భూమ‌న చొర‌వ‌…ఆల‌య ప్రాచీన చ‌రిత్ర వెలుగులోకి!

తిరుప‌తి, తిరుమ‌ల పేర్లు వింటే చాలు మ‌న‌సులో ఓ ఆరాధ‌న భావం. క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌రుడు మ‌దిలో మెదులుతుంటే , భ‌క్తి భావంతో క‌ళ్లు మూసుకుని దండం పెట్టుకుంటాం. తిరుప‌తి, తిరుమ‌ల‌లు… అన్ని ప్రాంతాలు,…

తిరుప‌తి, తిరుమ‌ల పేర్లు వింటే చాలు మ‌న‌సులో ఓ ఆరాధ‌న భావం. క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌రుడు మ‌దిలో మెదులుతుంటే , భ‌క్తి భావంతో క‌ళ్లు మూసుకుని దండం పెట్టుకుంటాం. తిరుప‌తి, తిరుమ‌ల‌లు… అన్ని ప్రాంతాలు, న‌గ‌రాల మాదిరిగా కేవ‌లం ఊళ్లు కాదు. హిందూ ఆధ్మాత్మిక క్షేత్రాలు. అందుకే వాటికి అంత ప్రాధాన్యం. తిరుప‌తి, తిరుమ‌ల‌లో అణువ‌ణువు ఎంతో పుణ్యం చేసుకున్న నేల‌.

కొండ‌పైన తిరుమ‌లేశుడి గొప్ప‌త‌నం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. కొండ‌కింద ఆ ఏడుకొండ‌ల స్వామి చెల్లెలైన తాత‌య్యగుంట గంగ‌మ్మ ఆల‌యం వెయ్యేళ్ల క్రితం నిర్మిత‌మైంది. తాజాగా ఆ ప్రాచీన ఆల‌యాన్ని టీటీడీ, దేవాదాయ‌శాఖ సంయుక్తంగా పున‌ర్నిర్మించేందుకు యుద్ధ‌ప్రాతిప‌దిక‌న ప‌నులు చేప‌ట్టాయి. ఈ సంద‌ర్భంగా ఆల‌యానికి సంబంధించి ఓ అద్భుతం వెలుగు చూసింది. ఇందుకు తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న కరుణాక‌ర‌రెడ్డికి చ‌రిత్ర‌పై అధ్య‌య‌నం, శాస్త్రీయ దృక్ప‌థం తోడ‌య్యాయి. అదేంటో తెలుసుకుందాం.

రూ.16 కోట్ల‌తో తాత‌య్య‌గుంట గంగ‌మ్మ ఆల‌య పున‌ర్నిర్మాణం చేప‌ట్టారు. మే నెల‌లో జాత‌ర‌ను వైభ‌వంగా నిర్వ‌హించేందుకు నిర్మాణ ప‌నులు ఎమ్మెల్యే నేతృత్వంలో యుద్ధ‌ప్రాతిపదిక‌న జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో శిథిల త‌వ్వ‌కాల నుంచి రెండు రాతిస్తంభాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. తాత‌య్య‌గుంట గంగ‌మ్మ ఆల‌యంతో పాటు తిరుప‌తి, తిరుమ‌ల‌లో వెల‌సిన ప్ర‌తి ఆల‌య చ‌రిత్ర గురించి క్షుణ్ణంగా తెలిసిన భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి ఆ రాతి స్తంభాల‌పై బొమ్మ‌ల్ని చూడ‌గానే అబ్బురానికి లోన‌య్యారు.

ఇవేవో ప్రాచీన సంప్ర‌దాయాలు, సంస్కృతుల‌ను ప్ర‌తిబింబిస్తున్నాయ‌ని ఆయ‌న గ్ర‌హించారు. దీంతో ఆయ‌న వాటి గురించి నిగ్గు తేల్చేందుకు పురావ‌స్తుశాఖ కేంద్ర విభాగం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేర‌కు కేంద్ర పురావ‌స్తుశాఖ డైరెక్ట‌ర్ శ్రీ‌ల‌క్ష్మి బృందం తిరుప‌తికి వ‌చ్చింది. తాత‌య్య‌గుంట గంగ‌మ్మ ఆల‌య త‌వ్వ‌కాల్లో బ‌య‌ట‌ప‌డిన రాతి స్తంభాల‌పై బొమ్మ‌ల‌ను ప‌రిశీలించింది. ఈ సంద‌ర్భంగా ఆశ్చ‌ర్య‌, ఆనంద‌క‌ర విష‌యాలు వెలుగు చూడ‌డం విశేషం.

