అమరావతి విషయంలో పచ్చ మీడియా తాపత్రయం ఎంతలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ.. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న కృత్రిమ ఉద్యమానికి పచ్చ మీడియా పెట్రోల్ పోస్తూ ఉంది. ఇరవై తొమ్మిది గ్రామాల్లో సాగుతున్న ఒక కృత్రిమ ఉద్యమం గురించి దాని స్థాయికి అనేక రెట్ల ఎక్కువ కవరేజీ ఇస్తూ, వీలైనంతగా దాన్ని ఎక్కువ చేసి చూపడానికి పచ్చ మీడియా వర్గాలు తాపత్రయ పడుతూ ఉన్నాయి.
తెలుగుదేశం పార్టీ అజెండాను అమల్లో పెట్టడమే ఆ పత్రికల దిన చర్య కాబట్టి.. ఈ కృత్రిమ ఉద్యమాన్ని హైలెట్ చేయడంలో వాటి పాత్ర గురించి ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే.. అమరావతి ఆందోళన కారుల అతి మాటలను తాము హైలెట్ చేస్తున్నట్టుగా ఈ పత్రికలు గుర్తించలేకపోతూ ఉన్నట్టున్నాయి. గుర్తించి కూడా అలా నటించేస్తూ ఉన్నాయి.
తమ ప్రాంతం ఉన్నదే రాజధాని కావడానికి అన్నట్టుగా ఉంది ఈ ఆందోళన కారుల భావన. ఇక చేతిలో యాఫిల్ ఫోన్లు, మణికట్టుకు ఐ వాచ్ లతో కనిపిస్తున్న ఆందోళనకారుల వేషధారణ.. వారిని రైతులుగా గుర్తించడానికి అవకాశం లేకుండా చేస్తోంది. రైతు అనే వాడు తన భూమిని ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోవడానికి ఇష్టపడడు. అయితే అమరావతి రైతులు మాత్రం తమ భూముల్లోనే రాజధాని ఉండాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిపై అనుచితంగా మాట్లాడటానికి కూడా వారు వెనుకాడటం లేదు. వాస్తవానికి వారు ఇప్పుడు చుట్టుమట్టాల్సింది చంద్రబాబు నాయుడి ఇంటిని. కానీ వారు జగన్ తిడుతున్నారు. దీని వల్ల ఏం సాధిస్తారో వారికే తెలియాల్సి ఉంది.
ఆ సంగతలా ఉంటే.. అమరావతి విషయంలో పచ్చమీడియా కొత్త కథనాలనూ అల్లుతోంది. అందులో భాగంగా అమరావతిలో ఇప్పటి వరకూ ప్రభుత్వం పెట్టిన ఖర్చు పది వేల కోట్ల రూపాయలు అని కథనాన్ని అల్లింది పాచిపళ్ల ఉషోదయం పత్రిక. అమరావతిలో పది వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టేశారు కాబట్టి.. ఇప్పుడు రాజధాని మారిస్తే అదంతా నష్టమే అని చెప్పడం ఈ కథనం ఉద్దేశం. మరి ఆ కథనం లోపలికి వెళితే మాత్రం అంతా డొల్ల!
పది వేల కోట్ల రూపాయలు.. హై కోర్టుకు పునాది వేశారు, రైతులకు పెన్షన్లు ఇచ్చారు.. అంటూ అందులో పేర్కొన్నారు. పది వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఎలాంటి లెక్క అందులో లేదు. అంతా గాలి లెక్క మాత్రమే! అమరావతికి సంబంధించి సీఆర్డీయే వేసిన మొత్తం బడ్జెట్ లక్ష కోట్ల రూపాయలు అని, అందులో అప్పుడే పది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసినట్టుగా గాలి కబుర్లను అందులో పేర్కొన్నారు. అయితే ఏపీ బడ్జెట్ లో అమరావతి పేరిట జరిగిన కేటాయింపులు ఏపాటివో.. తీస్తే.. పది వేల కోట్ల రూపాయలు గాలి మాటలు అనే విషయం తేలిపోతుంది.
తాత్కాలిక భవనాలకు పోనూ అమరావతి విషయంలో చంద్రబాబు సర్కారు ఐదేళ్లలో పెట్టిన ఖర్చు కూడా ఐదు వందల కోట్ల రూపాయలే అనే గణాంకాలూ ఆ మధ్యన వినిపించాయి. అయితే పచ్చ మీడియా మాత్రం పది వేల కోట్లు అంటూ కొత్త కథ అల్లుతోంది. మొత్తానికి మిగతా రాష్ట్రమంతా మట్టి గొట్టుకుపోయినా ఫర్వాలేదు, అమరావతి మాత్రం నిలబడాలి అంటూ పచ్చ వాళ్లు చూపుతున్న పైత్యం మాత్రం పతాక స్థాయికి చేరినట్టుగా ఉంది.