ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధాని మార్పుపై నిర్ణయాన్ని అధికారికంగా ఇంకా ప్రకటించకపోయినా ఆ మార్పు జరిగిపోయినట్లేనని జనం భావిస్తున్నారు. ముఖ్యంగా వైకాపా నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చేస్తున్న ప్రకటనలు, ప్రసంగాలు వింటున్న ఎవరికైనా రాజధాని మూడు ముక్కలైపోయిందనే ఫీలింగ్ బలంగా ఉంది. అధికారిక ప్రకటన చేయడం ఒక్కటే మిగిలిపోయింది.
మంత్రిమండలి సమావేశం తరువాత విశాఖకు వెళ్లిన సీఎం జగన్ అక్కడ రాజధాని గురించి పల్లెత్తు మాట మాట్లాడలేదు. అయితేనేం ఆయన కుడిభజం విజయసాయి రెడ్డి మరోసారి స్పష్టంగా చెప్పేశాడు. విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అవుతోందని, అన్ని అడ్డంకులు తొలగించుకొని త్వరలోనే రాజధాని అవుతుందని, అక్కడి నుంచే పాలన సాగుతుందని క్లారిటీ ఇచ్చేశాడు. రాజధాని మార్చడం చాలా సులభమని, మూడు రాజధానులు చేయడం చాలా ఈజీయని వైకాపా నాయకులు చెబుతున్నారు.
కాని టీడీపీ, బీజేపీ నేతలు రాజధాని మార్పు సులభం కాదంటున్నారు. కొందరు విశ్లేషకులు, మీడియా నిపుణులు కూడా ఇదే చెబుతున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఇదే విషయాన్ని మరింత గట్టిగా చెప్పాడు. రాజధాని మార్పును కేంద్రం చూస్తూ ఊరుకోదని అన్నాడు. అమరావతి నుంచి అంగుళం కూడా కదిలించలేరని చెప్పాడు. ముఖ్యంగా రాజధాని మారిస్తే జగన్ సర్కారుకు ఖర్చు తడిసి మోపెడవుతుందన్నాడు.
గత ప్రభుత్వం అమరావతి పేరిట బాండ్స్ విడుదల చేసిందని, వాటి పరిస్థితి ఏమిటని సుజనా ప్రశ్నించాడు. అమరావతిలో ఆస్తులు కొన్న ప్రయివేటు సంస్థలు కోర్టుకెళితే వాటికి రెండు లక్షల కోట్లు చెల్లించాలివస్తుందన్నాడు. ప్రముఖ విశ్లేషకుడు , మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ కూడా కొన్ని రోజుల క్రితం రాజధాని మారిస్తే దాదాపు లక్ష కోట్లు ఖర్చు చేయాల్సివస్తుందన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు తమకు 2013 భూసేకరణ చట్టం కింద నష్టపరిహారం ఇవ్వాలని కోర్టుకెళితే, కోర్టు వారికి అనుకూలంగా తీర్పు చెబితే దాదాపు 80 నుంచి 90 కోట్ల మేరకు పరిహారం కింద చెల్లించాల్సివుంటుందన్నారు.
అమరావతిలో నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్లకు భారీ మొత్తంలో చెల్లించాల్సివుంటుందన్నారు. అమరావతి మారిస్తే చాలా ఇబ్బందులు వస్తాయని, వాటిని అధిగమించడం సులభం కాదని నాగేశ్వర్ చెప్పారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మూడు రాజధానుల ఆలోచన కేంద్రానికి తెలియకుండా జగన్ చేసుండరని కొందరు చెబుతున్నారు.
అమరావతిని కేంద్రం రక్షిస్తుందనే భావనను ఏపీ బీజేపీ నాయకులు ప్రజల్లో కలిగిస్తున్నారు. ఆందోళన చేస్తున్నవారు ఒక రోజు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ముఖాల మాస్కులు ధరించి ధర్నా చేశారు. ఈమధ్య ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు 'పాలన ఒకచోటనే ఉండాలి. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి' అన్నారు. అంటే రాజధాని అమరావతిలోనే ఉండాలనేది ఆయన అభిప్రాయం.
రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయం అడిగితే చెబుతానన్నారు. ఇదే సందర్భంలో ఆయన రాజధాని వ్యవహారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని చెప్పారు. రాజధాని ఎక్కడ ఉండాలో, మొత్తం ఒకే చోట ఉండాలా? పలు చోట్ల ఉండాలా? అనేది నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఉద్యమం చేస్తున్న అమరావతి రైతులు వెంకయ్య నాయుడిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.
వారు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు రాశారు. బీజేపీ నాయకులు కూడా అమరావతే రాజధానిగా ఉండేటట్లు కేంద్రం వద్ద ప్రయత్నాలు చేస్తామని అంటున్నారు. అయితే రాజధాని విషయంలో ఏం చేయాలనుకున్నా రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అధికారాలున్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్రా లేదనే వాదన వినబడుతోంది. అమరావతిలో రాజధాని నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు కాబట్టి దాన్ని గౌరవించి అక్కడే ఉంచాలని కొందరంటున్నారు.
ఇక రాజధానిని మార్చకూడదని కోర్టుకు వెళతామంటున్నారు ఆందోళనకారులు. ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకునే అధికారం కోర్టుకు ఉంటుందా? అనే ప్రశ్న ఎదురవుతోంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఉన్నాయో లేవో చూడటమే కోర్టుల పని. కాని ఫలానవిధంగానే చేయాలని కోర్టులు చెప్పలేవు.
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె జరిగినప్పుడు హైకోర్టు తమకు అండగా ఉంటుందని కార్మికులు అనుకున్నారు. కాని హైకోర్టు చేతులెత్తేసింది. తమ అధికారాలు పరిమితంగా ఉంటాయని కోర్టు చెప్పింది. చివరకు ప్రభుత్వం తాను అనుకున్న ప్రకారమే చేసింది. కోర్టుకు వెళితే అమరావతి విషయంలోనూ ఇదేవిధంగా జరగొచ్చు అంటున్నారు కొందరు విశ్లేషకులు.