చిన్న వర్షాలకే హైదరాబాద్ రోడ్లన్నీ చెరువుల్లా మారిపోతాయి. 5 రోజుల కిందట 15 సెంటిమీటర్ల వర్షం కురిసినందుకే చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ఇంకా ఆ వరద నుంచి కోలుకోకముందే భాగ్యనగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈసారి కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 25 సెంటిమీటర్లకు మించి వర్షపాతం నమోదవ్వడంతో.. లోతట్టు ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా నీటమునిగాయి.
సిటీలోని హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ (రామోజీ ఫిలింసిటీ ఉన్న ప్రాంతం), ఎల్బీ నగర్, ఆటోనగర్, ఉప్పల్ ప్రాంతాల్లో 26 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగతా అన్ని ప్రాంతాల్లో సగటున 15 సెంటీమీటర్లకు తగ్గకుండా వానలు కురిశాయి. అక్టోబర్ నెలలో హైదరాబాద్ లో ఈ స్థాయిలో వర్షం కురవడం వందేళ్లలో ఇది రెండోసారి మాత్రమే.
భారీ వర్షాలకు పాతబస్తీలో ఓ ప్రహరీ గోడ కూలి 8 మంది మృతిచెందారు. చాలా ప్రాంతాల్లో కార్లు, బైకులు కొట్టుకుపోయాయి. నగరంలో దాదాపు 60శాతం ప్రాంతాలకు కరెంట్ కట్ అయింది. ఇక హైదరాబాద్-విజయవాడ హైవే వరద నీటిలో మునిగిపోయింది. కొన్ని గంటల పాటు రాకపోకలు స్తంభించిపోయాయి. నగరంలో రోడ్లన్నీ స్విమ్మింగ్ పూల్స్ ను తలపిస్తున్నాయి.
భారీ వర్షాలకు హైదరాబాద్ లోని జలాశయాలన్నీ నిండిపోయాయి. హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్, గండిపేట రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి. హిమాయత్ సాగర్ నిండడం ఈ పదేళ్లలో ఇదే తొలిసారి.
వాయుగుండం ప్రభావం ఈరోజు కూడా ఉంటుందని ప్రకటించారు అధికారులు. సిటీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తున్నారు.