మాన్సాస్ మీద మళ్లీ… ?

విజయనగరం జిల్లాలోని పూసపాటి వారి ఆధ్వర్యాన నడుస్తున్న మాన్సాస్ ట్రస్ట్ విషయం మళ్ళీ రాజుకుంది. తనను ఆ పదవి నుంచి తప్పించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ మాన్సాస్ ట్రస్ట్  మాజీ చైర్ పర్సన్…

విజయనగరం జిల్లాలోని పూసపాటి వారి ఆధ్వర్యాన నడుస్తున్న మాన్సాస్ ట్రస్ట్ విషయం మళ్ళీ రాజుకుంది. తనను ఆ పదవి నుంచి తప్పించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ మాన్సాస్ ట్రస్ట్  మాజీ చైర్ పర్సన్ సంచయిత హైకోర్టుని ఆశ్రయించారు. ఆమె ఈ మేరకు తన బాబాయ్, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు అనుకూలంగా సింగిల్  జడ్జి ఇచ్చిన తీర్పుని సవాల్ చేశారు.

గత ఏడాది మార్చిలో సంచయితను రాష్ట్ర ప్రభుత్వం మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ గా నియమించింది. అయితే నిబంధన‌లకు విరుద్ధంగా వ్యవహరించారని అశోక్ నాడు కోర్టుకు వెళ్లారు. దీని మీద వాదోపవాదాలు జరిగిన మీదట  అశోక్ కి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. నాటి నుంచి మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా అశోక్ కొనసాగుతున్నారు. దాంతో ఈ వివాదం సద్దుమణిగింది అని అంతా భావించారు.

కానీ ఇపుడు సంచయిత కోర్టుకు వెళ్లడంతో వ్యవహరం మరోమారు తెర ముందుకు వచ్చింది. అశోక్ నియామకాన్ని సంచయిత కోర్టులో సవాల్ చేస్తున్నారు. దీన్ని స్వీకరించిన డివిజన్ బెంచ్ విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.

మరి ఈసారి న్యాయపరంగా గెలిచేందుకు సంచయితకు ఉన్న అవకాశాలు ఏంటి అన్నది చర్చగా ఉంది. ఉన్నత పదవులు మహిళలు కూడా చేపట్టవచ్చు, లింగ వివక్షకు ఆస్కారం లేదు అన్న పాయింట్ మీదనే ఆమె తనకు అనుకూలంగా న్యాయం కోరుతారు అని చెబుతున్నారు. ఏది ఏమైనా గత కొంతకాలంగా గమ్మున ఉన్న అమ్మాయి ఇపుడు ఒక్కసారిగా బాబాయ్ మీద న్యాయ సమరానికి తెర తీశారు. దీని పర్యవశానం ఎలా ఉంటుందో చూడాల్సిందే.