మారిన‌ జ‌గ‌న్ ప‌నితీరు!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ పూర్తిగా పార్టీపైనే దృష్టి సారించారు. వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశాలు నిర్వ‌హించ‌డం దాదాపుగా మానేశారు. అలాంటివి ఏవైనా వుంటే మంత్రులు, సంబంధిత శాఖ‌ల అధికారులు చేసుకుంటార‌నే భావ‌న‌లో…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ పూర్తిగా పార్టీపైనే దృష్టి సారించారు. వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశాలు నిర్వ‌హించ‌డం దాదాపుగా మానేశారు. అలాంటివి ఏవైనా వుంటే మంత్రులు, సంబంధిత శాఖ‌ల అధికారులు చేసుకుంటార‌నే భావ‌న‌లో జ‌గ‌న్ ఉన్నారు. మ‌రోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డంపైనే జ‌గ‌న్ ఆలోచ‌న‌లన్నీ తిరుగుతున్నాయి. వైసీపీని బ‌లోపేతం చేసుకుంటూ, ఎన్నిక‌ల యుద్ధానికి శ్రేణుల్ని స‌న్న‌ద్ధం చేస్తున్నారు.

గ‌త మూడేన్న‌రేళ్ల జ‌గ‌న్ పాల‌న‌ను గ‌మ‌నిస్తే… పూర్తిగా అధికారుల‌తో స‌మీక్ష‌లు, ప‌థ‌కాల అమ‌లు గురించి ఆదేశాలకే ప‌రిమితం అయ్యారు. ఎన్నిక‌ల సీజ‌న్ మొద‌లు కావ‌డంతో ఆయ‌న అప్ర‌మ‌త్తం అయ్యారు. ఇంత‌కాలం వైసీపీని ఆయ‌న పూర్తిగా ప‌ట్టించు కోలేద‌న్న సంగ‌తి తెలిసిందే. దీంతో వైసీపీ నేత‌ల్లోనూ, కార్య‌క‌ర్త‌ల్లోనూ ఒక ర‌క‌మైన నైరాశ్యం నెల‌కుంది. ఈ విష‌యాన్ని జ‌గ‌న్ ప‌సిగ‌ట్టారు.

దీంతో పార్టీలో ఖాళీల భ‌ర్తీ ప్ర‌క్రియ చేప‌ట్టారు. ప్ర‌భుత్వ ప‌ద‌వులు ద‌క్క‌ని వారిని తాజాగా పార్టీ ప‌ద‌వుల‌తో సంతృప్తిప‌రుస్తున్నారు. ప్ర‌స్తుతం ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ దిన‌చ‌ర్య పూర్తిగా మారింది. అంతా ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని నిర్ణ‌యాలు తీసుకోవ‌డంపైనే జ‌గ‌న్ శ్ర‌ద్ధ చూపుతున్నారు. 

ప్ర‌తిరోజూ సాయంత్రం పీకే టీమ్ లీడ‌ర్‌ను ద‌గ్గ‌ర పెట్టుకుని, ఎక్క‌డెక్క‌డ ఎవ‌రెవ‌రికి ఎలా వుందో స‌మీక్షిస్తున్నారు. ఎవ‌రికి టికెట్లు ఇవ్వాలి, ఇవ్వ‌కూడ‌దో ఒక అవ‌గాహ‌న‌కు వ‌స్తున్నారు. పార్టీలో విభేదాల‌ను చ‌క్క‌దిద్దేందుకు స్వ‌యంగా ఆయ‌నే రంగంలోకి దిగారు.

నియోజ‌క వ‌ర్గాల్లో అసంతృప్త నేత‌లను పిలిపించుకుని వారి ఇబ్బందుల‌ను తెలుసుకుంటున్నారు. నాయ‌కుల మ‌ధ్య స‌యోధ్య కుదుర్చి రానున్న ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా ప‌ని చేయాల‌ని సూచిస్తున్నారు. స్థానిక స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డానికి చొర‌వ చూపుతున్నారు. 

సామాజిక స‌మీక‌ర‌ణ‌ల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తూ, అందుకు త‌గ్గ‌ట్టు రాజ‌కీయ నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. కుల‌ప‌రంగా బ‌ల‌మైన నాయ‌కుల్ని గుర్తించి వారిని పార్టీలో చేర్చుకోడానికి ఆస‌క్తి చూపుతున్నారు. పార్టీ, ప్ర‌భుత్వ వ్య‌తిరేక అంశాలేవో తెలుసుకుంటూ, వాటిని స‌రిదిద్దుకోడానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇలా ప్ర‌తిరోజూ ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా జ‌గ‌న్ క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు స‌మాచారం.