ధ‌ర్మం త‌ప్పిన ఆర్‌కే!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంటే అమ‌రావ‌తి. అమ‌రావ‌తి అంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌. రాజ‌ధాని అంటే అమ‌రావ‌తి. అభివృద్ధి అంటే అమ‌రావ‌తి. అమ‌రావ‌తిలోనే అసెంబ్లీ, స‌చివాల‌యం, హైకోర్టు అన్నీ పెట్టాలి, అన్నీ ఉండాలి. ఎందుకూ అని ఎవ‌రూ అడ‌గ‌కూడ‌దు. ఎందుకంటే…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంటే అమ‌రావ‌తి. అమ‌రావ‌తి అంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌. రాజ‌ధాని అంటే అమ‌రావ‌తి. అభివృద్ధి అంటే అమ‌రావ‌తి. అమ‌రావ‌తిలోనే అసెంబ్లీ, స‌చివాల‌యం, హైకోర్టు అన్నీ పెట్టాలి, అన్నీ ఉండాలి. ఎందుకూ అని ఎవ‌రూ అడ‌గ‌కూడ‌దు. ఎందుకంటే అమ‌రావ‌తిలోనే అన్నీ ఉండ‌డం ధ‌ర్మం. ఆ ప్రాంతం చంద్ర‌బాబు, రాధాకృష్ణ లాంటి ధ‌ర్మ‌ప్ర‌భువుల సామాజిక వ‌ర్గీయ సంప‌న్నులు న‌డియాడుతున్న నేల‌. ఇదీ మ‌న ఆర్‌కే గారి ఈ వారం ‘కొత్త‌ప‌లుకు’

‘తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చును గానీ.. మూర్ఖుల మనస్సు రంజింపజేయరాదు’ అన్నాడో కవి అంటూ ‘ధ‌ర్మం త‌ప్పిన రాజు!’ శీర్షిక‌తో రాసిన ‘కొత్త‌ప‌లుకు’  ప్రారంభ వాక్యం త‌న గురించి రాధాకృష్ణ ఎంత బాగా అభివ‌ర్ణించుకున్నాడో. ఈ వారం కొత్త‌ప‌లుకులో ప్ర‌తి వారం ఉన్న‌ట్టే జ‌గ‌న్‌పై అక్ష‌ర దాడి, అమ‌రావ‌తి మిన‌హా మిగిలిన ప్రాంతాల‌పై చిన్న‌చూపు, కులం కంపు…ఎంత అధ‌ర్మంగా ఆయ‌న ‘ప‌లుకు’లున్నాయో చ‌ర్చిద్దాం.

‘సచివాలయాన్ని, అసెంబ్లీని ఏర్పాటు చేసినంత మాత్రాన విశాఖ అభివృద్ధి జరిగిపోతుందా? మూడు రాజధానులు అని చెబుతున్నవారు ఒక్క రాజధానిని కూడా నిర్మించే పరిస్థితిలో ఉన్నారా? అంటే సందేహమే!’

మీ మాట ప్ర‌కార‌మే స‌చివాలయాన్ని, అసెంబ్లీని త‌ర‌లించినంత మాత్రాన అమ‌రావ‌తి అభివృద్ధి ఆగిపోతుందా ఆర్‌కే గారూ. విశాఖ‌లో ఎలాంటి ఖ‌ర్చు చేయ‌న‌వ‌స‌రం లేద‌నే క‌దా జ‌గ‌న్ స‌ర్కార్ వాద‌న‌. ఇంకా కొత్త‌గా నిర్మించేది ఏముంటుంది?

‘‘అధికారంలో ఉన్నవారు రాజధర్మాన్ని పాటించాలే గానీ ఏదో ఒక సామాజికవర్గంపై కోపంతో రాజధానినే తరలించాలను కోవడం అవివేకమే అవుతుంది. అమరావతిని అభివృద్ధి చేస్తే కమ్మ సామాజికవర్గం వారు ఆర్థికంగా లాభపడతారు. అయినా వాళ్లు మన పార్టీకి మద్దతు ఇవ్వరు. తెలుగుదేశం పార్టీతోనే ఉంటారు. అలాంటప్పుడు విశాఖకు తరలిపోతే అక్కడ మన పార్టీ మరింత బలపడుతుంది. కృష్ణా–గుంటూరు జిల్లాలలో నష్టం జరిగితే ఉత్తరాంధ్రలో భర్తీ చేసుకోవచ్చు’’ అని జగన్మోహన్‌రెడ్డి తన సన్నిహితుల వద్ద ఇది వరకే స్పష్టం చేశారట.

