ఇప్పుడే కాదు, గడిచిన రెండేళ్లుగా ఓవర్సీస్ నుంచి డేంజర్ బెల్స్ మోగుతూనే ఉన్నాయి. భారీ రేట్లకు సినిమాలు కొనడం, డిస్ట్రిబ్యూటర్లకు చేతులు కాలడం కామన్ అయిపోయింది. సరిసర్లే.. ఎన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా అని సర్దిచెప్పుకునే రోజులు పోయాయి. ఎందుకంటే, చాలామంది ఓవర్సీస్ జనాలు ఇప్పుడు ఓటీటీని నమ్ముకుంటున్నారు. కొద్దోగొప్పో మిగిలిన ఆ ప్రేక్షకులు కూడా థియేటర్లకు రావడం తగ్గించేస్తే, ఓ భారీ మార్కెట్ ను టాలీవుడ్ కోల్పోవాల్సి వస్తుంది.
ఈ ప్రమాద ఘంటికలకు ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలుస్తున్నాయి ఈ ఏడాది టాప్-10 ఓవర్సీస్ మూవీస్. లిస్ట్ చూస్తే బ్రహ్మాండంగా ఉంది కానీ 3-4 తప్ప అన్నీ కాస్ట్ ఫెయిల్యూర్సే. వసూళ్లు మిలియన్స్ లో ఉన్నప్పటికీ లెక్కలు చూస్తే మిగులు కనిపించలేదు. ప్రభాస్ సాహో తీసుకున్నా, చిరంజీవి సైరా చూసినా, మహేష్ మహర్షి అయినా, దేనికీ ఓవర్సీస్ లో లాభాల్లేవు.
ఇంత స్లంప్ లో కూడా లాభాల బాట పట్టిన సినిమాలు కొన్ని ఉన్నాయి. వెంకీ-వరుణ్ తేజ్ చేసిన సంక్రాంతి స్పెషల్ ఎఫ్2 సినిమా ఓవర్సీస్ లో మంచి లాభాలు (2,134,632 డాలర్లు) కొల్లగొట్టింది. అటు సమంత నటించిన ఓ బేబీకి కూడా ఓవర్సీస్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సోలోగా సమంతకు మిలియన్ డాలర్ క్లబ్ లో చోటిచ్చారు. వీటితో పాటు నాగచైతన్య చేసిన మజిలీ, నాని నటించిన జెర్సీ సినిమాలు ఈ ఏడాది ఓవర్సీస్ లో సక్సెస్ ఫుల్ వెంచర్స్ గా నిలిచాయి. మోడరేట్ బడ్జెట్ లో సినిమా తీసి, రీజనబుల్ రేట్లకు అమ్మడం, కంటెంట్ కూడా క్లిక్ అవ్వడం ఈ సినిమాలకు కలిసొచ్చింది.
ఓవర్సీస్ టాప్-10 మూవీస్
సాహో – $3,233,611
సైరా – $2,608,115
ఎఫ్2 – $2,134,632
మహర్షి – $1,891,129
జెర్సీ – $1,314,137
ఓ బేబి – $1,033,926
గ్యాంగ్ లీడర్ – $962,406
ఎన్టీఆర్ కథానాయకుడు – $928,275
డియర్ కామ్రేడ్ – $833,572
మజిలీ – $773,083