రాజ‌ధాని మున‌క మాటేమిటి?

ఎల్లో మీడియాలో ఆ ఆస‌క్తిక‌ర ఫొటో. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మాటల్లో చెప్పాలంటే ఈనాడు తోక ప‌త్రిక‌లో గూడు -గోడు శీర్షిక తో ఓ ఫొటో, దాని రైట‌ప్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాయి. తుపాను…

ఎల్లో మీడియాలో ఆ ఆస‌క్తిక‌ర ఫొటో. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మాటల్లో చెప్పాలంటే ఈనాడు తోక ప‌త్రిక‌లో గూడు -గోడు శీర్షిక తో ఓ ఫొటో, దాని రైట‌ప్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాయి. తుపాను కార‌ణంగా కోస్తాలో వ‌ర్షం బీభ‌త్సం సృష్టిస్తోంది. దీంతో ఊళ్లు స‌ముద్రాల్ని త‌ల‌పిస్తున్నాయి. దీన్ని కూడా టీడీపీ నాయ‌కులు రాజ‌కీయానికి వాడుకుంటున్నారు.

“తూర్పుగోదావ‌రి జిల్లా ఏలేశ్వ‌రం మండ‌లం య‌ర్ర‌వ‌రం గ్రామంలో 8.48 ఎక‌రాల‌ను ప్ర‌భుత్వం కొనుగోలు చేసి , 334 మందికి ఇళ్ల స్థ‌లాలు కేటాయించింది. భారీ వ‌ర్షాల‌కు ఈ స్థ‌లాల‌న్నీ ముంపున‌కు గుర‌య్యాయి. నిలువెత్తు నీరు నిలిచిన ఆ స్థ‌లాల్లో మంగ‌ళ వారం ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ నేత‌లు నిర‌స‌న తెలిపారు” అని స‌ద‌రు తోక ప‌త్రిక‌లో ఫొటో రైట‌ప్‌గా ఇచ్చారు.

జ‌గ‌న్ స‌ర్కార్ పేద‌ల‌కు ఇంటి స్థ‌లాలుగా ముంపు ప్రాంతాల‌ను ఇస్తోంద‌నే నెగెటివ్ సందేశాన్ని తీసుకెళ్ల‌డ‌మే ఆ ప‌త్రిక ఉద్దేశం అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. పేద‌ల‌కే కాదు, పెద్ద‌లకు కూడా ముంపు ప్రాంతంలో స్థ‌లాలు ఇవ్వ‌కూడ‌దు, తీసుకోకూడ‌దు. ఎందుకంటే ప్ర‌కృతి విల‌యాన్ని అడ్డుకోవ‌డం ఎవ‌రి వ‌ల్లా కాదు. ఈ నేప‌థ్యంలో టీడీపీ నాయ‌కులు మ‌రో ముఖ్య విష‌యాన్ని చాలా సౌక‌ర్య‌వంతంగా మ‌రిచిపోయారు.

అస‌లు రాజ‌ధాని ప్రాంత‌మే ముంపున‌కు గుర‌య్యే ఏరియా అని టీడీపీ నాయ‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాలా?  తాజా వ‌ర్షాల‌కు రాజ‌ధాని ప్రాంతం నీటిలో మునిగిపోవ‌డం వాళ్ల‌కు క‌నిపించ‌లేదా? రాజ‌ధానిలో హైకోర్టుకు వెళ్లే ర‌హ‌దారి నీట మునగ‌డం టీడీపీ నేత‌ల‌కు క‌నిపించ‌లేదా అనే ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్నాయి. రాయ‌పూడి సీడ్ యాక్సిస్ రోడ్డు నుంచి హైకోర్టుకు వెళ్లే ప్ర‌ధాన ర‌హ‌దారిపై కిలోమీట‌ర్ మేర వ‌ర్ష‌పు నీరు ప్ర‌వ‌హిస్తుండ‌డాన్ని చాన‌ళ్ల‌లో రాష్ట్ర ప్ర‌జ‌లంతా చూస్తున్నారు.

అంతెందుకు త‌మ అధినేత చంద్ర‌బాబునాయుడు ఉంటున్న ఇల్లు ముంపు ప్రాంతానికి చెందిన‌ది కాదా?  భారీ వ‌ర్షాల‌కు కృష్ణా న‌ది ఉధృతంగా ప్ర‌వ‌హిస్తుండ‌డంతో ప్ర‌కాశం బ్యారేజీకి వ‌ర‌ద పోటెత్తింది.

దీంతో కృష్ణా న‌ది క‌ర‌క‌ట్ట లోప‌ల ఉన్న 36 అక్ర‌మ క‌ట్ట‌డాల‌కు వ‌ర‌ద ప్ర‌మాద హెచ్చ‌రిక నోటీసులను రెవెన్యూ అధికారులు జారీ చేసిన విష‌యం తెలిసిందే. క‌ర‌క‌ట్ట లోప‌ల ఉన్న భ‌వ‌నాల‌కు ఖాళీ చేసి సుర‌క్షిత ప్రాంతాల‌కు వెళ్లాల‌ని జారీ చేసిన నోటీసుల‌ను అందుకున్న వారిలో చంద్ర‌బాబు కూడా ఉన్నారు క‌దా!

గ‌త ఐదేళ్ల‌లో టీడీపీ పాల‌న‌లో పేద‌ల‌కు ఇంటి స్థ‌లాలు ఇవ్వ‌క‌పోగా , ఇప్పుడు అడ్డుకోవ‌డం ఆ పార్టీకే చెల్లింది, ఏకంగా రాజ‌ధాని ప్రాంతాన్నే ముంపు ప్రాంతంలో చేప‌ట్టి రాష్ట్రాన్నే ముంచిన ఘ‌న‌త టీడీపీ పాల‌న‌కే ద‌క్కుతుంది.

నిలువుటద్దం ముందు న్యాయవ్యవస్థ