హిట్ కొడితే సినిమాలు క్యూ కడతాయి. దర్శకుడు మారుతి ముందు ఇప్పటికే మూడు నాలుగు సినిమాలు వున్నాయి. మాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్, మంజుల ఘట్టమనేనికి, దిల్ రాజుకు తలో సినిమా చేయాలి. ఇలాంటి టైమ్ లో ప్రతి రోజూ పండగే సినిమా హిట్ కావడంతో మరిన్ని ఆఫర్లు వెదక్కుంటూ వస్తున్నాయి.
వీటిలో డివివి దానయ్య ఆపర్ ఒకటి. ప్రతి రోజూ పండగే సినిమా విడుదలకు ముందే దానయ్య అర్జెంట్ గా యాభై లక్షలు అడ్వాన్స్ పంపినట్లు బోగట్టా. అది తన కొడుకుతో సినిమా చేయడానికి. కానీ ఇప్పుడు దానయ్య మనసు మారినట్లు తెలుస్తోంది.
ప్రతిరోజూ పండగ హిట్ అయిన నేపథ్యంలో మాంచి హీరో ఎవర్నైనా తీసుకుని, మారుతి కాంబినేషన్ లో మంచి సినిమా చేయాలని అనుకుంటున్నారు. కొడుకుతో చేస్తే మార్కెట్ ఎలా వుంటుందో తెలియదు. అదే యంగ్ హీరో ల డేట్ లు దొరికితే, ఈ ఊపులో నలభై కోట్ల సినిమాగా మార్చేయవచ్చు. ఇప్పుడు ఈ దిశగా డిస్కషన్లు సాగుతున్నాయి.
అయితే తనకు ముందే వున్న కమిట్ మెంట్ల రీత్యా దర్శకుడు మారుతి ముందు వెనుక ఆడుతున్నారు. గతంలో ఓసారి డివివి దానయ్య – మారుతి కలిపి సినిమా చేయాల్సి వుంది. కానీ హీరో సెట్ కాక, అడ్వాన్స్ వెనక్కు ఇచ్చి, సెటిల్ మెంట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ విధంగా ఆ కాంబినేషన్ ఇప్పుడు మళ్లీ సెట్ అవుతోంది.
ఇదిలా వుంటే మారుతి కోసం సరైన హీరోని సెట్ చేసి, తరువాత ప్రాజెక్ట్ ను తన బ్యానర్ లోనే వుండేలా నిర్మాత దిల్ రాజు చూస్తున్నారని, ఆ దిశగా అప్పుడే ప్రయత్నాలు కూడా ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. మారుతి మాత్రం ఎవరైనా ముందు కథ, హీరో సెట్ కావాలంటున్నారు.