అన్ లాక్ 5.Oలో భాగంగా ఇవాళ్టి నుంచి థియేటర్లు తెరిచేందుకు కేంద్రం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగా దేశవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి మళ్లీ థియేటర్లలో సందడి మొదలు కాబోతోంది. అయితే అది పూర్తిస్థాయిలో మాత్రం కాదు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సింగిల్ స్క్రీన్స్ తెరవడం లేదు. మల్టీప్లెక్సులు మాత్రమే అందుబాటులోకి వస్తున్నాయి.
సినిమా హాళ్లు తెరుచుకుంటున్నప్పటికీ రిలీజెస్ మాత్రం లేవు. దీంతో పాత సినిమాల్నే ఇవాళ్టి నుంచి తిరిగి ప్రదర్శించడానికి థియేటర్లు రెడీ అయ్యాయి. బెంగళూరులో పాత కన్నడ సినిమాలతో పాటు తెలుగులో హిట్టయిన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో, భీష్మ సినిమాల్ని మళ్లీ షెడ్యూల్ చేశారు. ఈ మేరకు బుక్ మై షోలో బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. చెన్నైలో కూడా ఇదే పరిస్థితి.
అటు ఉత్తరాదిన దాదాపు అన్ని రాష్ట్రాల్లో మల్టీప్లెక్సులు ఇవాళ్టి నుంచి ఓ మోస్తరుగా పనిచేయబోతున్నాయి. ఇక్కడ కూడా పాత సినిమాలే షెడ్యూల్ చేశారు. తన్హానీ, మలంగ్, కేదార్ నాథ్, తప్పడ్ లాంటి సినిమాలు థియేటర్లలో అందుబాటులోకి వచ్చాయి.
దేశంలోనే టాప్ మల్టీప్లెక్స్ కంపెనీల్లో ఒకటైన పీవీఆర్ సంస్థ.. ఇవాళ్టి నుంచి తమ స్క్రీన్స్ ఓపెన్ చేస్తున్నట్టు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఈ సంస్థకు 846 స్క్రీన్స్ ఉంటే, అందులో 496 స్క్రీన్స్ ఇవాళ్టి నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి. పీవీఆర్ తో పాటు ఇతర మల్టీప్లెక్స్ సంస్థలు కూడా తమ స్క్రీన్స్ ను తెరవబోతున్నాయి.
అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. తెలంగాణలో థియేటర్లు తెరిచేందుకు ఎగ్జిబిటర్లు ఆసక్తి చూపించినప్పటికీ ప్రభుత్వం ఇంకా పూర్తిస్థాయిలో అనుమతులు ఇవ్వలేదు. దీనికితోడు భారీ వర్షాలు సినిమా హాళ్లు తెరిచేందుకు అడ్డంకిగా మారాయి. అటు ఏపీలో ఎగ్జిబిటర్లంతా మూకుమ్మడిగా థియేటర్లు తెరవకూడదని నిర్ణయించారు.
విజయవాడలో సమావేశమైన 13 జిల్లాల ఎగ్జిబిటర్లు, 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడపడం సాధ్యం కాదని తేల్చేశారు. దీనికితోడు తమ థియేటర్ల కరెంట్ బిల్లుల మాఫీపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ప్రభుత్వ నిర్ణయంపై థియేటర్లు తెరవాలా వద్దా అనే అంశం ఆధారపడి ఉంటుందని ప్రకటించాయి.
మరోవైపు ఖర్చు తగ్గించేందుకు క్యూబ్, యూఎఫ్ఓ లాంటి సంస్థలు వీపీఎఫ్ (వర్చువల్ ప్రింట్ ఫీ) తగ్గించాయి. కొన్నాళ్ల పాటు 50శాతం చార్జీలు మాత్రమే వసూలు చేస్తామని ప్రకటించాయి. అయినప్పటికీ థియేటర్లు ఇప్పట్లో పుంజుకోవడం కష్టమే.
దీనికితోడు ఇన్నాళ్లూ థియేట్రికల్ రిలీజ్ కోసమే వెయిట్ చేసిన రెడ్ లాంటి సినిమాలు కూడా వెంటనే థియేటర్లలోకి వచ్చేందుకు మొగ్గుచూపించడం లేదు. పరిస్థితులు అనుకూలిస్తే.. దసరా నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా హాళ్లు తెరుచుకునే అవకాశం ఉంది.