ఇప్పటికే తన అభిమానగణాన్ని క్రమంగా కోల్పోతూ వస్తున్నాడు మహేంద్రసింగ్ ధోనీ. ఏనాడో తన అదరగొట్టే తన ఆట స్థాయిని కోల్పోయిన ఈ క్రికెటర్ గత ప్రపంచకప్ లో ఆడిన తీరుతోనే అభిమానులను విసిగించాడు.
కీలకమైన సమయంలో టెస్టు మ్యాచ్ తరహా డిఫెన్స్ ధోరణితో ఆడి ధోనీ విమర్శలను ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత జాతీయ జట్టుకు ధోనీ దూరం అయ్యాడు. కొంతమంది విశ్లేషకులు.. ధోనీ లేకపోతే ఇండియన్ క్రికెట్టే లేదన్నట్టుగా ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటారు. అయితే ధోనీ ఆట తీరేమిటో ఇప్పుడు ఐపీఎల్ లో చెన్నై జట్టు ప్రదర్శనను చూస్తే అర్థం అవుతుంది.
ఇప్పుడు ఆట గురించి గాక.. మైదానంలో ధోనీ వ్యవహరణ శైలి కూడా చర్చనీయాంశం అవుతోంది. మంగళవారం రోజున సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చెన్నైసూపర్ కింగ్స్ మ్యాచ్ ముగుస్తున్న దశలో అంపైర్ ను ఆల్మోస్ట్ బెదిరించినంత పని చేశాడు ధోనీ.
తన బౌలర్ వేసిన వైడ్ బాల్ ను వైడ్ గా ప్రకటించోయిన అంపైర్ పై ధోనీ అసహనం వ్యక్తం చేశాడు. వైడ్ ఇవ్వబోతున్న ఆయన ధోనీ తీరు చూసి వెనక్కు తగ్గడంటే ధోనీ గారి బెదిరింపు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు!
భారీ షాట్లతో విరుచుకుపడుతున్న రషీద్ ఖాన్ కు బంతిని దూరంగా వేస్తూ వచ్చాడు శార్దూల్ ఠాకూర్. అప్పటికే ఒక బంతి బ్యాట్స్ మన్ కు అందకుండా వేశాడు. దాన్ని వైడ్ గా ప్రకటించాడు అంపైర్. ఆ తర్వాతి బంతి మరింత దూరంగా వేశాడు. దాన్ని వెంటాడే ప్రయత్నం చేశాడు రషీద్ ఖాన్. అయిన అందలేదు.
అది క్లియర్ గా వైడ్. దీంతో అంపైర్ మళ్లీ వైడ్ సిగ్నల్ ఇవ్వబోయాడు. కీపర్ గా ఉన్న ధోనీ వెంటనే రియాక్ట్ అయిపోయాడు. అది వైడ్ కాదంటూ అరుస్తూ, తన చేతులు చాపి అసహనంగా రియాక్ట్ అయ్యాడు. అది క్లియర్ గా వైడ్. అయినా ధోనీ అసహనానికి ఆ విదేశీ అంపైర్ కూడా భయపడ్డాడు. వైడ్ సిగ్నల్ ఇవ్వబోయి, ఆగాడు!
కెరీర్ ఆఖరి దశల్లో ఇలా వ్యవహరిస్తూ ఉండటం చాలా చీప్ గా ఉంది. అంపైర్ నిర్ణయాలను కూడా ప్రభావితం చేసే రీతిలో బాహాటంగా అసహనం వ్యక్తం చేస్తూ.. ధోనీ ఏ కీర్తి కిరీటాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నాడో!