వాయుగుండం తీరం దాటినా.. గండం పొంచే ఉంది

వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు చిగురుటాకుల్లా వణికాయి. ఆంధ్రప్రదేశ్ లో కోస్తా జిల్లాలు మొత్తం వాయుగుండం ప్రభావంతో బిక్కుబిక్కుమంటున్నాయి. ఉత్తరాంధ్రపై మాత్రమే ఈ ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేసినా, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు,…

వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు చిగురుటాకుల్లా వణికాయి. ఆంధ్రప్రదేశ్ లో కోస్తా జిల్లాలు మొత్తం వాయుగుండం ప్రభావంతో బిక్కుబిక్కుమంటున్నాయి. ఉత్తరాంధ్రపై మాత్రమే ఈ ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేసినా, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు కూడా ముప్పు బారిన పడ్డాయి. 

రికార్డ్ స్థాయిలో వర్షపాతం..

ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ఉభయగోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల 20 సెం.మీ.కు పైగా వర్షపాతం నమోదైంది. కృష్ణా, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 10 సెం.మీ. నుంచి 20 సెం.మీ. వరకు వానలు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 146 మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. 

వాయుగుండం తీరం దాటినా.. గండం మాత్రం పొంచే ఉందని, మరో రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

నిండుకుండల్లా రిజర్వాయర్లు..

శ్రీశైలం, సాగర్ సహా.. రాష్ట్రంలోని జలాశయాలన్నీ నిండుకుండల్లా మారాయి. పులిచింతలకు 3.28లక్షల క్యూసెక్కుల వరద రావడంతో పది గేట్లు ఎత్తివేసి నీటిని కిందకు వదులుతున్నారు. అన్నవరంలో పంపా రిజర్వాయర్, ఏలేశ్వరంలోని ఏలేరు ప్రాజెక్ట్, విశాఖ జిల్లా తాండవ రిజర్వాయర్ కు పూర్తి స్థాయిలో నీరు చేరడంతో.. కిందకు వదులుతున్నారు. విశాఖలో వరాహ, సర్పా, తాండవ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. 

పశ్చిమగోదావరిలో ఎర్రకాల్వ, జల్లేరు, తమ్మిలేరు, బైనేరు, సుద్దవాగుల ప్రవాహం మునుపెన్నడూ లేనంతగా ఉందని స్థానికులు చెబుతున్నారు.

అపార నష్టం.. అన్నదాతకు కష్టం

ఏపీలో భారీ వర్షాలకు లక్షన్నర ఎకరాల్లో పంట నీటమునిగినట్టు ప్రాథమిక సమాచారం. వాయుగుండం తీరం దాటిన తర్వాత వర్షాలు మరింత పెరిగాయి. గంటకు 75కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో పలుచోట్ల ఇళ్లుకూలి ప్రాణ నష్టం జరిగింది. వర్షాలకు ఇప్పటి వరకు నలుగురు ప్రాణాలు విడిచారు, మరో నలుగురు వరద నీటిలో గల్లంతయ్యారు. 

రైతన్నలను ఆదుకునేందుకు యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఏపీలో వరిధాన్యం సేకరించడం ద్వారా రైతులు కాస్త తెరపిన పడ్డారు. వాణిజ్యపంటలపై కూడా ప్రభావం ఎక్కువగా ఉంది.

కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ లు, రహదార్లు..

పశ్చిమగోదావరి జిల్లాలో రైల్వే ట్రాక్ లు కొట్టుకుపోయాయి. నిడదవోలు స్టేషన్లో నాలుగు అడుగుల మేర నీరు నిలిచి ఉంది. విశాఖలో రైల్వే ట్రాక్ లపై కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో మంగళవారం రాత్రి వరకు పలుచోట్ల రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు రహదారులు కూడా వర్షాలకు కొట్టుకుపోయాయి. పశ్చిమగోదావరి జిల్లాలో పలుచోట్ల నేషనల్ హైవేకు గండ్లు పడ్డాయి. 

గుంటూరు జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లడంతో సత్తెనపల్లి-పిడుగురాళ్ల సహా పలు ముఖ్య ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కృష్ణాజిల్లాలోని నందిగామ, కంచికచర్ల ప్రాంతాల్లో హైవేలు సైతం కాల్వల్ని తలపించాయి. విజయనగరం జిల్లాలో పలు ప్రాంతాల మధ్య సంబంధాలు తెగిపోయాయి.

పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం..

భారీ వర్షాలకు వెంటనే అప్రమత్తమైన అధికార యంత్రాంగం ముంపు ప్రాంతాల బాధితుల్ని వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించింది. తూర్పుగోదావరిలో హోప్ ఐలాండ్ నుంచి 70 కుటుంబాలు, కాకినాడ లోతట్టు ప్రాంతాలనుంచి 230 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు.

కృష్ణా, విశాఖ లో కూడా పునరావాస కేంద్రాలకు ప్రజల్ని తరలిస్తున్నారు. విశాఖలో 3700మందిని, తూర్పుగోదావరి జిల్లాల్లో 978మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.

నిలువుటద్దం ముందు న్యాయవ్యవస్థ