బోయపాటి-బాలయ్య సినిమా బాలారిష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. బాలయ్యతో ఈ సినిమాకు ముందు నిర్మాత దొరకడం కష్టమయింది. బాలయ్య మీద 70 కోట్లు పెట్టడానికి ఏ నిర్మాత ముందుకురాలేదు. ఆఖరికి బోయపాటికి మిత్రుడు అయిన మిరియాల రవీందర్ రెడ్డినే ఫిక్స్ అయ్యారు. ఆ తరువాత హీరోయిన్ ఇతరత్రా వ్యవహారాలు చూడడం ప్రారంభించారు.
ఇలాంటి టైమ్ లో రూలర్ సినిమా విడుదలయింది. డిజాస్టర్ గా మిగిలింది. నిర్మాతకు దాదాపు పది నుంచి పదిహేనుకోట్లు నష్టం వస్తుందని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాను జనం మొహమాటం లేకుండా పక్కన పెట్టినట్లు అయింది.
దీంతో బాలయ్య ఇప్పుడు రొటీన్ రొడ్డ కొట్టుడు దబిడి దిబిడి కథలు వద్దనుకుంటున్నారట. అలా అని వెంకీ మాదిరిగా ఏజ్ కు తగిన కథలు ఎంచుకునే ఆలోచన కూడాలేదు. అందుకే బోయపాటి చెప్పిన కథను అలా వుంచి, మరో ఆలోచన కూడా చేయమని బాలయ్య చెప్పినట్లు తెలుస్తోంది. ఆ కథ అలా వుంచి ఇంకేదైనా డిఫరెంట్ అయిడియా వుంటే చెప్పమని బాలయ్య కోరారని గ్యాసిప్ వినిపిస్తోంది.
నిజానికి జగపతి బాబు మాదిరిగా ఏజ్డ్ కు తగిన మాంచి ఫాదర్ క్యారెక్టర్లు బాలయ్య చేయడం మొదలుపెడితే, ఆయన ముందు ఎవరు ఆగగలరు? జనతాగ్యారేజ్ లో మోహన్ లాల్ ప్లేస్ లో బాలయ్య వుంటే దాని రేంజ్ ఎంత పెరిగేది. కానీ బాలయ్య ఎప్పటికీ హీరోనే. ఆయన అలాంటి సినిమాలే చేస్తారు అన్నది ఫ్యాన్స్ మాట. ఎన్నాళ్లో ఇలా?