Advertisement

Advertisement


Home > Politics - Gossip

చంద్రబాబు-రహస్య పత్రాలు

చంద్రబాబు-రహస్య పత్రాలు

ఈ దేశపు అత్యున్నత న్యాయమూర్తికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి రాసిన ఫిర్యాదు లేఖను పక్కన పడేసిన చంద్రబాబు అండ్ తెలుగుదేశం అనుకుల మీడియా, ఆ తరువాత పోస్ట్ మార్టమ్ మాత్రం ఆపడం లేదు. 

చావు వార్త రిపోర్ట్ చేయకుండా, పోస్ట్ మార్టమ్ ల మీద పోస్ట్ మార్టమ్ లు చేస్తూ పోవడం ఈ మీడియాకు మాత్రమే చాతనయింది. ఎవ్వరేం అనుకుంటే అనుకోండి, మా పాలసీనే మాది అని డిసైడ్ అయిపోయారు. సరే దాని సంగతి పక్కన పెట్టి, ఈ పోస్ట్ మార్టమ్ లో బయటకు తీసిన పాయింట్లు చూద్దాం.

మొదటి పాయింట్. దేశపు అత్యున్నత న్యాయమూర్తికి ఫిర్యాదు చేయడం సరే, ఆయన చర్య కోసం వేచి వుండకుండా ఎందుకు బహిర్గతం చేయాలి? 

ప్రతిపక్షనేత చంద్రబాబు తరచు డిజిపి కో, ముఖ్యమంత్రికో లేఖలు రాయడం హ్యాబీగా పెట్టుకున్నారు. రాసి ఊరుకోకుండా వాటిని మీడియాకు ఎందుకు పంపిస్తున్నారు. వాటిని తమ సామాజిక మీడియాలో ఎందుకు హైలైట్ చేస్తున్నారు?

అది సరే, కొందరు న్యాయమూర్తుల మీద, కొన్ని తీర్పుల మీద రహస్యంగా లేఖ రాసి, చాపకింద నీరులా వారి మీద కుట్ర చేస్తే అది తప్పు. అలా కాకుండా ధైర్యంగా 'ఇలా ఫిర్యాదు చేసాం' అని చెబితే తప్పేమిటి? నిజానికి ఇలాంటివి అన్నీ చాపకింద నీరులా రహస్యంగా చేయడం అన్నది తెలుగుదేశం పార్టీకి దాని మూలల్లో దాగిన వారికి అలవాటు.

ఎన్టీఆర్ ను గద్దె దింపినపుడు జాతీయ మీడియా జనాలను కొందరిని హైదరాబాద్ రప్పించి, వారికి సకల సదుపాయాలు కలుగచేసి, తమకు అనుకూల పాయింట్లతో వార్తలు వండి వడ్డించేపని చేసారు. అంతే కానీ ఇలా చేస్తున్నాం అని ఎక్కడా చెప్పుకోలేదు.

ఒక పక్క విశాఖలో ఎన్టీఆర్ సభ జరగాల్సి వుంటే, అదే టైమ్ లో అక్కడే ఓ పెద్దాయినహోటల్ లో చంద్రబాబు తన బలగాలను సమీకరించి, రహస్య సమావేశాలు నిర్వహించి, ఎన్టీఆర్ పై కుట్రకు తెరతీసారు. అంతేకానీ ఇలా కుట్ర చేస్తున్నా అని ప్రకటించలేదు.  ఆ తరువాత ఎమ్మెల్యేలను వైస్రాయ్ కు తరలించినపుడు కూడా ఇలా తరలిస్తున్నా అని చెప్పలేదు. అంతెందుకు ఓటు కోనడానికి నోట్లు పంపిస్తున్నా అని మాత్రం చెప్పారా? 

చంద్రబాబుకు అన్నీ రహస్య లావాదేవీలే తప్ప, చెప్పి చేసే లేదా చేసి చెప్పే అలవాటు ఏనాడూ లేదు. అందుకే ఆయన అనుకుల మీడియాకు జగన్ చెప్పి చేస్తున్నది తప్పు అనిపిస్తోంది. చేస్తే కామ్ గా రహస్యంగా చేయాలని కానీ ఇలా రచ్చ చేస్తారా? అని జగన్ ను నిలదీసింది. ఇదంతా తొలి రోజు పోస్ట్ మార్టమ్ రిపోర్టు.