అయ్యా జ‌గ‌న్‌కు ముందు రాష్ట్రాన్ని పాలించిన చంద్ర‌బాబు ఏనాడైనా రాజ‌ధ‌ర్మాన్ని పాటించారా? ఇప్పుడు జ‌గ‌న్‌కు చెప్పిన‌ట్టు గ‌తంలో ఏనాడైనా మీరు రాజ‌ధ‌ర్మాన్ని పాటించాల‌ని బాబుకు హిత‌బోధ చేశారా? ఏ సామాజిక వ‌ర్గంపై కోపంతో శ్రీ‌బాగ్ ఒప్పందాన్ని కాద‌ని రాయ‌ల‌సీమ‌లో కాకుండా అమ‌రావ‌తిలో రాజ‌ధాని పెట్టారో చెప్పండి. రాయ‌ల‌సీమ‌ను అభివృద్ధి చేస్తే రెడ్డి సామాజిక‌వ‌ర్గంతో పాటు మైనార్టీ లు ఆర్థికంగా బ‌ల‌ప‌డుతార‌నే కుట్ర‌తోనే క‌దా చంద్ర‌బాబు పాల‌న‌లో ఏనాడూ క‌రవు ప్రాంత‌ సాగునీటి ప్రాజెక్టుల‌పై శ్ర‌ద్ధ చూప‌లేద‌న్న‌ది వాస్త‌వం కాదా? త‌న సామాజిక‌వ‌ర్గం ఎటూ కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల‌, అక్క‌డ మాత్ర‌మే అభివృద్ధి కేంద్రీక‌రించ‌డం రాజ‌ధ‌ర్మ‌మ‌ని అనిపిస్తోందా?  

‘‘నిన్నటి వరకు ఆకాశమే హద్దుగా భూముల ధరలు పెరగడంతో ఆడపిల్లల పెళ్లిళ్ల సందర్భంగా కట్నం కింద రెండు కోట్లు ఇస్తామన్న వాళ్లు.. ఆ మేరకు ధర పలుకుతున్నందున ఎకరం భూమి ఇచ్చారు. ఇప్పుడు అక్కడ ధరలు పడిపోవడంతో మీ భూమి వద్దు.. ఇస్తామన్న రెండు కోట్లు ఇవ్వండి అని కొందరు అల్లుళ్ల నుంచి ఒత్తిడి వస్తోందని ఆడపిల్లల కుటుంబీకులు వాపోతున్నారు. గడపదాటి బయటకురాని మహిళలు కూడా రోడ్ల మీదకు వచ్చి తమకు అన్యాయం చేయవద్దని కన్నీటితో వేడుకోవడం జగన్మోహన్‌రెడ్డికి కూడా శోభనివ్వదు’’ అని  జ‌గ‌న్‌ను ఆర్‌కే హెచ్చ‌రించాడు.

నిన్న‌టి వ‌ర‌కు ఆకాశ‌మే హ‌ద్దుగా అమ‌రావ‌తి ప్రాంత భూముల ధ‌ర‌లు ఎందుకు పెరిగాయి? ఏం మిగిలిన ప్రాంతాల భూములు భూములు కాదా? అక్క‌డి వారు మ‌నుషులు కాదా? ఆ ప్రాంతాల్లో బ‌తికే రైతులు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబీకులు త‌మ భూముల‌కు ధ‌ర‌లు పెర‌గాల‌ని కోరుకోకూడ‌దా?  రాజ‌ధాని మిన‌హా మిగిలిన ప్రాంతాల వారు త‌మ ఆడ‌పిల్ల‌ల‌కు కోట్లాది రూపాయ‌లు క‌ట్నంగా ఇచ్చి మంచి మంచి సంబంధాలు కుదుర్చుకోకూడ‌దా? ఏనాడైనా క‌ర‌వుతో అల్లాడుతున్న ఆడ‌బిడ్డ‌ల శోకం గురించి మీ అక్ష‌రాలు శోకించాయా గురువు గారూ?

ఉన్న ఊరును, క‌న్న‌వారిని కాద‌ని క‌డుపు నింపుకునేందుకు గ‌ల్ఫ్ దేశాల‌కు వ‌ల‌స వెళుతున్న వారి ఆక్రంధ‌న మీకు ఏనాడైనా వినిపించిందా? ముంబ‌య్‌, పూణే లాంటి రెడ్‌లైట్ ఏరియాల‌కు రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర ప్రాంతాల యువ‌తులు వెళుతుండ‌డం మీ కంటికి క‌నిపించ‌లేదా? ఎందుకు ఒక ప్రాంతంపై, అది కూడా సొంత కులంపైన్నే మీ మ‌మ‌కారం? ఇత‌ర సామాజిక‌వ‌ర్గాల‌పై అంత ఓర్వ‌లేని త‌నం. ఇది న్యాయ‌మా? ధ‌ర్మ‌మా సార్‌?

