లోకేశ్ వెంట… టీడీపీ వీడుతాడ‌నే నేత!

టీడీపీ వీడుతాడ‌నే నేత తాజాగా పాద‌యాత్ర‌లో లోకేశ్‌తో క‌లిసి అడుగులో అడుగేశారు. అన్న‌మ‌య్య జిల్లాలో ఇవాళ 37వ రోజు లోకేశ్ పాద‌యాత్ర కొన‌సాగిస్తున్నారు. పీలేరు నియోజ‌క‌వ‌ర్గంలోని క‌లికిరి వ‌ద్ద పాద‌యాత్ర చేస్తున్న లోకేశ్‌ను విజ‌య‌వాడ…

టీడీపీ వీడుతాడ‌నే నేత తాజాగా పాద‌యాత్ర‌లో లోకేశ్‌తో క‌లిసి అడుగులో అడుగేశారు. అన్న‌మ‌య్య జిల్లాలో ఇవాళ 37వ రోజు లోకేశ్ పాద‌యాత్ర కొన‌సాగిస్తున్నారు. పీలేరు నియోజ‌క‌వ‌ర్గంలోని క‌లికిరి వ‌ద్ద పాద‌యాత్ర చేస్తున్న లోకేశ్‌ను విజ‌య‌వాడ టీడీపీ నేత వంగ‌వీటి రాధా క‌లుసుకోవ‌డం గ‌మ‌నార్హం.

వంగ‌వీటి రాధా ప్ర‌త్యేక‌త ఏమంటే ఆయ‌న ఏ పార్టీలో ఉన్నా యాక్టీవ్‌గా కొన‌సాగ‌రు. అప్పుడ‌ప్పుడు క‌నిపిస్తూ వుంటారు. అస‌లు రాజ‌కీయాల్లో క్రియాశీల‌కంగా ఉన్నారా?  లేదా? అనే అనుమానం రాకుండా ఉండ‌దు. కేవ‌లం దివంగ‌త వంగ‌వీటి మోహ‌న్‌రంగా త‌న‌యుడిగా ఆయ‌న‌కు గుర్తింపు, గౌర‌వం ఉన్నాయి. వాటిని నిలుపుకుని తండ్రి ఇమేజ్‌తో వంగ‌వీటి రాధా ఎద‌గ‌లేద‌నే విమ‌ర్శ వుంది.

రాధా ఏ పార్టీలో వుంటే అది అధికారంలోకి రాద‌నే విమ‌ర్శ ప్ర‌త్య‌ర్థులు చేస్తుంటారు. ఇదిలా వుండ‌గా ఈ నెల 14న జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌మ‌క్షంలో ఆ పార్టీలో చేరుతార‌నే ప్ర‌చారం కొంత కాలంగా సాగుతోంది. వాటిని ఆయ‌న ఎక్క‌డా ఖండించ‌లేదు. ఈ నేప‌థ్యంలో ఆక‌స్మికంగా పాద‌యాత్ర‌లో ప్ర‌త్య‌క్షం కావ‌డం ఇటు టీడీపీ, అటు జ‌న‌సేన శ్రేణుల్ని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. 

వంగ‌వీటి రాధా రాజ‌కీయంగా స్థిర‌మైన నిర్ణ‌యాలు తీసుకోక‌పోవ‌డం వ‌ల్లే ఆయ‌న ఆశించిన స్థాయిలో ఎద‌గ‌లేక‌పోయార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆయ‌న‌లో ఆవేశానికి త‌క్కువేం లేదు. కానీ రాజ‌కీయ ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టు తెలివైన నిర్ణ‌యం తీసుకోవ‌డంలో ఎప్పుడూ త‌ప్ప‌ట‌డుగులు వేస్తూనే ఉన్నారు. 

గత సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేర‌డమే నిద‌ర్శ‌నం. ఆ త‌ర్వాత టీడీపీ నుంచి కూడా ఆయ‌న పోటీ చేయ‌లేదు. ప్ర‌తిప‌క్ష పార్టీలో ఆయ‌న పాత్ర ఏంట‌నేది రాధాకే తెలియ‌ని ప‌రిస్థితి. లోకేశ్ పాద‌యాత్ర‌లో క‌నిపించి మ‌రోసారి చ‌ర్చ‌కు అవ‌కాశం క‌ల్పించారు.