అల్లు అరవింద్‌ది నలభై ఏళ్ల సినీరంగ ప్రస్థానం. ఆయనకు నిర్మలతో 1974లో వివాహమైంది. వారి కాపురంలో తండ్రి అల్లు రామలింగయ్య పుల్లలు పెట్టారు. ఈ విషయాన్ని ఎవరో మూడో వ్యక్తి చెప్పలేదు. స్వయంగా అల్లు అరవిందే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అంతేకాదు 45 ఏళ్ల వయస్సులోనున్న తనపై తండ్రి చేయి చేసుకున్నాడని కూడా చెప్పాడు. వ్యక్తిగత జీవితంలో ఇలాంటి ఎన్నో అనుభవాల గురించి అరవింద్ దంపతులు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
మొదట నిర్మలను తన తండ్రి అల్లు రామలింగయ్యే పెళ్లి చూపులు చూసివచ్చారని, ఆయన ‘ఓకే’ అనడంతో తాను పెళ్లి చూపులకు వెళ్లినట్టు అరవింద్ తెలిపాడు. అమ్మాయిని చూడడం తప్పితే మాటామంతీ లాంటివేవీ లేవన్నాడు. తర్వాత తాంబూలాలు మార్చుకున్నామని, ఐదు నెలల గ్యాప్‌తో పెళ్లి చేసుకున్నట్టు అరవింద్, నిర్మల దంపతులు పాతరోజులను గుర్తు చేసుకున్నారు.
అత్తమామలు తనను కూతురిలా చూసుకున్నారని నిర్మల పొంగిపోయారు. ‘అమ్మాయ్’ అని మామ పిలిచేవారన్నారు. మామ షూటింగ్ నుంచి ఇంటికొచ్చాక తాను తప్ప ఎవరూ ఉండేవారు కాదన్నారు. దీంతో ఏదైనా తనతోనే ఆయన పంచుకునేవారని నిర్మల తెలిపారు. అరవింద్ జోక్యం చేసుకుంటూ తనపై చాడీలు కూడా చెప్పేవారని సరదాగా వాపోయాడు.
‘ఆ వెధవ’ అంటూ తనను తిట్టేవారని, తమ కాపురంలో పుల్లలు పెట్టేవారని కూడా నవ్వుతూ అరవింద్ చెప్పుకొచ్చాడు.
‘ఆలస్యంగా వస్తున్నాడంటే వాడికేదో పని ఉందని కాదు. నువ్వు జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పేవారు’ అని నిర్మల మరిన్నివిషయాలను గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత తనతో ఈ విషయాలు చెప్పి ఇద్దరం నవ్వుకునేవాళ్లం అని ఆదర్శ దంపతులిద్దరూ హాయిగా పాత విషయాలను చెప్పుకొచ్చారు.
అలాగే సురేఖ, తనది ఇంచుమించు ఒకే వయస్సు కావడంతో చాలా సన్నిహితంగా ఉండేవాళ్లమని నిర్మల తెలిపారు. మెగాస్టార్ చిరంజీవితో సురేఖ పెళ్లి తనే దగ్గరుండి చేసినట్టు, నిర్మల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేదని అరవింద్ మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు.
ఇందో సందర్భంలో కారును వేగంగా నడుపుతూ సడన్ బ్రేక్ వేయడంతో నాన్న విండ్ షీల్డ్‌కి కొట్టుకోబోయారని, ఆ కోపంతో తన చెంప ఛెళ్లుమనిపించాడని చెంప చూపుతూ అరవింద్ నాటి జ్ఞాపకాలను గుర్తు చేశాడు. అయితే నిర్మల చూడలేదను కున్నానన్నాడు. కానీ బెడ్‌రూమ్‌లోకి వెళ్లగానే మావయ్య ఎందుకు కొట్టారని అడగ్గానే ఓహ్ తెలిసిపోయిందే అనుకున్నా అని అరవింద్ చెప్పాడు. తమ జీవితానికి సంబంధించి ఇప్పటి తరానికి ఉపయోగపడే అనేక సూచనలు, సలహాలు ఆ దంపతులిద్దరూ పంచుకున్నారు.