కేవలం ఒక్క సామాజికవర్గంపై కోపంతోనే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారన్నది నిర్వివాదాంశమ‌ని ఆర్‌కే వాదిస్తున్నాడు. అంటే రాజ‌ధాని కేవ‌లం త‌న సామాజిక‌వ‌ర్గం సొంత‌మ‌ని ఆయ‌న చెప్ప‌ద‌ల‌చుకున్నాడా?

‘‘ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, అధికారంలో ఉన్నవారు చేస్తున్న ప్రకటనలు గమనిస్తే.. ‘అదొక నాగరిక సమాజమా? అక్కడ అసలు మేధావులు, విజ్ఞులు లేనే లేరా?’ అన్న సందేహం కలుగుతోంది’’ అని ఆర్‌కే చాలా బాధ‌ప‌డుతూ క‌న్నీటి ప‌లుకులు ప‌లికాడు.

అయ్యా మీరు దిగులుతో అన్న‌పానీయాలు తీసుకోవ‌డం మాన‌కండి. నిద్ర‌పోవ‌డం మ‌రిచిపోకండి. మేధావులు, విజ్ఞుల అవ‌స‌రం ఏర్ప‌డితే మిమ్మ‌ల్ని జ‌గ‌న్ స‌ర్కార్ నిర‌భ్యంత‌రంగా పిలుచుకుంటుంది. ఏ నాగ‌రిక స‌మాజం గురించి ప్ర‌స్తావించారో కాస్త వివ‌రంగా వ‌చ్చే వారం కొత్త‌గా ప‌ల‌కండి. అమ‌రావ‌తి స‌మ‌స్య‌, రాష్ట్ర స‌మ‌స్య కాద‌ని గుర్తించుకోండి. అందుకే మిగిలిన ప్ర‌జ‌లు చీకూచింతా లేకుండా జీవ‌నం సాగిస్తున్నారు. మ‌రి మీరే ఎందుకు అంత‌గా త‌ల్ల‌డిల్లుతున్నారో అర్థం కావ‌డం లేదు.  

‘‘నిజానికి రాజధానిని విశాఖకు తరలించాలన్న నిర్ణయంపై రాయలసీమ ప్రజలు కూడా ఆగ్రహంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. కర్నూలు వాసుల కోరిక మేరకు అక్కడ హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తే సరి పోయేది. రాజధాని అయినా ఇవ్వండి లేదా ప్రత్యేక రాష్ట్రమైనా ఇవ్వండి’’ అని రాయలసీమకు చెందిన ప్రముఖుల నుంచి ఇప్పటికే డిమాండ్‌ మొదలైందని రాసిన మాట‌లో నిజం ఉంది.

అయితే విశాఖ‌కు కాదు…అమ‌రావ‌తిలో రాజ‌ధాని పెట్టేట‌ప్పుడే ఈ ర‌క‌మైన డిమాండ్ రాయ‌ల‌సీమ స‌మాజం వినిపించింది. అయితే వినిపించుకునే పాల‌కులే లేరు. ఇప్పుడు అమ‌రావ‌తి గురించి పేజీల‌కు పేజీలు కేటాయించి రాసేందుకు ఆంధ్ర‌జ్యోతి, ఈనాడు ఎండీల సామాజిక‌వ‌ర్గ ప్ర‌జ‌లు అక్క‌డ మైనార్టీలు. అందుకే వాళ్ల ప్ర‌యోజ‌నాలు వీరికి అన‌వ‌స‌రం. శ్రీ‌బాగ్ ఒప్పందం మేర‌కు సీమ‌లో రాజ‌ధాని లేదా హైకోర్టు ఏర్పాటు చేయాల‌ని బ‌ల‌మైన కాంక్ష ఉంది. రాధాకృష్ణ సార్ మీరు చెబుతున్న‌ట్టు ఏదో హైకోర్టు బెంచ్ ఇస్తే స‌రిపోయేదంటే…ఆ ప్రాంత‌వాసులేమైనా భిక్ష‌గాళ్లా?

