సినిమావాళ్ల పేర్లు చెప్పి మోసాలు చేయడం సర్వసాధారణం అయిపోయింది. స్టార్స్ పేర్లు చెప్పగానే చాలామంది మోసపోతున్నారు. ఇన్నాళ్లూ వ్యక్తులు మాత్రమే ఇలా బుక్కయ్యారు. కానీ ఈసారి ఏకంగా ఓ కంపెనీనే బొక్కబోర్తాపడింది. ప్రణీత పేరు చెప్పి ఇద్దరు వ్యక్తులు లక్షలు దోచుకెళ్లారు.
మహమ్మద్ జునాయత్, వర్ష అనే ఇద్దరు వ్యక్తులు తమనుతాము హీరోయిన్ ప్రణీత మేనేజర్లుగా చెప్పుకున్నారు. నీట్ గా ఉన్నారు, ఇంగ్లిష్ మాట్లాడుతున్నారు. దీంతో ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి నమ్మాడు. బెంగళూరులోని ఓ హోటల్ లో ప్రస్తుతం ప్రణీత ఉందని, 15 లక్షల రూపాయలిస్తే.. ఆమెను రియల్ ఎస్టేట్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తామని నమ్మించారు.
ప్రణీత లాంటి హీరోయిన్ ప్రచారానికి వస్తే తన వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుందని భావించాడు ఆ బిల్డర్. వచ్చిన వ్యక్తులకు ఏకంగా 13 లక్షల 50వేల రూపాయలు సమర్పించుకున్నాడు.
అగ్రిమెంట్ పేపర్ల మీద ప్రణీతతో సంతకం పెట్టించిన తర్వాత మిగతా మొత్తం తీసుకుంటామని చెప్పి వాళ్లు ఆ 13.5 లక్షలతో జంప్ అయ్యారు. తను మోసపోయానని చాలాసేపటి తర్వాత గ్రహించిన బిల్డర్.. బెంగళూరు పోలీసుల్ని ఆశ్రయించాడు.
మొన్నటికిమొన్న గీతాఆర్ట్స్ పేరిట నకిలీ కాస్టింగ్ కౌచ్ ప్రకటన ఇచ్చాడు ఓ వ్యక్తి. మరో వ్యక్తి స్టార్ హీరో సరసన హీరోయిన్ ఛాన్స్ అంటూ మోసంచేశాడు. చివరికి సింగర్ సునీత మేనల్లుడిని అని చెప్పుకొని ఓ వ్యక్తి మోసాలకు పాల్పడ్డాడు. ఇప్పుడు తమ మోసాల కోసం ప్రణీత పేరును వాడుకున్నారు ఈ ఛీటర్స్.