ఇటీవల జీ తెలుగు ఛానెల్ లో సీఎం జగన్ ని కించపరుస్తూ “అదిరింది” అనే షో లో నాగబాబు ఆధ్వర్యంలో ఓ స్కిట్ టెలికాస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సోషల్ మీడియాలో జరిగిన గొడవతో ఆ స్కిట్ వ్యవహారం మరింతగా ప్రచారంలోకి వచ్చింది.
ఆ వెంటనే సదరు నటుడు క్షమాపణ చెప్పడంతో జగన్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు కాస్త చల్లబడ్డా.. అదిరింది షో కి హోస్ట్ గా వచ్చే నాగబాబు మాత్రం ట్వీట్స్ వేస్తూ వివాదాన్ని మరింత ఎగదోసే ప్రయత్నం చేశారు.
దీంతో ఆవేశం కాస్తా నాగబాబుపైకి డైవర్ట్ అయింది. ఆటోమేటిక్ గా ఛానెల్ కూడా ఇబ్బందుల్లో పడింది. బ్యాన్ జీ తెలుగు పేరుతో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ కావడంతో జీ యాజమాన్యం నష్టనివారణ చర్యలు మొదలు పెట్టింది. సరిగ్గా ఇక్కడే యాజమాన్యానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అక్కరకొచ్చింది.
ఈ కార్యక్రమంలో భాగంగా.. ఏపీ ప్రభుత్వానికి 10 అంబులెన్స్ లు, నాలుగు వేల పీపీఈ కిట్లు అందించింది జీ తెలుగు యాజమాన్యం. అంతేకాదు.. దీనికి భారీ స్థాయిలో ప్రచారం కూడా చేసుకుంది. ఈ రాజీ కార్యక్రమానికి ఎమ్మెల్యే రోజా మధ్యవర్తిగా ఉన్నట్టు సమాచారం. అందుకే ఆమె చేతుల మీదుగానే అంబులెన్స్ ల ప్రారంభోత్సవం జరిగింది.
రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నానిని కూడా ఈ కార్యక్రమానికి పిలిచి మరింత కవరేజీ సాధించింది సదరు ఛానెల్. అలా వైసీపీతో రాజీ కుదుర్చుకోవడానికి సదరు ఛానెల్ కు ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా కలిసొచ్చింది.
నిజానికి ఈ కార్యక్రమం ఇలా రాజీ కోసం పెట్టింది కాదు. ఓవైపు వివాదం చెలరేగడం, అదే టైమ్ లో అంబులెన్సులు అందించే కార్యక్రమం ఫిక్స్ అవ్వడం అనుకోకుండా జరిగాయి. జీ తెలుగుకు అలా కలిసొచ్చిందంతే.
అయితే అంబులెన్స్ లు, పీపీఈ కిట్లు ఇచ్చినంత మాత్రాన జీ తెలుగు చేసిన తప్పు ఒప్పు అయిపోతుందా అంటే కాదనే చెప్పాలి. మరీ ముఖ్యంగా జీ తెలుగును అడ్డుపెట్టుకొని నాగబాబు లాంటి వ్యక్తులు, తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై, సీఎం జగన్ పై బురదజల్లడం అస్సలు ఆమోదయోగ్యం కాదు.
ఇప్పటికైనా జీ తెలుగు కళ్లు తెరవాలి, నాగబాబు లాంటి వ్యక్తుల్ని ప్రారంభంలోనే వదిలించుకుంటే మంచిది. లేదంటే రాబోయే రోజుల్లో ఆయన ఈ ఛానెల్ ను తన సొంతానికి వాడుకోవడానికి ఎంతకైనా దిగజారుతారు.