థియేటర్ లైసెన్స్..తప్పు అందరిదీ

తీగ లాగితే డొంక కదులుతుంది. ఆంధ్రలో యాభై శాతానికి పైగా థియేటర్లు రెన్యూవల్ చేసుకోకుండా నడిపించేస్తున్నారన్న విషయం ఇప్పుడు తనిఖీల్లో బయటపడుతోంది. ఇలా చేయడం వల్ల రెన్యూవల్ ఖర్చులు దాదాపు రెండు నుంచి అయిదు…

తీగ లాగితే డొంక కదులుతుంది. ఆంధ్రలో యాభై శాతానికి పైగా థియేటర్లు రెన్యూవల్ చేసుకోకుండా నడిపించేస్తున్నారన్న విషయం ఇప్పుడు తనిఖీల్లో బయటపడుతోంది. ఇలా చేయడం వల్ల రెన్యూవల్ ఖర్చులు దాదాపు రెండు నుంచి అయిదు లక్షలు ఎగవేస్తున్నారని బయటకు వస్తోంది. 

అయితే అధికారులు ఇన్నాళ్లూ ఎందుకు ఈ విషయంలో సైలంట్ గా వున్నారు అన్నది అది పెద్ద ప్రశ్న. రికమెండేషన్లు, పలుకుబడి, అన్నింటికి మించి నెలవారీ మామూళ్లు, కొత్త సినిమాలకు టికెట్ లు అన్నీ కలిసి ఈ విషయాన్ని మరుగున పెట్టి వుంచాయి. ఇప్పుడు సిఎమ్ జగన్ సీరియస్ కావడంతో అంతా బయటకు వస్తోంది.

ప్రతి థియేటర్ తన లైసెన్స్ ను నిర్ణీత కాలపరిమితి తరువాత రెన్యూవల్ చేయించుకోవాల్సి వుంటుంది. అలాగే ఫైర్, సేఫ్టీ లైసెన్స్ లు కూడా. ఇందుకోసం చిన్న సెంటర్లకు అయితే రెండు మూడు లక్షలు, పెద్ద సెంటర్లకు అయితే అయిదు లక్షలు, ఆపైన ఖర్చు అవుతుందని తెలుస్తోంది. 

దీన్ని ఎగవేతకు చాలా సులువైన మార్గం వుందట. తమ లైసెన్స్ రెన్యూవల్ చేయాల్సిందిగా ఓ దరఖాస్తును సంబంధిత అధికారి కార్యాలయానికి సమర్పిస్తారు. సంబంధిత సిబ్బంది దానికి స్పందించి, ఎంత కట్టాలి. ఏమిటి అన్న వివరాలతో వెనక్కు నొటీస్ ఇవ్వాలి. అప్పుడు కట్టాలి.

కానీ అక్కడే వుంది గమ్మత్తు. ఆ కార్యాలయం నుంచి ఎంతకూ నోటీస్ రాదు. ఎందుకు రాదు అంటే అర్థం చేసుకోవడమే. రాదు.  అలా రాలేదు కాబట్టి, తమ తప్పేం లేదు అన్న పాయింట్ మీద థియేటర్ నడిపిస్తుంటారు. ఎప్పుడయినా సీజ్ అయినా కోర్టుకు వెళ్లి, పాత లెటర్ చూపిస్తే, లేట్ ఫీజ్ వగైరా కట్టేసి తెరుచుకోమని ఆదేశించే అవకాశమే ఎక్కువ వుంటుంది. 

ఈ ప్రోటోకాల్ అంతా అలవాటైపోయి, ఇలా లక్షలు ఎగేస్తూ థియేటర్ ను నడిపేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వానికి ఆగ్రహం కలగడంతో అధికారులు, తమకు తెలిసిన ఈ బలహీనతను ఇప్పుడు పట్టుకుని థియేటర్లు మూస్తున్నారన్నమాట.