శాటిలైట్ రైట్స్ విషయంలో చాలా పెద్ద పోటీ నడుస్తోన్న విషయం తెలిసిందే. బడా హీరోల సినిమాలైతే సెట్స్ పైకి వెళ్లకముందే లాక్ అయిపోతున్నాయి. కాస్త లేట్ అయినా, ఫస్ట్ షెడ్యూల్ లోనే శాటిలైట్ రైట్స్ అమ్మేస్తున్నారు నిర్మాతలు. అలాంటిది ప్రభాస్ కు చెందిన సాహో సినిమా రైట్స్ మాత్రం ఇప్పటివరకు అమ్ముడుపోలేదు. నమ్మశక్యంగా అనిపించకపోయినా ఇదే నిజం.
అవును.. సాహో తెలుగు శాటిలైట్ రైట్స్ ఇంకా ఓపెన్ లోనే ఉన్నాయి. తెలుగులో ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో మూవీని తీసుకునేందుకు ఏ ఒక్క ఛానెల్ ముందుకు రావడం లేదు. నిజానికి రిలీజ్ కు ముందే ఈ సినిమా రైట్స్ ను బల్క్ లో అమ్మాలని చూశారు యూవీ నిర్మాతలు. కానీ 90 కోట్ల రూపాయల వరకు చెప్పడంతో ఎవ్వరూ ముందుకురాలేదు. అదే సమయంలో అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సంస్థ డిజిటల్ రైట్స్ తీసుకోగా.. జీ గ్రూప్ హిందీ శాటిలైట్ రైట్స్ తీసుకుంది.
సినిమా విడుదల దగ్గరపడడంతో తెలుగు శాటిలైట్ రైట్స్ ను పక్కనపెట్టి థియేట్రికల్ బిజినెస్ పై పడ్డారు నిర్మాతలు. కట్ చేస్తే, సినిమా తెలుగులో ఫ్లాప్ అవ్వడంతో సాహో రైట్స్ తీసుకునేందుకు ఎవ్వరూ ముందుకురాలేదు. నిజానికి సినిమా రిలీజైన కొత్తలో ఈ మూవీ హక్కులు దక్కించుకునేందుకు జెమినీ టీవీ ముందుకొచ్చింది. కొంత మొత్తం కూడా అనుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో ఆ ఛానెల్ తప్పుకోవడంతో అసలు సమస్య మొదలైంది.
అప్పట్నుంచి ఇప్పటివరకు ఈ సినిమాను ఏ ఛానెల్ తీసుకోలేదు. పైగా ప్రైమ్ వీడియోస్ లో ఆల్రెడీ వచ్చేయడంతో దీన్ని తీసుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ రేటు విషయంలో ఇప్పటికీ నిర్మాతలు వెనక్కి తగ్గకపోవడం.