‘‘రాజధాని గ్రామాల రైతులు చేపట్టిన ఆందోళన ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసుకోని పక్షంలో ఉద్యమం మరింత ఉధృతం అయినా ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. కక్షపూరిత మనస్తత్వంతో ప్రభుత్వ పెద్దలు వేస్తున్న అడుగుల వల్ల ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ప్రాంతీయ కుంపట్లు రాజుకునే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖను మరింత అభివృద్ధి చేయడం వల్ల భవిష్యత్తులో ప్రాంతీయ ఉద్యమాలకు బీజం వేసిన పాపం జగన్‌ అండ్‌ కోకే దక్కుతుంది’’ అని ఆర్‌కే హెచ్చ‌రించాడు.

చివ‌రికి ఆర్‌కే హెచ్చ‌రించేది ఎలాగుందంటే…‘‘ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల్లారా మీరంతా మా క‌మ్మ‌వాళ్ల మోచేతి నీళ్లు తాగుతూ బ‌త‌కాల్సిందే. మీరంతా మా అధికారాన్ని, అభివృద్ధి ప‌ల్ల‌కీల‌ను మోసే బోయీలే. అమ‌రావ‌తి నుంచి ఏ ఒక్క‌టి త‌ర‌లించినా మేము ఒప్పుకోం. ఒక‌వేళ మీ జ‌గ‌న్ అలా చేస్తే మేము ప్ర‌త్యేక రాష్ట్రం కోసం ఉద్య‌మిస్తాం. ఆ త‌ర్వాత మీ ఇష్టం. ప్రాంతీయ ఉద్య‌మాల‌కు బీజం వేసిన పాపం జ‌గ‌న్‌, ఆయ‌న అనుచ‌రుల‌కే ద‌క్కుతుంది’’ అని అస‌లు విష‌యాన్ని చిట్ట‌చివ‌రికి వ‌చ్చేస‌రికి ఆర్‌కే మ‌న‌సులో ఉండేది వెళ్ల‌గ‌క్కాడు.

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కడుపులో ఏదో పెట్టుకుని బయటకు మరేదో చెప్పడం వల్లే సమస్య జటిలం అవుతోంద‌ని ఆర్‌కే ఆవేద‌న‌. అన్నీ మీరే చెబుతారు సార్‌. మ‌ళ్లీ జ‌గ‌న్ ఏదీ చెప్ప‌డ‌ని అంటే ఎట్లా? అవును అమ‌రావ‌తిలో వేలాది ఎక‌రాలు క‌మ్మ‌వాళ్లు కొన్నార‌ని, ప‌దేళ్లు గ‌డిస్తే దుర్భేద్య‌మైన ఆర్థిక సామ్రాజ్యానికి అధిప‌తుల‌వుతార‌ని, దాన్ని మొగ్గ‌ద‌శ‌లోనే కూల‌గొట్టాల‌నే ల‌క్ష్యం, ఆశ‌యంతో…మీ భాష‌లో చెప్పాలంటే కుట్ర‌తోనే విశాఖ‌కు రాజ‌ధాని త‌ర‌లిస్తున్నాడు. అయితే ఏంట‌ట‌?

చంద్ర‌బాబు త‌న సామాజిక‌వ‌ర్గం బ‌లంగా ఉన్న అమ‌రావ‌తిలో రాజ‌ధాని పెట్టాడు. కానీ జ‌గ‌న్ త‌న సామాజిక‌వ‌ర్గం ఏమాత్రం లేని, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాలు, బీసీలు ఎక్కువగా ఉన్న ఉత్త‌రాంధ్ర‌లో ప‌రిపాల‌నా రాజ‌ధాని పెట్టాల‌ని నిర్ణ‌యించాడు. అయ్యా రాధాకృష్ణ…ఇప్ప‌టికైనా చెప్పండి రాజ‌ధ‌ర్మం త‌ప్పిందెవ‌రో?  రాజ‌ధ‌ర్మం త‌ప్పి రాత‌లు రాస్తున్న‌దెవ‌రో తేల్చుకోండి.

క‌త్తి కంటే కలం గొప్ప‌దని ఇంత‌కాలం చ‌దువుకుంటూ వ‌చ్చాం. అది నిజ‌మేన‌ని అమాయ‌కంగా న‌మ్మేవాళ్లం. కానీ వారం వారం మీ ‘కొత్త‌ప‌లుకు’ చ‌ద‌వుతుంటే కత్తి కంటే క‌లం; క‌లం కంటే కులం గొప్ప‌ద‌ని నిర్ధార‌ణ‌కు వ‌చ్చాం. ‘కొత్త‌ప‌లుకు’ ద్వారా లోకానికి జ్ఞానోద‌యం చేసే మీకు ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాం సార్‌. ధ్యాంక్యూ.