కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అన్ లాక్ 5.0 లో భాగంగా థియేటర్లు తెరవడానికి అనుమతి లభించింది. నేటి నుంచి అన్ లాక్ 5.0 అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం థియేటర్లను తెరుచుకోవచ్చు. అయితే ఈ విషయంలో పెద్దగా ఉత్సాహం కనిపిస్తున్నట్టుగా లేదు.
ఆంధ్రప్రదేశ్ లో అయితే ఎగ్జిబీటర్ల సమావేశంలో థియేటర్లు తెరవడానికి సంసిద్ధంగా లేనట్టుగా ప్రకటించారు. ప్రస్తుత నియమాలతో థియేటర్లను తెరిస్తే.. తమకు భారీ నష్టాలే అని వారు అభిప్రాయపడినట్టుగా తెలుస్తోంది.
50 శాతం ఆక్యుపెన్సీకి కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే 50 శాతం స్థాయిలో కూడా జనాలు థియేటర్ కు వస్తారా? అనేది అనుమానమే. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు కూడా వ్యక్తిగత రక్షణకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో థియేటర్ కు వెళ్లి సినిమా చూడటానికి ఎంత శాతం మంది ఉత్సాహం చూపిస్తారు? అనేది ప్రశ్నార్థకమే. కోవిడ్-19 ఉధృతి మరింత తగ్గే వరకూ థియేటర్ కు వెళ్లడానికి జనాలు సిద్ధంగా ఉండకపోవచ్చు.
ఇదే సమయంలో 50 శాతం థియేటర్లను నింపినా తమకు ఉపయోగం లేదనేది ఎగ్జిబీటర్ల వాదనగా తెలుస్తోంది. ఖర్చులకు తగిన స్థాయిలో డబ్బులు రావనేది వారి వాదనగా సమాచారం. ప్రభుత్వం రాయితీలు ఇస్తే థియేటర్లను తెరవడం సాధ్యం అవుతుందనేది వారి వాదన. అయితే ఎన్ని రంగాలకు అని ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తూ పోతుంది?
కర్ణాటకలో అయితే.. టికెట్ ధరను తగ్గించనున్నట్టుగా ప్రకటించారు. మామూలు టికెట్ ధర 40 రూపాయలు, బాల్కానీ టికెట్ ధర 50 రూపాయలతో పరిమిత స్థాయిలో థియేటర్లను తెరవడానికి అక్కడి యాజమానులు రెడీ అని ప్రకటించినట్టుగా తెలుస్తోంది.
మల్టీప్లెక్సుల్లో ఆ ధర సాధ్యం కాకపోవచ్చు. చిన్న థియేటర్లలో మాత్రమే ఆ ధర తగ్గింపు ఉండవచ్చు. అది కూడా అన్ని థియేటర్లనూ తెరవడం లేదు అక్కడ. పరిమిత సంఖ్యలోని థియేటర్లను మాత్రమే తెరవడానికి అక్కడి థియేటర్ల యజమానులు ముందుకు వచ్చినట్టుగా సమాచారం.