మహాభారత కురుక్షేత్రంలో శత్రువులను తుద ముట్టించేందుకు ప్రత్యర్థులు నాగాస్త్రం, బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం …ఇలా అనేక ఆయుధాలను ప్రయోగించడం గురించి విన్నాం. ముఖ్యమంత్రి జగన్‌పై దాడికి ఈనాడు న్యాయాస్త్రాన్ని ప్రయోగిస్తోంది. తాజాగా నేటితో ఆ పనికి శ్రీకారం చుట్టింది.
ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై దాడికి రామోజీ నేతృత్వంలోని ఈనాడు పత్రిక తెలంగాణ నుంచి న్యాయ నిపుణులను రంగంలోకి దింపింది. సుప్రీంకోర్టు జడ్జితో పాటు హైకోర్టు న్యాయమూర్తులపై ఏపీ సర్కార్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయడాన్ని ఎల్లో మీడియా జీర్ణించుకోలేక పోతోంది.
ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిపైన, కొందరు హైకోర్టు న్యాయమూర్తులపైనా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసిన సమాచారానికి సంబంధించి ఒక్క వాక్యం కూడా రాయని ఈనాడు …దాన్ని కౌంటర్ చేయడానికి మాత్రం తహతహలాడుతోంది.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు ఏపీ ప్రభుత్వ లేఖపై స్పందించేందుకు తెలంగాణ మాజీ అడ్వకేట్ జనరల్ కె.రామకృష్ణా రెడ్డిని వెతికి పట్టుకోవాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పరిణామాలపై మాట్లాడేందుకు, న్యాయ సంబంధ విషయాలు తెలిసిన సంబంధిత నిపుణులెవరూ బహుశా ఈనాడు దృష్టిలో ఎవరూ లేనట్టున్నారు.
జడ్జీలపై జగన్ సర్కార్ ఫిర్యాదు చేయడం ద్వారా న్యాయవ్యవస్థ స్వతంత్రతకే ముప్పు ఏర్పడుతుందని రామకృష్ణారెడ్డి ద్వారా రామోజీ తన వాయిస్‌ను వినిపించారు. ఈనాడుకు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రామకృష్ణారెడ్డి ఏమన్నారో తెలుసుకుందాం.
“ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిపైన, కొందరు హైకోర్టు న్యాయమూర్తులపైనా తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు , విశ్రాంత ఐఏఎస్ అధికారి అజేయ కల్లం విలేకరుల సమావేశం పెట్టడం అనుచితం. ఇది కచ్చితంగా కోర్టు ధిక్కారం కిందకు వస్తుంది.
రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తుల వ్యక్తిగత ప్రవర్త నపై పార్లమెంటు లేదా శాసనసభలో సైతం చర్చించడానికి వీలులేదు. నా దృష్టిలో న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసే ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు తనంతట తానుగా తీసుకుని విచారించి తగు చర్యలు తీసుకోవాలి” అని రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.
జగన్‌ను భయపెట్టి, బెదిరించి లొంగదీసుకునేందుకు రామోజీ ఎంతగా ప్రయత్నిస్తున్నారో గత కొంత కాలంగా తన విషపుత్రికలో ప్రచురిస్తున్న వార్తలు ప్రతిబింబిస్తున్నాయనే అభిప్రాయాలు లేకపోలేదు. జగన్ ఏం చేసినా ఎల్లో మీడియాకు తప్పుగానే కనిపిస్తుంది. మూడు రాజధానుల ఏర్పాటు అంటే… అది చట్టం అనుమతించిదని ఊరు పేరు లేని న్యాయనిపుణులు చెప్పారని ఓ కథనం వండి వార్చడం గురించి తెలిసిందే.
ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు రాసిన లేఖపై కౌంటర్లు ఇవ్వడం తమ సామాజిక బాధ్యత అని ఈనాడు, రామోజీ భావిస్తు న్నారు. అసలు వార్తను విస్మరించి, కొసరు ఇంటర్వ్యూలకు ప్రాధాన్యం ఇవ్వడం ఈనాడుకే చెల్లింది.
తాజా ఇంటర్వ్యూలో రామకృష్ణారెడ్డి ఇంకా ఏమన్నారంటే… “ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను కోర్టులు సమీక్షించాల్సిందే. తప్పులుంటే చక్కదిద్దాల్సిందే. లేకపోతే నియంతృత్వానికి దారి తీస్తుంది. సామాన్యుడికి న్యాయం దక్కదు” అని ఆయన వాపోయారు.
తప్పులు ఎవరు చేసినా తప్పులేనా? కాదా? ముందు ఈ విషయమై రామకృష్ణారెడ్డి, ఈనాడు స్పష్టత ఇవ్వాలి. ఈనాడు, రామకృష్ణారెడ్డి చెబుతున్న వ్యవస్థలేమైనా ఆకాశం నుంచి దిగి వచ్చాయా? అక్కడి వారు మనుషులు కాదా? తప్పులకు అతీతులా? ఒక్క జగన్‌మోహన్‌రెడ్డిని భయపెట్టడానికి ఎన్ని రకాల కుట్రలు, కుయుక్తులు? ఇదేనా పాత్రికేయ ధర్మం?