రాజ‌ధానికి కౌంట్ డౌన్‌

ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి అందిన నివేదిక పరిశీలనకు హై-పవర్ కమిటీని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా ఇచ్చిన జీఎన్ రావు కమిటీ నివేదికతో పాటు ఇతర కమిటీల నివేదికల్ని కూడా ఈ హై-పవర్ కమిటీ…

ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి అందిన నివేదిక పరిశీలనకు హై-పవర్ కమిటీని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా ఇచ్చిన జీఎన్ రావు కమిటీ నివేదికతో పాటు ఇతర కమిటీల నివేదికల్ని కూడా ఈ హై-పవర్ కమిటీ అధ్యయనం చేస్తుంది. త్వరలోనే ప్రభుత్వం చేతికి అందనున్న బోస్టన్ గ్రూప్ టెక్నికల్ నివేదికను కూడా ఈ కమిటీనే అధ్యయనం చేస్తుంది.

పది మంది మంత్రులతో సహా 16 మంది సభ్యులతో ఈ కమిటీని నియమించారు. ఈ కమిటీలో ఆర్థిక మంత్రి బుగ్గన, రవాణా మంత్రి పేర్ని నాని, హోం మంత్రి సుచరిత, మున్సిపల్ శాఖ మంత్రి బొత్సతో పాటు పలువురు మంత్రులున్నారు. వీళ్లతో పాటు చీఫ్ సెక్రటరీ ఇతర హై-లెవెల్ ఐఏఎస్ అధికారులున్నారు. వీళ్లంతా కలిసి నివేదికల్ని అధ్యయనం చేసి 3 వారాల్లోగా ప్రభుత్వానికి తుది నివేదిక ఇస్తారు. అవసరం అనుకుంటే.. ఈ హై-పవర్ కమిటీ అడ్వకేట్ జనరల్ సలహా కూడా తీసుకోవచ్చు.

అయితే హై-పవర్ కమిటీ ఇచ్చే తుది నివేదిక.. జీఎన్ రావు కమిటీ నివేదికకు ఏమాత్రం భిన్నంగా ఉండకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. వికేంద్రీకరణ తథ్యం అంటున్నారు. దీనికి మరింత ఊతమిస్తూ.. విశాఖ పరిసరాల్లో 3వేల ఎకరాల ప్రభుత్వ-ప్రైవేటు స్థలాల్ని పరిశీలించి ఓ జాబితా తయారుచేశారు. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే.. విశాఖలో కూడా పరిపాలన రాజధాని ఒకే చోట కేంద్రీకృతమై ఉండకపోవచ్చు.

విశాఖలో ఓ ప్రాంతంలో సెక్రటేరియట్ ఏర్పాటుచేస్తే.. మరికొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలకు తగ్గట్టు శాఖలవారీగా ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకుంటాయని తెలుస్తోంది. అటు సీఎం క్యాంప్ ఆఫీస్, సిబ్బంది-మంత్రుల ఇళ్లను కూడా విశాఖ చుట్టుపక్కల వేర్వేరు ప్రాంతాల్లో నెలకొల్పాలని అనుకుంటున్నారట. ఇలా చేయడం వల్ల మొత్తంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యం అవుతుందని ప్రాధమికంగా ఓ అంచనాకు వచ్చారు.