకోలేక థియేటర్లు మూత పెడుతున్నారు. ఈ వారం శ్యామ్ సింగ రాయ్ ఒక్కటే విడుదల. కొన్ని థియేటర్లలో పుష్ప వుంది. అందువల్ల మరీ పెద్దగా సమస్య లేదు. ఈస్ట్ లో మాత్రం శ్యామ్ సింగ రాయ్ కు పట్టుమని పది థియేటర్లు కూడా దొరకలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సినిమా కొన్ని డిస్ట్రిబ్యూటర్ తన చేతిలో వున్న థియేటర్లు కూడా రేట్లు కిట్టుబాటు కాక మూసివేయడం విశేషం.
దీంతో శ్యామ్ సింగ రాయ్ సినిమాను అన్ని ఏరియాల్లో రికరబుల్ అడ్వాన్స్ ల కింద ఇచ్చేయాల్సి వచ్చింది. ఈ విషయంలో కోర్టు నుంచి ఏం నిర్ణయం వస్తుందో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మొత్తం మీద ఈ థియేటర్ల వ్యవహారానికి కనుక ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టకపోతే పండగ సినిమాలకు కష్టమే.
అయినా పెద్ద బడ్ఙెట్ సినిమాలకు రేట్లు పెంచితే అర్థం చేసుకోవచ్చు. 10 కోట్ల రేంజ్ సినిమాలకు కూడా తొలివారం యూనిఫారమ్ రేటు పెట్టే లెవెల్ కు వెళ్లిపోయింది వ్యవహారం. దాంతో పరిస్థితి విషమించింది. నిజానికి జగన్ కు ఇండస్ట్రీ అంటే అంత కోపం వున్నట్లు కనిపించదు. చిరంజీవి ఆయన దగ్గరకు వెళ్తే సాదరంగా ఆహ్వానించి, భోజనం పెట్టి మరీ పంపారు.
కానీ ఆ మర్యాదను ఇండస్ట్రీ నిలబెట్టుకుని వుండాల్సింది. జగన్ గెలవగానే సాదరంగా ఇండస్ట్రీకి ఆహ్వానించి వుండాల్సింది. కానీ అలా జరగలేదు. పైగా జగన్ ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసారు. దాంతో పరిస్థితి విషమించింది. ఇండస్ట్రీ పెద్దలు చాలా మంది వ్యవహారం కోర్టులకు వరకు వెళ్లకుండా చాలా ప్రయత్నించారు. కానీ అది కుదరలేదు. దాంతో మొత్తం బెడిసికొట్టింది.