మళ్లీ మలి రోజు మరికొన్ని పాయింట్లతో మరో రిపోర్టు. చంద్రబాబు హయాంలో ఆయన రాసిన కొన్ని రహస్య లేఖలను జగన్ ఇప్పుడు బయట పెట్టారు. ఇది అన్యాయం..అక్రమం..రహస్యం అని ఓ ముఖ్యమంత్రి అన్న తరువాత ఇక ప్రజాస్వామ్యం బతికి వున్నంత కాలం అవి అలా రహస్యంగా సమాధి చేయాల్సిందే అన్నది ఈ సామాజిక మీడియా వాదన.

గతంలో కొన్ని సార్లు న్యాయస్థానాల ఆదేశాల మేరకు రహస్య పత్రాలు బయట పెట్టిన సందర్భాలు వున్నాయి. సుభాష్ చంద్రబోస్ అదృశ్యం కేసులో కొన్ని రహస్య లేఖలు బయటకు తీయాల్సి వచ్చింది. రహస్యం అని ముద్రవేసినంత మాత్రాన అవసరం అయినపుడు, అగత్యం ఏర్పడినపుడు బయటకు తీయకూడదని కాదు. ఒక ప్రభుత్వంపై మరో ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేస్తుంది. అంటే అప్పటి వరకు ఆ ప్రభుత్వం రహస్యంగా వుంచిన వివరాలు అన్నీ వెల్లడి చేయడమే కదా.

ఇప్పుడు ఈ మీడియా బాధేంటీ అంటే ఇలాంటి రహస్య లేఖలు ఇంకెన్ని వున్నాయో? ఇంకెన్ని బయటకు తీస్తారో? దాని వల్ల బాబుగారు ఇంకెంత బదనామ్ అవుతారో? లేక ఎవరైనా తమ గురించి బాబుగారి ఒపీనియన్ ఇదా అని తెలుసుకుని దూరం అవుతారో? అన్న ఆందోళన అనుకోవాలి.  సాధారణంగా ఈ కలియుగడం, ఈ ప్రజాస్వామ్య కాలంలో అజాతశతృవులు వుండరు. ప్రతి ఒక్కరికి ఎంతో కొంత మంది శతృవులు తప్పరు. 

ఎంత మనవాడు ఎత్తులో వున్నా, మరింత ఎత్తు ఎదగడానికి సిద్దంగా వున్నా, అక్కడ కూడా కొంత మంది అయినా వ్యతిరేకించేవారు వుంటారు. ఇప్పుడు ఈ లేఖల వల్ల అలాంటి వారి సంఖ్య పెరుగుతుందేమో అన్న అనుమానం. అంతే కాదు ఇంకా ఏయే విషయాల మీద ఏయే రహస్య లేఖలు రాసారొ? ఎన్ని కాన్ఫిడెన్షియల్ ముద్రపడిన జీవోలు, వ్యవహారాలు వున్నాయో, అవన్నీ ఈ ప్రభుత్వం అస్సలు మొహమాటపడకుండా ఏ సంకోచం లేకుండా బయటపెడుతుందో అన్న అనుమానం. 

ఆ భయమే ఈ పోస్ట్ మార్టం వెనుక కనిపిస్తోంది. ఇలా రహస్య పత్రాలు బయటపెడితే సంబంధిత ప్రభుత్వ సిబ్బంది ఇబ్బందుల్లో పడతారనే బెదిరింపు కనిపిస్తోంది. అంటే ఈ బెదిరింపు వెనుక వారి బెదురు ఏదో వుండే వుండాలి. 

మొత్తం మీద జబ్బు కన్నా, జబ్బును బయటకు తెచ్చిన వైనం మీద హడావుడి ఎక్కువగా వుంది. రహస్యం కన్నా రహస్యాన్ని బయటకు తీయడంపై అభ్యంతరం వ్యక్తం అవుతోంది. గుమ్మడికాయల దొంగ అని అనకుండానే భుజాలు తడుముకున్నట్లుగా వుంది వ్యవహారం. 

నిలువుటద్దం ముందు న్యాయవ్యవస్థ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?