ఉత్తర కొరియా అధినేత కిమ్‌జాంగ్ ఉన్ భయంకరమైన నియంత అని మీడియా రకరకాల కథనాలు రాసింది. కిమ్‌జాంగ్ నియంతృత్వం గురించి చానళ్లు ఎన్నెన్నో చెప్పాయి. కానీ తాజాగా ఆయనలోని రెండో కోణం చూసిన వాళ్లకు, ఇంత కాలం విన్న దానికి ఎక్కడా పొంతన కుదరడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిమ్ జాంగ్ కంట కన్నీళ్లా? ఇదే ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
ఇదే సందర్భంలో కిమ్‌జాంగ్ ఉన్ సంస్కారాన్ని, ఆంధ్రా నియంత చంద్రబాబుతో పోల్చుతూ సోషల్ మీడియాలో నెటిజన్లు తమ సృజనకు పదును పెట్టారు. ప్రపంచమంతా నియంతగా చెప్పుకునే కిమ్‌జాంగ్ ఉన్ తమ నియంత చంద్రబాబుతో పోల్చుకుంటే ఎంత అంటూ సెటైర్లు విసురుతున్నారు. ఇందుకు నెటిజన్లు చెబుతున్న లాజిక్ కూడా సహేతుకంగానే కనిపిస్తోంది.
కిమ్ కన్నీళ్లు పెట్టుకుంటూ జాతిని క్షమాపణ కోరుతూ తాజాగా ఓ వీడియో ఆ దేశ మీడియా ద్వారా విడుదల చేశారు. ఆ వీడియోలో ఆయన ఏమన్నారంటే…
‘ప్రజలు నా మీద ఆకాశమంత నమ్మకాన్ని ఉంచారు. కానీ నేను వారికి సంతృప్తి కలిగించలేక పోయాను. కరోనా వైరస్‌పై పోరాటం, అంతర్జాతీయంగా ఎదుర్కొన్న ఆంక్షలు, దేశాన్ని ముంచెత్తిన తుపాన్ల కారణంగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో విఫలమయ్యాను. నేనిచ్చిన హామీలను నెరవేర్చలేకపోయాను’ అంటూ జాతి యావత్తూ క్షమించాలని కిమ్ వేడుకున్నారు.
ఇదే మన చంద్రబాబు విషయానికి వస్తే ఎలా వ్యవహరించారో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. రాష్ట్ర విభజన తర్వాత 2014లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. విభజిత రాష్ట్రానికి పాలనానుభవం ఉన్న చంద్రబాబును ఎన్నుకుంటే ఏపీని గట్టెక్కిస్తారని అందరూ నమ్మారు.
సుమారు 600 పైచిలుకు హామీలతో ప్రజల్ని నమ్మించారు. జాబు రావాలంటే బాబు రావాలి, బ్యాంకుల్లోని బంగారు ఇళ్లకు చేరాలంటే బాబు రావాలి, రైతుల రుణమాఫీ కావాలంటే బాబు రావాలి, నిరుద్యోగ భృతి దక్కాలంటే బాబు రావాలి , ఇంటికో ఉద్యోగం కావాలంటే బాబు రావాలి…. ఇలా అనేక రకాల హామీలతో చంద్రబాబు మాత్రం అధికారాన్ని దక్కించుకున్నారు.
కానీ చివరికి బ్యాంకుల నుంచి బంగారు ఇంటికి రాలేదు, రైతుల రుణమాఫీ కాలేదు, ఇక ఇంటికో ఉద్యోగం మాటేమో గానీ, ఆయన కొడుక్కి మాత్రం మంత్రి పదవి జాబు దొరికింది. ఎన్నికలకు నాలుగు నెలల ముందు నుంచి నిరుద్యోగ భృతి అందించి హామీ అమలు చేసిన కలరింగ్ ఇచ్చుకున్నారు.
దీంతో 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు జనం తగిన విధంగా వాత పెట్టారు. ఇంత ఘోరంగా ఓడించేంత తప్పు తానేం చేశానని చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతే తప్ప ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశానని, హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాననే పశ్చాత్తాపం ఈ రోజుకు కనిపించలేదు.
కానీ ప్రపంచమంతా నియంతగా చెప్పుకుంటున్న ఉత్తర కొరియా అధినేత కిమ్‌జాంగ్ ఉన్ మాత్రం తాను ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. ప్రజలు ఎదుర్కొన్న సమస్యల నుంచి గట్టెక్కడానికి వారిని దిశా నిర్దేశం చేయడంలో తాను పూర్తిగా విఫలమయ్యాయని, తన చిత్తశుద్ధితో చేసిన కృషి సరిపోలేదని వివరణ ఇచ్చుకున్నారు.
నియంతల విషయంలో సంస్కారం గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. కానీ ఉత్తర కొరియా అధినేత కిమ్‌జాంగ్ నియంతృత్వం గురించి ఘోరంగా విన్న ప్రజానీకానికి, ఇప్పుడు ఆయన కంట కన్నీరు చూసి …ఈయనలో ఇంత సంస్కారం ఎక్కడిది? అనే ప్రశ్న వినిపిస్తోంది. ఇదే సమయంలో హామీలను నెరవేర్చడంతో తాను విఫలమయ్యానని జనానికి నిజాయతీగా చెప్పడం ప్రశంసలు అందుకుంటోంది.
ఇదే మన చంద్రబాబు విషయానికి వస్తే …తనను ఓడించి ప్రజలే తప్పు చేశారని ఆ మధ్య చెప్పడం చూశాం. తన ఘోర పరాజయానికి ఆయన భావోద్వేగానికి లోనై కన్నీళ్లు కార్చారే తప్ప, ప్రజల అంచనాలకు తగ్గట్టు పాలన సాగించలేదనే పశ్చాత్తాపం ఆయనలో మచ్చుకైనా కనిపించకపోవడం ఆశ్చర్యం.
ఏపీ నియంత గురించి మాత్రం ఎల్లో మీడియా ఆహా, ఓహా అంటూ గొప్పలు చెప్పడం విడ్డూరం. ఇంతకూ వీళ్లిద్దరిలో సంస్కార నియంతెవరో ఎవరికి వాళ్లు నిర్ణయించుకోవాల్సిందే.