సినిమా వున్నోళ్లు భయపడ్డారు

నోరా వీపు మీదకు తేకే అన్నది పెద్దల మాట. చటుక్కున నోరు జారితే కష్టమే. అలా జారిన నోరుకు మద్దతు ఇస్తే ఇక ఇకలు..పక పకలు..ఎక్కువ చేస్తే ఇంకా నష్టమే. వెంకటేష్ మహా అనే…

నోరా వీపు మీదకు తేకే అన్నది పెద్దల మాట. చటుక్కున నోరు జారితే కష్టమే. అలా జారిన నోరుకు మద్దతు ఇస్తే ఇక ఇకలు..పక పకలు..ఎక్కువ చేస్తే ఇంకా నష్టమే. వెంకటేష్ మహా అనే ప్రస్తుతం ఖాళీగా వున్న దర్శకుడు కేజిఎఫ్ లాంటి సినిమా గురించి మాట్లాడిన మాటలకు పక్కనే వుండి తాన తందానా అన్నారు నందీనీరెడ్డి, ఇంద్రగంటి, వివేక్ ఆత్రేయ లాంటి మహానుభావులు. జనం నుంచి ఉవ్వెత్తున నిరసన, ట్రోలింగ్ వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది.

తను మాట్లాడిన ‘నీచ్ కమీన్ కుత్తే’ భాష సరి కాదని వెంకటేష్ మహాకు ఇప్పుడు అర్థం అయింది. అందుకే తన భాష తప్పు అని ఒప్పుకున్నారు. కానీ తన అభిప్రాయం తప్పు కాదని, దానికే అంటి పెట్టకుని వుంటా అని చెప్పేసారు.

కానీ పాపం, త్వరలో సినిమాలు పెట్టుకున్న నందినీ రెడ్డి, వివేక్ ఆత్రేయ మాత్రం తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చాలా వరకు చేసారు. ఈ డిస్కషన్ సాగినపుడు వీలయినంత మౌనంగా వున్న శివ నిర్వాణ ఇప్పుడు కూడా అదే విధంగా వున్నారు. శివ మీద ఏ కామెంట్ రానందున ఆయన మౌనం అర్థం చేసుకోవచ్చు.

ఇక మిగిలింది ఇంద్రగంటి. ఆయన ఈ విషయంలో వెంకటేష్ మహాకు మద్దతుగా ఆ చాటింగ్ లో గట్టిగానే మాట్లాడారు. కానీ ఇంత జరుగుతున్నా ఇప్పటికీ స్పందన మాత్రం లేదు. కొన్నాళ్లు ఆగితే అదే చల్లారిపోతుందనే భావన కావచ్చు. ఎలాగూ ఇప్పట్లో ఆయన సినిమా విడుదలకు లేదు.

ఇవన్నీ ఇలా వుంటే మా ఎన్టీఆర్ ఎంచుకున్న డైరక్టర్ ప్రశాంత్ నీల్ ను మీరు కామెంట్ చేస్తారా..అంటూ ఫ్యాన్స్ మాత్రం కాస్త కోపంగానే వున్నారు. ఈ కోపం ఈ డైరక్టర్ల సినిమాలు వచ్చినపుడు దాని పని అది చేసుకుని పోతుంది.