ప‌ల్ల‌వు రాజుల ఆఖ‌రి వంశ‌స్తుల‌ పాల‌న‌లో ఒక‌ స్తంభం నిర్మాణం జ‌రిగిన‌ట్టు శ్రీ‌ల‌క్ష్మి బృందం ప్రాథమిక నిర్ధార‌ణ‌కు వ‌చ్చింది. మ‌రో స్తంభం వేణువు (సంగీత వాయిద్య ప‌రిక‌రం) రూపంలో ఉండ‌డంతో ఇది చోళ రాజుల సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను ప్ర‌తిబింబిస్తున్న‌ట్టు చెప్పారు. ప‌ల్ల‌వులు, ఆ త‌ర్వాత చోళులు, విజ‌య‌న‌గ‌ర రాజుల కాలంలో ఆల‌యం నిర్మాణానికి నోచుకుంద‌ని పురావ‌స్తుశాఖ అధికారులు స్ప‌ష్టం చేశారు. దీనిపై లోతైన‌, స‌మ‌గ్ర‌మైన ద‌ర్యాప్తు చేయ‌డానికి ఆర్కియాలిజీ విభాగం సిద్ధ‌మైంది. ఆఖ‌రి ప‌ల్ల‌వు వంశ‌స్తుల‌ పాల‌న అంటే ఏడెనిమిది శ‌తాబ్దాల కాలం. దాదాపు 1300 సంవ‌త్స‌రాల‌కు పూర్వ‌మే ఈ ఆల‌య నిర్మాణం జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది.

ఈ రాతి స్తంభాల‌పై వైష్ణవ సంప్ర‌దాయ చిహ్నాలైన విష్ణుమూర్తుల బొమ్మ‌లను గుర్తించారు. దీంతో వెంక‌టేశ్వ‌ర‌స్వామి చెల్లెలు గంగ‌మ్మ అని నిర్ధార‌ణ అయ్యింది. అలాగే ఇది అత్యంత పురాత‌న ఆల‌య‌ని తేలిపోయింది. తిరుప‌తితో పాటు చుట్టుప‌క్క‌ల నిర్మిత‌మైన గోవింద‌రాజ‌స్వామి, తిరుచానూరు అమ్మ‌వారి ఆల‌యాల కంటే తాత‌య్య‌గుంట గంగ‌మ్మ ఆల‌యం పురాత‌న‌మైంద‌ని పురావ‌స్తుశాఖ అధికారుల ప్రాథమిక ప‌రిశోధ‌న‌తో నిర్ధార‌ణ అయ్యింది. మ‌న‌మెవ‌రో మూలాలు తెలుసు కోవాలంటే గ‌తం తాలూకూ శిథిలాల్లోకి వెళ్లాలి. ఆ స్పృహ‌, జ్ఞానం తెలిసిన ఎమ్మెల్యే తిరుప‌తికి ప్రాతినిథ్యం వ‌హిస్తుండ‌డంతో తాజాగా అనేక తెలియ‌ని గొప్ప‌గొప్ప సంగ‌తులు వెలుగు చూస్తున్నాయి.

భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి రాజ‌కీయాల‌తో విభేదించే వాళ్లు ఉండొచ్చు. కానీ చ‌రిత్ర‌, భాషా, జాన‌ప‌ద సంస్కృతుల‌ను స‌జీవంగా ఉంచుకునేందుకు తిరుప‌తి కేంద్రంగా ఆయ‌న చేస్తున్న కార్యాల్ని ఎవ‌రూ త‌ప్పు ప‌ట్ట‌లేరు. ఈ కోణంలోనే తాజాగా తిరుప‌తి తాత‌య్య‌గుంట గంగ‌మ్మ ఆల‌యం చరిత్ర త‌వ్వ‌కాల్ని చూడాల్సి వుంటుంది.