తాము విడిపోయినా.. స్నేహితుల్లా మెలుగుతున్నట్టుగా ఈ మధ్య కాలంలో కొంతమంది సినీ మాజీ భార్యాభర్తలు ప్రకటించుకుంటూ ఉన్నారు. హీరోహీరోయిన్లు పెళ్లి చేసుకోవడం, కొంత కాలం తర్వాత విడిపోయిన జంటలు చాలానే ఉన్నాయి. అలాగే సినీ రంగానికి చెందిన పలువురి విడాకులు కూడా వార్తల్లో ఉంటాయి. తమ విడాకుల గురించి సదరు తారలు స్పందిస్తూ ఉంటారు.
విడిపోయాకా ప్రశాంతంగా ఉన్నట్టుగా వారు చెప్పుకుంటూ ఉంటారు. విడిపోయాకా తాము స్నేహితులుగా కొనసాగుతున్నట్టుగా కూడా వారు చెబుతుంటారు. ఈ క్రమంలో మలయాళీ స్టార్ హీరో దిలీప్ కూడా తన మాజీ భార్యపై ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. మలయాళీ నటి అయిన మంజూ వారియర్ ను దిలీప్ మొదట పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు ఒక పాప కూడా పుట్టినట్టుగా ఉంది.
ఆ తర్వాత వీరు విడిపోయారు. కొంత కాలం తర్వాత కావ్యా మాధవన్ ను పెళ్లి చేసుకున్నాడు దిలీప్. ఆమె కూడా మలయాళీ హీరోయినే. దిలీప్ తో పెళ్లికి ముందు కావ్యా మాధవన్ ఒక ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకుంది. ఏడాదికే విడాకులు ఇచ్చి, తిరిగి కేరళ చేరుకుందామె. తిరిగి వచ్చాకా దిలీప్- కావ్య లు పెళ్లి చేసుకున్నారు.
ఈ జంట ఒక వివాదంలో నిలిచింది. ఒక మలయాళీ నటిపై లైంగిక వేధింపుల వ్యవహారంలో దిలీప్- కావ్యా మాధవన్ ల పాత్ర ఉందని వార్తలు వచ్చాయి. అందుకు సంబంధించి దిలీప్ అరెస్టయ్యాడు. కొన్ని నెలల పాటు జైల్లో గడిపాడు. బయటకు వచ్చి ఇప్పుడు మళ్లీ సినిమాలు చేస్తూ ఉన్నాడు. సదరు నటి పై దిలీప్ కు కక్ష సాధింపులో భాగంగా లైంగిక వేధింపులను చేయించాడు అనే అభిప్రాయాలు వినిపించాయి. మంజూ వారియర్ తో వివాహబంధంలో ఉండగా దిలీప్ -కావ్యా మాధవన్ ల మధ్య ఎఫైర్ నడిచిందని, అందుకు సంబంధించి మంజూకు మలయాళీ నటి సమాచారం ఇచ్చిందని, దీంతో దిలీప్-మంజుల విడాకులు అయ్యాయని అంటారు.
దీంతో సమాచారం ఇచ్చిన నటీమణిపై దిలీప్ కక్ష కట్టి.. ఆమెపై దాడి చేయించాడనే కథనాలు వినిపించాయి. వీటి వెనుక పూర్వాపరాలు తేలాల్సి ఉంది. అదలా ఉంటే.. మంజూ వారియర్ పై దిలీప్ స్పందించాడు. తన మాజీ భార్యతో కలిసి నటించడానికి సిద్ధమని ప్రకటించాడు. ఆమెతో నటించడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నాడు. మరి ఈ ప్రతిపాదనపై ఆ నటీమణి ఏమంటుందో!