ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఏ క్షణాన బాధ్యతలు తీసుకున్నాడో కానీ, నిత్యం యుద్ధ వాతావరణమే. బాబు ఐదేళ్ల పాలనలో విసిగిపోయిన జనం ….ఇక చాలు చాలు అని గద్దె దింపారు. తాను ఓడిపోవడం కంటే జగన్ గెలవడం చంద్రబాబుతో పాటు ఎల్లో బ్యాచ్ అసలు జీర్ణించుకోలేకున్నది. నిత్యం ఏదో ఒక సాకుతో న్యాయస్థానాలను ఆశ్రయించడం, అడ్డంకులు సృష్టించడం నిత్యకృత్యమైంది.
ఈ నేపథ్యంలో ఇటీవల సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో పాటు పలువురు హైకోర్టు న్యాయమూర్తులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫిర్యాదు చేయడం, ఆ కాపీని బహిరంగపరచడం దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది.
ఈ నేపథ్యంలో అసలు ముఖ్య మంత్రి పదవిలో ఉండే అర్హతే జగన్‌కు లేదని, ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, కావున పదవి నుంచి తప్పించా లంటూ సుప్రీంకోర్టులో ఏకంగా పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్ దాఖలు చేశారు.
గత కొంత కాలంగా చోటు చేసుకున్న పరిణామాలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు విసిగిపోయి ఉన్నారు. దీంతో ఒక రకమైన వైరాగ్యం, నైరాశ్యంలో ఉన్నారు. దీంతో ఆ చంద్రబాబునే శాశ్వతంగా ఏపీ ముఖ్యమంత్రిగా కొనసాగేలా ఓ చట్టం తీసుకొస్తే ఈ ఇబ్బందులు ఉండవని అసహనం, నిర్వేదంతో అంటున్నారు.
ఎందుకంటే చంద్రబాబు పాలన వద్దనుకునే ఆయన్ను ఇంటికి సాగనంపామని, జగన్‌ను అధికారంలోకి తెచ్చుకున్నామని, తమ ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికైన వ్యక్తి కాకుండా, ఓడిపోయిన చంద్రబాబే పాలిస్తున్నట్టుగా వ్యవహారం తయారైందనే అభిప్రాయాలు ఏపీలో బలంగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ నేపథ్యంలో మరోసారి అలాంటి అభిప్రాయాలు మరింత బలపడుతున్నాయి. చంద్రబాబు పాలకుడైతే అంతా ఆయన ఇష్టారాజ్యంగా పరిపాలించుకునే వెసలుబాటు ఉంది.
ఆయన్ను ఏ వ్యవస్థ టచ్ చేయదు. ఆ అవకాశం ఎంత మాత్రం ఉండదు. అందుకే పనిలో పనిగా జగన్‌ను సీఎంగా తప్పించడంతో పాటు చంద్రబాబును ఆ సీట్లో కూచోపెట్టాలని ఎవరైనా ముందుకొచ్చి ఓ చట్టం తీసుకొస్తే బాగుంటుందనే కామెంట్స్ విరివిగా వస్తున్నాయి